TeluguOne Services
Copyright © 2000 -
, TeluguOne - Comedy - All rights reserved.
ప్రేమలేఖ
**********
ఓ నిరుద్యోగి,వివిధ వృత్తులలో ఉన్న మరికొందరు యువకులు,అందమైన అమ్మాయికి
"ప్రేమలేఖ"రాస్తే వారివారి ధోరణీలో ఇలా ఉంటుంది.
ఒక నిరుద్యోగి రాసే ప్రేమలేఖ.
కుమారి స్వప్నగారికి. వారం రోజుల క్రితం వెంకటేశ్వర టాకీస్ ఎదురుగా షాపింగ్ కాంప్లెక్స్ వద్ద మిమ్ముల్ని చూడగానే పేపర్లో "అభ్యర్థులు కావలెను "అన్న ఉద్యోగ ప్రకటన చూసినంత ఆనందం కలిగింది.
అంతలోనే మీరు నా వైపు సీరియస్ గా చూసిన చూపు "నో వేకన్సీ "అనే బోర్డు చూసినంత బాధ కలిగింది.
ఆ తరువాత రెండుమూడు రోజులు దాకా,చదువు కోసం ఉన్న ఒక ఎకరాన్నీ అమ్మేసినంత బాధపడ్డాను.
కానీ నిన్న నరేంద్రా చిత్రమందిర్ లో,మీరు బుకింగ్ వైపు వెళ్తూ...నా వద్దకు వచ్చి నవ్వుతూ టైం అడిగినప్పుడు మాత్రం నేను చదివిన మాస్టర్ డిగ్రీకి తగిన ఉద్యోగం దొరికినంత సంతోషించాను.పన్నీటి జల్లు వంటి మీ పలకరింపులో ఉద్యోగం దొరికిన ఆరునెలలకే ప్రమోషన్ వచ్చినట్టు ఫీలయ్యాను.
బయోడేటా వంటి మీ రూపం,అప్లికేషన్ లో స్వదస్తూరీతో రాసే మాటలవంటి మీ పలుకులు నన్ను ఆకట్టుకున్నాయి.అప్లికేషనుని పోస్ట్ చేసేందుకు ఉపయోగించే కవరువంటి మీ హృదయంలో నాకు చోటు దొరికితే,రికమండేషన్ లేకుండా ఉద్యోగం సంపాదించుకున్నట్లు సంతోషిస్తాను.
శ్రీ ముళ్ళపూడి వెంకటరమణ చెప్పినట్టు,మీ నుండి సమాధానం వస్తే యుగం ఒక క్షణంలా గడిపేస్తాను. సమాధానం రాని పక్షంలో క్షణం ఒక యుగంలా బ్రతకాల్సిందే!
ఇట్లు
మీ స్నేహాభిలాషి
ఆనందరావు.