TeluguOne Services
Copyright © 2000 -
, TeluguOne - Comedy - All rights reserved.
అమెరికా మాటలకూ అర్థాలే వేరులే
-రాజేష్
“ఒరేయ్... అలా ముప్పొద్దులా తిని బలవక పొతే కాస్త మాకూ పెట్టొచ్చు కదా?’'... ఆదివారం కదా కాస్త ఆలస్యంగా నిద్ర లేద్దామనుకున్న నేను మా పెద్దాడి కేకలకు ఉలిక్కిపడి లేచాను. టైము చూస్తే ఏడున్నర... ఇంత పొద్దున్నే ఎవరిమీద వాడు అలా విరుచుకుపడుతున్నాడా అని అనుమానం వచ్చింది.
ఆరు బయటకు వచ్చి చూసేసరికి మా పెద్దాడు అదే మా బాబిగాడు పక్కింటోళ్ళ నానిగాడి మీద కస్సుబుస్సులాడుతున్నాడు. ‘ఇదేంటబ్బా. వీడికి మనింట్లో ఏం తక్కువయిందని నానిగాడి తిండి మీద పడ్డాయి వాడి కళ్ళు’ అనుకుంటూ వాళ్ళమధ్య జరిగే సంభాషణను గమనించసాగాను.
మళ్ళీ మా బాబిగాడు “ఒరే నానిగా... మీ ఇంట్లో అందరూ తెగ తినడం వలెనే మాకు తిండి సరిపోవట్లేదు.” గట్టిగా అరిచాడు.
అందుకు నానిగాడు. ఏం మీనాన్న మీకేమీ కొనివ్వట్లేదా?” అమాయకంగా ఎదురు ప్రశ్న వేశాడు. నాకైతే తల కొట్టేసినట్లయింది.
“మానాన్న కొనివ్వకపోవడం కాదు, రోజూ పాలవాడు మీ ఇంట్లో పాలు పోసి వచ్చి మాకేమో తక్కువ పాలు పోస్తున్నాడు. అవేమో మాకు సరిపోవట్లేదు. ఆ పచారీ కొట్టువాడేమో మేం వెళ్ళినప్పుడల్లా సరుకులు ఇప్పుడే అయిపోయాయని చెబుతున్నాడు” ఆరోపించాడు బాబిగాడు.
మా పిల్లలిద్దరూ ఈమధ్య బాగా లావెక్కుతున్నారని డాక్టర్ దగ్గరకు తీసుకువెళ్తే వాళ్ళ తిండి తగ్గించమనీ, పాల సంబంధ పదార్థాలు తినకుండా చూడమని సలహా ఇచ్చాడు. అందుకే వాళ్ళమ్మ తిండి తగ్గించి ఉంటుంది. దానికి బాబిగాడు పక్కింటోళ్ళ మీద ఎగురుతున్నాడన్న మాట. అయినా నాకూ ఓ అనుమానం వచ్చింది.
‘ఏంటీ ఇంట్లో నిజంగా ఇంత కొరత ఉందా? మరి మా ఆవిడ నాకెప్పుడూ చెప్పలేదేంటీ?’ అనుకున్నాను. ఆ తర్వాత గుర్తుకొచ్చింది వచ్చిన పాలు వచ్చినట్లుగానే నాకు కాఫీ పెట్టివ్వక ముందే మా పిల్లలిద్దరూ లాగించేస్తారు, అటుపై ఏమైనా మిగిలితేనే మాకు కాఫీ గట్రా, అదీ కాకుండా పాపం నానిగాడి వాళ్ళకన్నా మేమే కొంచెం ఆర్ధిక పరంగా ఉన్న వాళ్లమని చెప్పొచ్చు. అయినా మా ఇంట్లో ఏ ఇబ్బంది వచ్చినా వాళ్ళమ్మ, నాన్న వెంటనే ఆడుకుంటారు.
వాళ్ళింట్లో ఉన్నా లేకపోయినా అడగగానే సర్దుబాటు చేస్తారు. ఇక పచారీ కొట్టువాడి విషయానికి వస్తే నా శ్రీమతి నెలసరి సరుకులన్నీ ఒక్కసారే తీసుకుని, డబ్బులు మాత్రం కొంచెం కొంచెంగా ఇస్తుంది. దాంతో మండుకొచ్చిన షాపువాడు మాకు సామాన్లు ఇవ్వాలంటేనే విసుక్కుంటాడు.
మరి అలాంటప్పుడు అన్యాయంగా పాపం పక్కవాళ్ళ తిండి తిప్పలమీద ఆడిపోసుకోవడం తప్పు కదూ... నా ఆలోచనలు సాగుతుండగానే మా చంటిది కూడా వాళ్ళన్నయ్యకు వంతపాడ్డం మొదలు పెట్టింది. 'అవున్రా అన్నాయ్, మొన్న రేషన్ కొట్టకువెళ్ళానా, అక్కడ నానిగాడికి మాత్రం కిరోసిన్ వేసి నావంతు వచ్చేసరికి స్టాక్ అయిపోయిందన్నాడు.
