తాతా ధిత్తై తరిగిణతోం - 13

తాతా ధిత్తై తరిగిణతోం - 13


జీడిగుంట రామచంద్రమూర్తి


వీధిలోకి వెళ్లిపోయాక నారాయణను దగ్గరకు పిలిచి అడిగాడు.

ఏమిటోయ్ నారాయణా ! మా మావ అల్లుళ్ళూ ఆరళ్ళూ అంటున్నాడేమిటి?

చిత్తం! మనూరి మావలసంగం సెక్రటరీ అప్పారావ్ గార్ని ఆరల్లుడుగారు తాతా ధిత్తై తరికిణితోం అంటూ భరతనాట్యం ఆడంచేశారండీ.

రాజేంద్రకి విషయం అర్థంకాలేదు

అంటే? అడిగాడు

అదేంటండి? అల్లుడిగారు మావగార్ని లారీ కొనిపెట్టమన్నారంటండీ కానీ మావల సంగం రూల్సు ఒప్పవ్ కదండీ మరి! ఇస్తే సంగం ఎలేస్తుంది ఇయ్యకపోతే అల్లుడు కూతుర్ని గెంటేస్తాడు. అందుకని ఆయన గారు ఇన్ని నిద్రమాత్రలు మింగేశారంటండీ! టూకీగా చెప్పాడు

అసలు ఈ మావలసంగం రూల్సు ఏమిటయ్యా మధ్యన? విసుక్కున్నాడు రాజేంద్ర.

చిత్తం! ఈ మధ్యనే తాపించారండీ.

ఎవరు స్థాపించారు?

అదంతా సెప్పాలంటే మూగమనసులు సినీమాలో ప్లాన్ బేక్కులోకి ఎల్పోయినట్టు ఎల్పోయివాలండి అలా కూసోండి సెప్తాను! కుర్చీ రాజేంద్ర దగ్గరకు లాగాడు రాజేంద్ర. అందులో కూర్చున్నాక నారాయణ చెప్పటం ప్రారంభించాడు.

ఆ మద్దెనోసారి కొంతమంది ఊరి పెద్దలు అయ్యగారి కాడకు వచ్చారండి నారాయణ చెప్తూంటే అదృశ్యం రాజేంద్ర కళ్ళముందు నడుస్తోంది.



*           *              *                   

  
వీరభద్రం హాలోవున్న ఉయ్యాల బల్ల మీద కూర్చుని నారాయణతో తలమర్దిననా చేయించుకుంటూండగా నలుగురు పెద్దమనుషులు అక్కడకు వచ్చారు.

భయభక్తులతో నమస్కారం చేశారు. గ్రామ పెద్దలందరూ ఒకే పర్యాయం వేం చేశారు! ఏమిటి విశేషం? చందాలేమైనా కలక్టు చేస్తున్నారా? అడిగాడు వీర భద్రం.

అంతలో నారాయణ చాప తెచ్చి అక్కడ పరిచాడు నలుగురూ దానిమీద కూర్చున్నారు.

మేం ఒక ముఖ్యమైన పని మీది వచ్చాం మాస్టారూ ! ఒకాయిన చెప్పాడు

శలవీయండి!

ఈ మధ్యన  ఊరి పోస్టుమాస్టారు మాధవరావుగారిమ్మాయి చనిపోయిన విషయం మీకు తెలుసుగా?

అవునవును!పాపం వంటచేయు చుండగా ప్రమాదవశాత్తు ఆమె చీరకు స్టౌ మంటలంటుకుని మరణించింది కదా!

అది అబద్దం మాస్టారూ ఆమె మరణం ప్రమాదవశాత్తు జరిగింది కాదు.

మరి? ఆసక్తిగా చూస్తూ అడిగాడు వీరభద్రం.

