TeluguOne Services
Copyright © 2000 -
2025
, TeluguOne - Comedy - All rights reserved.
తప్పెవరిది
పద్మశ్రీ
బుర్ర గిర్రున తిరిగిపోతూంటే నెత్తిని గట్టిగా పట్టుకున్నాడు.
నిద్రతోపాటు తలని ఎవరో బండతో బాదుతున్నంత నొప్పి కలుగుతోంటే, అలసి అలాగే పక్కమీద వాలాడు. క్షణంసేపు కళ్ళు మూసుకుని ఆ వెంటనే చెంగున లేచి కుర్చీలో కూలబడ్డాడు. టైం చూశాడు.
గుండె గుభేళ్ మంది.
రాత్రి రెండు దాటింది. పూర్తి చేయాల్సినవి చాలా ఉన్నాయి. మెదడు సహకరించడం మానేసింది. భయం భయంగా ఉంది. టెన్షన్ టెన్షన్ గా వుంది. ఆ టెన్షన్ కి నిద్ర మాయమైపోయింది కానీ తలనొప్పి మాత్రం తగ్గలేదు.
కాన్సన్ ట్రేట్ చేయడానికి శతవిధాలా ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. టేబుల్ పై గుట్టలా పేరుకుని వున్న పుస్తకాలని చూడగానే తలనొప్పి మరింత పెరిగింది. పక్కనే ఉన్న ప్లాస్కులో నుండి కాస్తంత కాఫీని ఇరవయ్యోసారి గ్లాసులోకి వంపుకుని తాగాడు. అయినా మార్పు లేదు.
అతని పరిస్థితి అంతా ఆగమ్యగోచరంగా మారిపోయింది. తీవ్రమైన ఒత్తిడికి గురవుతున్నాడు. క్రికెట్ పరిభాషలో చెప్పాలంటే రెండు బంతుల్లో ఇరవై రెండు పరుగులు చెయ్యాలి. అలా చేస్తేనే అతను విజయం సాధిస్తాడు. అలా చేయడం దాదాపు అసాధ్యం అని తేలిపోయింది. తనపై తనకే జాలి కలిగింది. ఏడుపొచ్చింది, పిచ్చపిచ్చగా వుంది, తిక్కరేగుతూంది.
క్రికెట్లో ఓవర్ లో ఆరు పరుగులు చేసినా చాలు, కానీ ఇక్కడ మాత్రం ఓవర్ కి అరవై ఆరు పరుగులు చెయ్యాలి. అది ఆర్డర్... అంతే...! మళ్లీ తనమీద తనకే జాలి కలిగింది. ఉదయం తండ్రి అన్న మాటలు గుర్తుకొచ్చాయి.
“ఇది నా ప్రిస్టేజి సమస్య. నువ్వు గనక ఇందులో సక్సెస్ కాలేకపోతే కాళ్ళు విరగ్గొడతాను జాగ్రత్త.... తెల్లవార్లు కంటిమీద కునుకు రానీకు వార్నింగివ్వడమే కాదు అతని చేతిలో టీ ప్లాస్కు పెట్టి, గదిలోకి నెట్టి బయటి నుండి బోల్టు కూడా పెట్టేసాడు.
అలా తాను ప్రస్తుతం బంధీ కాబడ్డాడు. మళ్ళీ తనపై తనకే జాలేసింది... ఆ తర్వాత జీవితంపై విరక్తి కలిగింది.... మళ్ళీ తనపై తనకి నమ్మకం కలిగించుకోవడానికి తీవ్రంగా ప్రయత్నించి కొద్దిగా సక్సెస్ సాధించి, తిరిగి తన కార్యరంగంలోకి దిగిపోయాడు.
అలా ఆరోజు గడిచింది. తెల్లారింది. ఠంచనుగా పదిగంటలకి ఆ గదిలోకి అడుగుపెట్టాడు. వరుసగా ఓ క్రమపద్దతిలో పేర్చిన టేబుళ్ళ మధ్యలోనుండి నడుచుకుంటూ వెళ్ళి, తనకి కేటాయించిన నంబరులో కూర్చున్నాడు.
రాత్రంతా నిద్రలేకపోవడంవల్ల రెండు కళ్ళు సూదులతో పొడుస్తున్నట్టు మండుతున్నాయి. గదిలో ఉన్న స్టూడెంట్స్ అందరి పరిస్థితి అలాగే ఉంది. మరో అయిదు నిమిషాలలో ఎగ్జామ్ స్టార్టయింది. క్వశ్చన్ పేపర్ తన చేతిలోకి వచ్చింది.
అందులో ఉన్న క్వశ్చన్లకి తాను ప్రిపేరయిన క్వశ్చన్లకి ఎంత మాత్రమూ సంబంధం లేకుండా పోయింది. దాంతో అతనికి మరింత టెన్షన్ పట్టుకుంది తీవ్రమయిన ఒత్తిడికి లోనయ్యాడు. కళ్ళముందు తన తండ్రి ఉగ్రరూపం కనిపించింది, ర్యాంక్ ఖచ్చితంగా సాధించాలన్న కరస్పాండెంట్ హెచ్చరిక వినిపించింది, అంతే... అతను లేచాడు.
ఆ గదిలోనుండి బయటికి వచ్చాడు. ఆ బిల్డింగ్ పైకి ఎక్కి క్రిందికి దూకాడు. రక్తపు మడుగులో నిర్జీవంగా ఓ స్టూడెంట్. అతని చావుకి కారణం ఎవరు?
సంవత్సరకాలంగా కొడుకు చదువుతున్నాడా? లేడా? అని కనుక్కోవడం మానుకుని పరీక్షా సమయంలో కన్న కొడుకుని గదిలో పడేసి కట్టడిచేస్తేనే శ్రద్ధగా చదువుకుంటాడనుకున్న మూర్ఖపు ప్రవర్తన కలిగిన అతని తండ్రిదా?
తన కాలేజీ పరువు నిలబెట్టుకోవడం కోసం సరయిన విద్యని బోధించకుండానే ర్యాంక్ తెచ్చుకోవాలని హుకుం జారీచేసిన ఆ కరస్పాండెంట్ దా...? సిలబస్ పేరుతో బస్తాడు పుస్తకాలు విద్యార్థులతో మోయిస్తూ వారి మెదడుకి పదును పెడుతున్నామన్న భావనతో వారి మెదడుని పూర్తిగా పాడుచేస్తున్న ఈ ప్రభుత్వానిదా...? తప్పెవరిది....?
|