వాళ్ళు కిరోసిన్ కూడా తాగేస్తున్నార్రా’ అంది. నాకంతా అయోమయంగా అనిపించింది. ఇప్పుడు అన్నా చెల్లెళ్ళిద్దరూ పక్కింటోళ్ళ తిండి తిప్పల మీద పడి ఏడవడమెందుకోనాకయితే అర్ధం కాలేదు. నిజం చెప్పాలంటే వాళ్ళు తినే తిండి ఖర్చుల కన్నా మాయింట్లో తిండి ఖర్చులే ఎక్కువ. అదీకాక వాళ్ళు ఉన్నంతలోనే సంసారాన్ని గుట్టుగా లాగించేస్తారు.
మావాళ్ళు అయితే ఏది అడిగితే అది కొనిచ్చేదాకా వదిలిపెట్టరు. సాధించే దాకా వదలరు. ఈ స్థితిలో వారినలా ఆడిపోసుకోవడం నాకైతే తప్పనిపించింది. అయినా ఇంత తతంగం జరుగుతుంటే మా ఇల్లాలు ఏం చేస్తుంది? అనుకుంటూ అటూ ఇటూ చూసేసరికి ఓ పక్కన నిల్చొని వాళ్ళ సంభాషణ వింటూ ఎంజాయ్ చేస్తుంది. నాకు ఆశ్చర్యం అనిపించింది వెళ్ళి మావాళ్ళిద్దరినీ పట్టుకుని నాలుగు తగిలించక అదేదో ఘనకార్యమైనట్లు ముసిముసినవ్వుతోంది.
నాకు విపరీతమైన కోపం వచ్చింది. ‘ఏమేవ్’ అరిచాను గట్టిగా. వెంటనే మాఆవిడ పరిగెట్టుకొచ్చింది. ‘అయ్యో! అప్పుడే లేచారా? ఉండండి, కాఫీ తెస్తాను; లోపలికి వెళ్ళబోయింది.’ ఒక్క నిమిషం ఆగు, అసలేం జరుగుతుందిక్కడ. ఇక్కడ మన పిల్లకాయలిద్దరూ పక్కింటోళ్ల తిండిమీద పడి ఏడుస్తున్నారే? అయినా తప్పని చెప్పాల్సింది పోయి నువ్వు కూడా వాళ్ళ మాటల్ని విని ముచ్చట పడతావేంటీ?’. కోపంగా అడిగాను.
అందుకు నా ఇల్లాలు ‘అయ్యో మన పిల్లలేమన్నారండీ? మీరు బాగా డెవలప్ అవుతున్నారూ, అందుకే మీ తిండి కూడా పెరిగిందీ అని పొగుడుతున్నారంతే!’ అంది. ఒక్క క్షణం నాకేమీ అర్థం కాలేదు. ఓ వైపు వాళ్ళు అన్నేసి మాతలంటూ ఉంటే అవి ప్రశంసలంటుందేమిటీ? అదే ప్రశ్నను మా ఆవిడని అడిగా, అసలు సంగతి ఏమిటని.
అందుకు మా ఆవిడ నాపైవు విచిత్రంగా చూసి ‘అయ్యో మీరెంత అమాయకులండీ. మొన్నటికి మొన్న అమెరికా విదేశాంగశాఖ మంత్రి కండోలిజా రైసు ఏమందీ? భారత్, చైనా వాళ్ళు తెగ తినడంవల్లే ఆహారం కొరత ఏర్పడింది అని నోరు పారేసుకుందా లేదా? ప్రశ్నించింది నన్ను. ‘అవును, అయితే..’ ‘దీనికి ఆ దేశ ప్రెసిడెంట్ బుష్ గారు కూడా “అవునవునూ, అమెరికాలో కంటే భారత్ లో మధ్య తరగతి ప్రజలు ఎక్కువ, వాళ్ళు బాగా తినబట్టే మనకు ఆహార కొరత ఏర్పడింది, ధరలు కూడా పెరిగిపొయాయీ అన్నాడా లేదా?” మళ్ళీ అడిగింది.అవును అన్నాడు” సమాధానమిచ్చాను.
‘అప్పుడు మనవాళ్ళందరూ బుస్సుమీద కస్సుబుస్సులాడరు. మా తిండి మీద పది ఏడుస్తున్నారా? అని గట్టిగా అర్థం చేసుకున్నారూ, అసలు ఆయన భారతీయుల్ని కించపరచలేదూ ప్రశంసించారంతే’ అంటూ ప్రకటించారు. భారత్ లోమధ్య తరగతి ప్రమాణాలు బాగా పెరిగాయనీ, కాబట్టి గతంలో కన్నా ఇప్పుడు ఆహారానికి, ఇతర సౌకర్యాలకు ఖర్చు చేయగలుగుతున్నారన్నది బుష్ గారి మాటలకు అర్థమని వివరణ ఇచ్చారు.
అలాగే మన పిల్లలు కూడా! పక్కింటోళ్ళను తిట్టడం లేదూ, పొగుడుతున్నారంతే.’ అంది తన కొడుకులో బుష్ ని, కూతుర్లో కండోలిజారైసునీ చూసుకుని మురిసిపోతూ.
ఈ సమాధానంతో నా బుర్ర తిరిగిపోయింది. అప్పుడే రేడియోలో పాటోస్తోంది “ఆడవారి మాటలకూ అర్ధాలే వేరులే” అని.... కానీ ఈ సీనంతా చూశాకా నాకనిపించింది ‘అమెరికా మాటలకూ అర్థాలే వేరులే’ అని.
|