TeluguOne Services
Copyright © 2000 -
2025
, TeluguOne - Comedy - All rights reserved.
సిల్లీఫెలో - 105
- మల్లిక్
సీత చెప్పిన మాటలు విని బుచ్చిబాబు వంక ఆశ్చర్యంగా చూశాడు మోహన్.
బుచ్చిబాబు తల వొంచుకున్నాడు.
"ఇది నిజమేనా?" అన్నాడు మోహన్.
"ఆయన్ని ఎందుకు అడుగుతారు? నేను చెప్తున్నా కదా... నేను ఆయన భార్యని కాను. స్నేహితురాలిని. మేం కలిసి బ్రతుకుతున్నాం. హఠాత్తుగా ఆయన తల్లిదండ్రులు రావటంచేత నేను మీ ఇంట్లో తల దాచుకోవడానికి రావలసివచ్చింది. మీకు చాలా శ్ర్హమ కలిగించాం. సారీ!" అంది సీత.
"అయ్యో! ఇందులో శ్రమేం ఉందండీ... ఇట్సే ప్లజర్... కానీ ఈ టాపిక్ ని ఇక్కడితో ఆపేద్దాం... మా ఆవిడ వింటే బాగుండదు" అన్నాడు మోహన్ ఇబ్బందిగా లోపలికి చూస్తూ.
"మనకెంత విలువుందో చూశావ్ గా?" సీత బుచ్చిబాబు చెవిలో అంది.
"మొదట్లో అలానే ఉంటుంది.... రాను రాను అదే అలవాటైపోతుంది" బుచ్చిబాబు సీత చెవిలో అన్నాడు.
ఇంతలో రామలక్ష్మి కాఫీ కప్పులో వచ్చింది.
అందరూ కాఫీలు తాగారు. కాస్సేపు కబుర్లు చెప్పుకున్నాక బుచ్చిబాబు. లేచి నిలబడ్డాడు.
"నేనిక వెళ్తాను"
"అప్పుడేనా?" అంది సీత.
"వెళ్ళాలి" అన్నాడు బుచ్చిబాబు.
"రేపు ఆఫీసుకు వస్తున్నావ్ కదూ?" అడిగాడు మోహన్.
"ఊ... వస్తాను... నేను రానందుకు ఏకాంబరం ఈవేళ ఏమైనా అన్నాడా?"
"లేదు. ఆ కిల్లారి కిత్తిగాడు నిన్నేమీ అనడుగా?" నవ్వుతూ అన్నాడు మోహన్.
"నేనిక వస్తానురా... వస్తానండీ..." బుచ్చిబాబు మోహన్ కీ, రామలక్ష్మీకీ చెప్పి బయటికి వెళ్ళాడు.
మోహన్ దంపతులు అక్కడే ఆగిపోయారుగానీ సీత గుమ్మం దాకా బుచ్చిబాబు వెనకాలే వెళ్ళింది.
"వస్తాను సీతా... చెప్పాడు బుచ్చిబాబు.
"అయినా కాస్సేపుంటే నీ సొమ్మేంపోయింది?" అంది సీత చిరుకోపంగా.
"మా అమ్మానాన్నలు కనకదుర్గ గుడికి తీస్కెళ్ళమని అడిగారు. ఇప్పటికే చీకటైపోయింది. ఇంకా ఆలస్యం అవుతే గుడి కట్టేస్తారు."
"నాకు ఇక్కడ బోరుకొట్టి చస్తున్నా... మీ అమ్మానాన్నా ఎప్పుడు వెళ్ళిపోతారు?"
"ఏమో మరి... నేనిలా అడగను?" నిస్సహాయంగా అన్నాడు బుచ్చిబాబు.
"రేపు ఆఫీసుకి వెళ్ళే ముందు ఇక్కడికి వచ్చి నాకు కనిపించాలి. సాయంత్రం ఆఫీసు నుండి ఇక్కడికి త్వరగా రావాలి."
"అలాగే.. ఇంక వస్తానూ..."
సీత బుగ్గమీద చిటికేసి అక్కడినుండి బయలుదేరాడు బుచ్చిబాబు.
|