Saradaga Kasepu-2

సరదాగా కాసేపు-2

కన్నోజు లక్ష్మీకాంతం

సరదాగా కాసేపు నవ్వుకోవడం వల్ల శరీరంలోని అన్ని భాగాలు కదిలి,అవి వాటి కార్యక్రమాలని సజావుగా నిర్వర్తిస్తుంటాయి.అయితే సరదాగా కాసేపు నవ్వుకుందాం !

ఒకావిడ డాక్టర్ దగ్గరికి వెళ్లి " డాక్టర్ గారు...నేను గత నాలుగు రోజులుగా జ్వరంతో బాధపడుతున్నాను " అని మొదలు పెట్టి ఆవిడ కష్టాలన్నీ చెప్పేస్తుంటే, వెంటనే డాక్టర్ గారు " ఏదీ, ఒకసారి నోరు తెరవండి " అన్నాడట.

దాంతో ఆవిడ నోరు తెరిచింది. అయినా డాక్టర్ గారు, తెరిచినా ఆమె నోరుని గమనించకుండానే గబగబా మందులు రాసిచ్చాడు.

“ అయ్యో ! మీరు నా నాలిక చూడనేలేదుగదండీ " అవి ఆవిడ అనగానే వెంటనే డాక్టర్ "అక్కర్లేదమ్మా. మీరు కాసేపు మాట్లాడకుండా వుండాలనే నోరు తెరిపించాను " అని అన్నాడంట.

ఇలా డాక్టర్ల జోక్స్ మనకు చాలా వినిపిస్తుంటాయి మనకు. సరదా అనేది రెండు వైపులా వుండాలి.అప్పుడే మనం ఆ సరదాని ఎంజాయ్ చేసిన వాళ్ళం అవుతాం. ఏ ఒక్క సైడ్ రిసీవర్ సరిగ్గా పనిచేయకపోయిన అదేమంత థ్రిలింగ్ గా వుండదు.

“ ఏమోయ్...యీ మధ్య ఒళ్ళంతా చీమలు పారుతున్నట్టనిపిస్తోందే..?” భర్త,భార్యతో చెప్పగానే,దానికి వెంటనే భార్య

" ఎందుకైనా మంచిదీ...షుగర్ టెస్ట్ చేయించుకొండీ " అని పక పక నవ్వుతుంటే,అది చూసిన భర్త ఏమాత్రం చలించకపోవడంతో గబుక్కున నవ్వుని ఆపేసిందంటా ఆవిడ.

అది జోక్ అని,దానికి నవ్వాలని తెలియని ఇలాంటి వాళ్ళు కూడా మనకు అప్పుడప్పుడు ఎదురుపడుతుంటారు.

కొద్ది రోజులుగా ఒక బట్టలషాపు ముందు...జుట్టు గడ్డం పెరిగి,మాసిన బట్టల్లో అసహ్యంగా వున్నాఓ అనాకారి, పిచ్చి పిచ్చిగా పాటలు పాడుకుంటూ నిల్చోవడం వల్ల ఆ షాపుకి కస్టమర్ల రాక తగ్గిపోయింది.

ఏం చేయాలో అర్థం కాక,ఆ షాప్ యజమాని తప్పని పరిస్థితిలో వాడి దగ్గరికి వెళ్ళి" చూడయ్యా...నువ్వో పనిచెయ్.ఆ కార్నర్ షాపు ముందేళ్ళి పాడుకుంటూ నిల్చో.రోజుకో యిరవై రూపాయలు ఇస్తాను. సరేనా !” అన్నదంటా.

అందుకు ఆ పిచ్చివాడు " చాల్లెండి సార్.ఆ షాప్ వాళ్ళే రోజుకో యాబై రుపాయలిస్తూ యీ షాప్ ముందు నిల్చోపెట్టారు " అని చెప్పడంటా.

అంతే...నోటిమాట పడిపోయింది ఆ షాపు యజమానికి. అలా బిజినెస్ కాంపిటేషన్లో ఎవరెవరూ ఎలాంటి జిమ్మిక్కులు చేస్తారో అర్థం కాదు.

నవ్వితే పోయేది ఏమి లేదు...మానసిక ఒత్తిడి,ఆందోళన,అనారోగ్యం తప్ప!అందుకని సరదాగా కాసేపు నవ్వండి.నవ్వించండి.