మరేం ఫర్వాలేదు!

మరేం ఫర్వాలేదు!

ఇద్దరు భారతీయ పౌరులు చేపల వేటకని ఓ చిన్న పడవని తీసుకుని బంగాళాఖాతంలోకి వెళ్లారు. ఇంతలో కారుమబ్బులు కమ్ముకున్నాయి. పగలు కాస్తా చీకటిగా మారిపోయింది. పడవ కాస్తా కొట్టుకుపోయింది. అలా వెళ్లీ వెళ్లీ పడవ ఓ చిన్న ద్వీపం దగ్గరకి చేరుకుంది. ఆ ద్వీపంలోకి అడుగుపెట్టిన ఇద్దరు స్నేహితులకీ ఏం చేయాలో పాలుపోలేదు. అక్కడ తినడానికి తిండి లేదు. తాగడానికి నీరు లేదు. పరిస్థితి ఇలాగే ఉంటే ఓ మూడు, నాలుగు రోజుల్లో వాళ్లు చనిపోవడం ఖాయం. ఈ విషయాన్ని తల్చుకుని అందులో మొదటివాడు కుమిలికుమిలి ఏడవడం మొదలుపెట్టాడు. కానీ రెండోవాడు మాత్రం రికామీగా కూర్చున్నాడు.
‘అదేంటీ! నీకు చచ్చిపోతామన్న భయం వేయడం లేదా?’ అంటూ అడిగాడు మొదటి వ్యక్తి.
‘ఇందులో భయం ఎందుకూ! నన్ను తప్పకుండా రక్షిస్తారు’ అని బదులిచ్చాడు రెండో వ్యక్తి.
‘నీకు దేవుడంటే అంత నమ్మకమా!’ ఆశ్చర్యంగా అడిగాడు మొదటివాడు.
‘నేను నాస్తికుడిని కదా!’ అంతే ఆశ్చర్యంగా బదులిచ్చాడు రెండోవాడు.
‘మరైతే ఎవరు వచ్చి నిన్ను రక్షిస్తారని అంత నమ్మకంగా చెబుతున్నావు’
‘పోయిన ఏడాది మన పొలంలో పంట వేయడానికని బ్యాంకుల దగ్గర్నుంచీ యాభైవేల అప్పు తీసుకున్నాను’ చెప్పుకొచ్చాడు మొదటివాడు.
‘అయితే’
‘అయితే ఏంటి అయితే! నేనేమన్నా విజయ్‌ మాల్యానా, బ్యాంకులు నన్ను చూసీ చూడకుండా వదిలేయడానికి? సాధారణ రైతుని! ఖచ్చితంగా బ్యాంకులు నన్ను వెతుక్కంటూ ఇక్కడికి వస్తాయి... చూస్తూండు!’ ధీమాగా చెప్పాడు రెండోవాడు.
రెండోవాడు ఊహించినట్లుగానే మర్నాటికి బ్యాంకు అధికారులు అతణ్ని వెతుక్కుంటూ ఆ ద్వీపానికి చేరుకున్నారు. కానీ....
రైతుని వదిలేసి పడవని తీసుకువెళ్లిపోయారు !!!

- నిర్జర.