TeluguOne Services
Copyright © 2000 -
2025
, TeluguOne - Comedy - All rights reserved.
హలో... రాంగ్ నెంబర్.! - 80
ముచ్చర్ల రజనీ శకుంతల
ఆ నిర్ణయానికి రోజులు...నెలలు కట్టుబడి వున్నాడు. జేమ్స్ బాండ్ ఏ ఆధారమూ సంపాదించలేకపోయాడు. ప్రియంవద ఎంత రెచ్చగొట్టినా శ్రీకర్ టెంప్టవ్వలేదు. ఒకరికొకరు గెలవాలనే పట్టుదలతో వున్నారు.
సరిగ్గా అదే సమయంలో శ్రీకర్ తాను ఓడిపోవాలని అనుకున్నాడు. సరిగ్గా అరగంట క్రితం అతను ఆ సంఘటన చూడకపోయుంటే, తను ఓడిపోవాలనే నిర్ణయానికి వచ్చేవాడు కాదు.
సరిగ్గా అరగంట క్రితం....
* * *
శ్రీకర్ మనసులో చిన్నపాటి బ్లాంక్ నెస్. మానసికంగా, శారీరకంగా లూసీ దగ్గరకి వెళ్లి కాసేపు రిలాక్స్ అవ్వాలనుకున్నాడు. లూసీ గురించి తెలిసినప్పట్నుంచీ ఆమె అంటే ప్రత్యేకమైన అభిమానం ఏర్పడింది.
విన్సెంట్ హైదరాబాద్ కు ఫోన్ చేసి లూసీ గురించి వాకబు చేసి, ఆమె చాలా చెడ్డదని, క్యారెక్టర్ లేస మనిషని చెప్పాడు. లూసీ ఎందుకు గతం గురించి అడగొద్దని అన్నాడో అర్థమైంది. దుబాయ్ లో తెలిసిన ఫ్రెండ్ ద్వారా ఎంక్వయిరీ చేయిస్తే లూసీ ఏ పరిస్థితిలో ఇండియా వచ్చిందో తెలిసింది. ఆమె వ్యక్తిత్వం మీద గౌరవం కలిగింది.
లూసీని కలవడానికి ఆమె ప్లాటుకు వెళ్లేసరికి ప్రియంవద వుంది. శ్రీకర్ షాకయ్యాడు. ప్రియంవదకు లూసీ తెలుసా? సరిగ్గా అప్పుడే వాళ్ల మాటలు విన్నాడు.
"లూసీ...ఈరోజుతో మా గడువు ముగిసిపోతుంది. నాకు ఓడిపోవడానికి ఎటువంటి అభ్యంతరం లేదు. ఆయన ముందు ఓటమి నాకు సంతోషమే. కానీ ఈ ఓటమి ఖరీదు తను నాకు దూరమవ్వడం. ఈ పందెం విలువ రెండు జీవితాలు ఐ లవ్ శ్రీకర్...ఆయనంటే నాకు చాలా చాలా ఇష్టం. నిజానికి పందెం వేసింది కూడా తనను మనసులో బలంగా ప్రతిష్టించుకోవాలనే, పందెం మొదలైనప్పట్నుంచీ తను ఎవ్వరితోనూ ఎఫయిర్ పెట్టుకోలేదు. నువ్వంటే తనకు ఇష్టం...ఈ ఒక్కరోజు..."
"ఈ ఒక్కరోజు...చెప్పండి మేడమ్! ఏం చేయమంటారు?"
"తప్పుగా అనుకోకపోతే తనని టెంప్ట్ చేయాలి. ఈ ఒక్కరోజుతో అతను ఓడిపోయి నా శ్రీకర్ గా మిగలాలి."
"అందుకోసం నన్ను ఓడిపోయి, క్యారెక్టర్ లేని మనిషిగా మిగిలిపొమ్మంటారా మేడమ్."
ప్రియంవద తల వంచుకుంది. "సారీ లూసీ. నా స్వార్థం కోసం...ఎక్స్ ట్రీమ్ లీ సారీ" అంటూ చకచకా బయటకు వెళ్లిపోయింది.
* * *
శ్రీకర్ షాకయ్యాడు.
ప్రియంవద గెలుపు వెనక వున్న తపన అతనికి అర్థమవుతూనే వుంది. తను ఎందుకు గెలవాలని అనుకున్నాడు. తను గెలిచి, ప్రియంవదని ఓడించి సాధించేదేమిటి? అందమైన ఓటమే తనక్కావాలి. ఆ నిర్ణయం అతనికి ఆనందాన్ని ఇచ్చింది. ఒక్కోసారి గెలుపు కన్నా ఓటమే అందంగా వుంటుంది.
* *