TeluguOne Services
Copyright © 2000 -
2025
, TeluguOne - Comedy - All rights reserved.
హలో... రాంగ్ నెంబర్.! - 81
ముచ్చర్ల రజనీ శకుంతల
"ఏంటి సార మీరనేది?" అడిగింది లూసీ విస్మయంగా.
"నిజమే చెబుతున్నాను. నా కోసం ఈ ఫేవర్ చేయాలి. మీరు చెప్పినట్టే చేస్తానని ప్రియంవదకు చెప్పు. కేవలం మనం సన్నిహితంగా వున్నట్టు, ఎఫయిర్ వున్నట్టు నటిస్తాం. ఆ ఆధారాలు దొరికేలా చేస్తాం. ప్రియంవద గెలుస్తుంది. నేను ఓడి ప్రియంవదకు దగ్గరవుతాను. తను గెలిచి, నా మనసుకు దగ్గరవుతుంది. ప్లీజ్"
లూసీ సరేనంది. ప్రియంవదకు ఫోన్ చేసింది. అయితే ఇదంతా జేమ్స్ బాండ్ గమనించాడని, తమ మాటలను టేప్ చేసాడని వాళ్ళిద్దరికీ తెలియదు.
* * *
ఉపసంహారం :-
ఆ రాత్రి లూసీతో తను సన్నిహితంగా వున్నట్టు నటించడం మొదలుపెట్టాడు. కేవలం అదంతా నటనేనని, ఆ విషయం తనకు తెలిసిపోయిందని చెప్పింది ప్రియంవద. ఆ తర్వాత వాళ్లిద్దరి మధ్యా వాగ్యుద్ధం మొదలైంది.
"నేను ఓడిపోయాను. మీ ఇష్టం వున్నట్టు అమ్మాయిలతో తిరగొచ్చు." అంది ప్రియంవద.
"అదేం కాదు. నేనే ఓడిపోయాను. పందెం ప్రకారం నేను అమ్మాయిల వంక కన్నెత్తి చూడను."
"అరె...నేనే ఓడిపోయానంటే...వినవేంటి?"
"ఓడిపోయింది నేనేనంటే అర్థం చేసుకోవేంటి."
అలా ఒకరికొకరు "నేను ఓడిపోయానంటే..నేను ఓడిపోయానని" గొడవ మొదలెట్టారు.
బబ్లూకు చిర్రెత్తుకొచ్చింది.
"అబ్బ..ఎవరో ఒకరు ఓడిపోండి. అవతల నేను స్క్రిప్ట్ రాసుకోవాలి." అన్నాడు.
"స్క్రిప్టా ఏం స్క్రిప్టు?" ప్రియంవద, శ్రీకర్ ఒకేసారి అడిగారు.
"థూ నా యబ్బ జీవితం..అని పధ్నాలుగు లక్షల ఎపిసోడ్లతో ఓ కథ తయారుచేసాను. కథ, స్క్రీన్ ప్లే, టైటిల్ సాంగ్, మాటలూ నేనే." చెప్పాడు బబ్లూ.
జేమ్స్ బాండ్ కు పొలమారింది.
నాయర్, ఇన్స్పెక్టర్ చండిని పెళ్లి చేసుకున్నాడు. ఇన్స్పెక్టర్ చండి తన జాబ్ కు రిజైన్ చేసి, డిటెక్టివ్ ఏజెన్సీలో లేడీ డిటెక్టివ్ గా జాయిన్ అయింది. జేమ్స్ బాండ్ కు వెయ్యి రూపాయల జీతం పెంచాడు నాయర్. శ్రీకర్ విన్సెంట్ ని తీసేసి, దుబాయ్ లో ఎట్ యువర్ సర్వీస్ బ్రాంచికి ఇన్ ఛార్జ్ గా లూసీని నియమించాడు. ఆరోజే లూసీ వీళ్ల దగ్గర సెలవు తీసుకుని దుబాయ్ వెళ్లింది.
ఆ రాత్రి...
"అబ్బ...డెడ్ బాడీని సైతం బెడ్ మీదకి రప్పించే స్టన్నింగ్ స్ట్రక్చర్ నీది." అన్నాడు ప్రియంవదని చుట్టేస్తూ.
"డైలాగ్ మార్చండి." అంది అతని వీపు మీద నఖ క్షతాలు స్పష్టిస్తూ సరిగ్గా అప్పుడే శ్రీకర్ తల దిండుకింద వున్న 56374677 ఫోన్ రింగయింది.
ప్రియంవద ఆ ఫోన్ తీసి సెండ్ బటన్ నొక్కి "హలో...రాంగ్ నెంబర్" అనేసి ఎండ్ బటన్ నొక్కింది. రేపట్నుంచీ ఈ నెంబర్ నాకు తప్ప, ఇంకెవ్వరికైనా తెలిసిందో చంపేస్తాను" అంది ప్రియంవద.
"అవును..రైట్ నెంబర్ ఇక్కడే వుంది. ఇక రాంగ్ నెంబర్లతో పనేమిటి?" అంటూ ప్రియంవదను మరింత దగ్గరకి లాక్కున్నాడు శ్రీకర్.
సరిగ్గా అదే సమయంలో బబ్లూ డైలీ టీవీ సీరియల్ కు పేపర్ బండిల్స్ మధ్య కూచుని పద్నాలుగు లక్షల ఎపిసోడ్లకు గానూ కథ తయారు చేస్తున్నాడు.
(అయిపోయింది)