ఇప్పుడు చెప్పండి!

 

ఇప్పుడు చెప్పండి!

ఇద్దరు స్నేహితులు వేట కోసమని అడవిలోకి వెళ్లారు. వాళ్లు ఆ చెట్టు వెనుకా, ఈ పుట్ట వెనుకా నక్కి... ఓ కుందేలునీ, రెండు పిట్టల్నీ పట్టారు. ఇంతలో ఎక్కడి నుంచి వచ్చిందో కానీ ఓ ఎలుగుబంటి అకస్మాత్తుగా వాళ్ల మీద దాడి చేసింది. మొదటివాడిని చీల్చి చెండాడేసింది. ఎలుగుబంటి అలా వెళ్లగానే ఇలా రెండోవాడు అక్కడికి చేరుకున్నాడు. అతని స్నేహితుడి పరిస్థితి చూసి వెంటనే అటవీ శాఖకు ఫోన్‌ చేశాడు.

‘హలో నేను నల్లమల అడవి నుంచి మాట్లాడుతున్నానండీ, ఓ ఎలుగుబంటి నా స్నేహితుడిని చంపేసినట్లుంది. అతను ఎంత లేపినా లేవడం లేదు!’ అన్నాడు రెండోవాడు.

‘అవునా పాపం! మీకు మా ప్రగాఢ సానుభూతి. ఇంతకీ మీ స్నేహితుడు చనిపోయాడా లేకపోతే గాయపడ్డాడా అన్నది ఖచ్చితంగా చెప్పగలరా!’ అంటూ ఫోన్లోని అధికారి అడిగాడు.

‘ఖచ్చితంగా చెప్పి తీరాలా. అయితే ఒక్క నిమిషం ఉండండి!’ అంటూ ఆగాడు రెండోవాడు. అవతల ఫోన్లో ఉన్న అధికారికి ఓ తుపాకీ పేలిన శబ్దం వచ్చింది. ఆ తరువాత రెండోవాడి గొంతు వినిపించింది ‘ఇప్పుడు ఖచ్చితంగా చెప్పగలను సార్‌! నా స్నేహితుడు చనిపోయాడు. ఇప్పుడు చెప్పండి ఇంకేం చేయాలో’ అంటూ!