వెంటనే మరో పెద్దమనిషి చెప్పాడు అసలేం జరిగిందంటే మాస్టారూ మాధవ రావుగారు వారి అల్లుడిగారికి పెళ్ళిపీటల మీద ఇస్తావన్న కట్నం ఇవ్వలేక పోయారట! త్వరలోనే ఇస్తానని కాగితం రాసిచ్చి అప్పటికీ శుభకార్యం కానివ్వమని అతని కాళ్లు పట్టుకున్నారట. అమ్మాయి కాపురానికి వెళ్లిన తర్వాత ఆ అల్లుడు కట్నం  పట్టుకురమ్మని ప్రతీరోజూ ఆమెను హింసించే వాడట. కానీ ఆపిల్ల ససేమీరా నేను తేను గాక తేను అని మొండికేసిందట! అంతే! ఆ అల్లుడూ అతని తల్లీ కలసి ఓ పథకం ప్రకారం ఆ పిల్ల మీద పెట్రోలు పోసి అగ్గిపుల్ల గీశారట.

వీరభద్రం విస్తుపోయాడు.

ఏమీ యదార్థమా? ఉలికిపాటుతో అడిగాడు.

అవును బాబూ! చుట్టుపక్కలవాళ్లు చూసి చెప్పారండి ఆమాట్ని మాధవరావుగారు పోలీసు రిపోర్టు ఇచ్చార్లెండి పోలీసుకు గట్టిగా నాలుగు తగిలించేసరికి వాళ్లు ఒప్పేసుకున్నారు అని నాలుగో వ్యక్తి చెప్పాడు.

ఎంత దారుణమునకు ఒడిగట్టారు?

చిత్తం! రామ రామ ఇలాంటి దారుణాలు మితిమీరిపోతున్నాయి మాష్టారూ! వీటిని అరికట్టటానికి మనమందరం ఉద్యమించాలి! మొదటి వ్యక్తి ఆవేశంగా చెప్పాడు.

మనమా! ఇందు మనం చేయగల కార్యమేముందీ?

కట్నాలు ఇవ్వటం తీసుకోవటం నేరమని అందరికీ తెలియ చెప్పాలి.

ఆ విషయం పై ప్రభుత్వం చట్టమే చేసిందికదా ఆపై రేడియో టివీలయందు ఉధృతముగా ప్రచారం సైతం ఒరుగుతోంది. అన్నాడు వీరభద్రం.

చట్టాలవల్ల ప్రభుత్వ ప్రచారం వల్లా ప్రయోజనం వుండదు మాస్టారూ! మనుషుల మనసులు మారాలి. ఆ మార్పు కోసం మనం అందరం నడుంకట్టాలి!"

వీరభద్రానికి అర్థంకాలేదు. "ఎక్కడో మారుమూల ఈ కుగ్రామంలో నివశిస్తున్న వాళ్ళం...మనం ఇంతటి బృహత్కార్యాన్ని సాధించగలమా?" అనుమానాన్ని వ్యక్తం చేశాడు.

"తప్పక సాధించగలం మాస్టారూ!...ఏ ఉద్యమమైనా ప్రారంభం ఎప్పుడూ పలుచగానే వుంటుంది...పదిమంది మధ్యకు వెళ్ళినప్పుడే ఉధృతమవుతుంది...'ఉద్యమం' అనిపించుకుంటుంది."

ఆలోచనలో పడ్డాడు వీరభద్రం.

"అయినచో మనం ఏం చేయాలో అదీ శలవియ్యండి!" అడిగాడు తర్వాత.

మొదటివ్యక్తి చెప్పాడు.

"ముందుగా మన గ్రామంలోనే ఒక సంఘాన్ని స్థాపించాలి...కట్నం ఇవ్వటం పుచ్చుకోవటం మన మధ్య మనమే నిషేధించుకోవాలి. ఎక్కడ అలాంటి సంఘటన జరిగినా దాన్ని మనం ఖండించి అవసరమైతే పోలీసుల దృష్టికి తీసుకెళ్ళాలి! కట్నకానుకలు ఇచ్చిన వారినీ పుచ్చుకున్న వారినీ కూడా మన గ్రామం నించి బహిష్కరించాలి."

(ఇంకావుంది)
(హాసం వారి సౌజన్యంతో)