Kurralandoi Kurrallu

కుర్రాళ్ళండోయ్ కుర్రాళ్ళూ

పద్మశ్రీ

'కుర్రాళ్ళండోయ్ కుర్రాళ్ళూ.... కుళ్ళబొడుస్తున్న కుర్రాళ్ళు.. అయ్యల అండ చూసి కుర్రాళ్ళూ.... రెచ్చిపోతున్న కుర్రాళ్ళూ....’ నేటి పొలిటికల్ లీడర్లు ప్రజాసేవలో నిండా మునిగిపోయామని అనుకుంటుంటే వారి పుత్రరత్నాలేమో ప్రజల్ని తన్నడంలో చాలా బిజీ అయిపోయారు.

ఆ పుత్రరత్నాలని ఏమీ చేయలేక పైవిధంగా పాట పాడుకుంటున్నారు ప్రజలు. ఆ పాటకి పోలీసులు తాళం వేస్తున్నారు. తాళం అంటే సెల్లుకి వేసే తాళం కాదండోయ్.... సాంగుకి వేసే తాళం అన్నమాట. పొతే... రాజకీయరంగంలో ఫుల్లుగా రాణించాలంటే మొదటి మెట్టు ఇలా రౌడీయిజం ప్రదర్శించడమే అన్నది రాజకీయనాయకుల స్వీయానుభవమేమో.

అందుకే తమ వారసులని ముందు ప్రజలమీదికి ఎగేసి, వారిని చిదకబాదుతూంటే ఆనందంతో చంకలు కొట్టుకోవడం చేస్తున్నారు.

ఆ తరువాత షరామామూలుగా మీడియా ముందుకు వచ్చి ‘నా కొడుకు చాలా అమాయకుడు, నోట్లో వేలు పెట్టినా కొరకడు... అప్పుడెప్పుడో నేను ఇలాగే వాడినోట్లో వేలుపెడితే చీకి వదిలేశాడు.అది నా కొడుకు నిజాయితీ ’ అని అనడం.

అతని మాటలు అర్థం కాక బిక్కమొహం వేసుకున్న మీడియా ప్రతినిధుల మొహాలు చూసి, చిన్నగా నవ్వి.... ‘అంటే నా కొడుకు నా వేలు కాబట్టి ఊరికేచీకాడు... ఎందుకంటే నేను తండ్రిని కాబట్టి... కానీ.. ప్రజలు వేలు కాదు..... కాలుపెట్టినా అసలు కొరకడు, చీకనుకూడా చీకడు’ అంటూ ఇంకా ఎన్నిరకాలుగా కొడుకునని వెనకేసుకురావాలో అన్ని రకాలుగా వెనకేసుకొస్తారు. ఆ తరువాత ‘ఏరా వెధవ.... ప్రజల్ని కొట్టడం కాదురా.... కొట్టినా నోరెత్తకుండా చెయ్... అప్పుడే నువ్వు మంచి పొలిటికల్ లీడరువవుతావు... ఆ తర్వాత మినిస్టర్ అవుతావు....” అని క్లాసు పీకి కొడుకులకి ఫుల్లు ట్రైనింగ్ ఇచ్చి గట్టి పునాది వేసి జనాల్లోకి పంపిస్తారన్న మాట.

నేటి రాజకీయ నాయకుల పుత్రరత్నాలు చేసే గొడవలు చూస్తుంటే ఇలాగే అనిపిస్తుంది మరి. ప్రజా సేవలో మా ప్రాణాలు సైతం లేక్కచేయం అని ఆవేశంగా స్పీచులు దంచే నాయకులు తమ కొడుకులు ప్రజల ప్రాణాలని తీస్తుంటే మాత్రం నిమ్మకు నీరెత్తకుండా ఉంటారు.

అదేమంటే తన కొడుకు అమాయకుడు అని క్లీన్ షీట్ ఇస్తారు. దానికి ఊరుకోకుంటే.... ''చట్టం తన పని తాను చేసుకుపోతుంది..'' అంటారు. ఆ చట్టాలు వారి చుట్టాలన్న విషయం ప్రజలకి తెలియదనుకుంటారో ఏమో...!