Taataadhitai Tadigibatom - 12

Episode-12


తాతా ధిత్తై తరిగిణతోం


జీడిగుంట రామచంద్రమూర్తి



"మహాప్రభో....నమస్కారం!"
వీధి అరుగు మీద పడక కుర్చీలో పడుకుని పేపరు చదువుతున్న వీరభద్రం ఆ సంబోధన విని పేపరులోంచి బయటకు చూశాడు.

'మెట్లమీద చేతులు కట్టుకుని నిలబడి దీనవదనంతో చూస్తున్న పూజారి కేశవయ్య కనిపించాడు.

"ఏమిటి కేశవయ్యగారూ! ఉదయముననే వేంచేసితి రేమిటి?...మీ కుమార్తె వివాహము సెటిలైనదటకదా!...ముహూర్తము పెట్టిన్చారా?" పేపరు మడిచి పక్కన పెడుతూ అడిగాడు వీరభద్రం.

"మగపెళ్ళివారు ఎనభైవేల మేరకు లాంఛనాలు కావాలని పట్టుబడుతున్నారు మాష్టారూ"

"లాంచనాలు కావాలని పట్టుబడుతున్నారు మాష్టారూ"

"లాంఛనాలా? అట్లయిన వారికి తగిన శిక్ష విధించవలసిందే!...మీరు నిర్భయముగా ఉండండి. ఆ సంబంధం కాకున్న డానికి మించిన మంచి సంబంధం మరి ఒకటి చూసి కట్న కానుకల ప్రసక్తి లేకుండా నేను సెటిల్ చేస్తాను!..." అంటూ అభయమిచ్చాడు వీరభద్రం.

"మంచిది మాష్టారూ!...మరి నాకు శలవు!" మరోసారి చేతులు జోడించి వెళ్ళిపోయాడు కేశవయ్య. అప్పుడే కాఫీ తెచ్చి భర్తకు అందించింది పార్వతమ్మ.

"అల్లుడుగారూ, అమ్మాయీ ఎల్లుండి వెళ్ళిపోతారు...గుర్తుందా?" అడిగింది.

"గుర్తులేని ఎదల మరణదండన విధిస్తారా?"
"ఈ ఏడు పంటడబ్బులో అల్లుడుగారికి ఇవ్వాల్సిన కట్నం బాకీ డబ్బు నలభైవేలూ ఇచ్చేస్తానన్నారుగా!?
"ఇవ్వని ఎడల వారు మాకు మరణదండన విధిస్తారా?" అన్నాడు వీరభద్రం."
భర్త ధోరణి పార్వతమ్మకు చిరాకు కలిగించింది. "మరణదండన కాదు మన పరువు గంగలో కలుస్తుంది...ఇప్పటికి రెండేళ్ళనించీ వాయిదాలు వేస్తున్నారు. ఈసారైనా ఇవ్వకపోతే బావుండదు.!" చెప్పింది.

"ఈ మాట నువ్వు ఇదివరక్కూడా ఓసారి చెప్పావు!..నేను 'మండల మామల సంఘా'నికి అధ్యక్షుడినన్న మాటను మరోసారి గుర్తు

చేస్తున్నాను...కట్నకానుకలు కానీ, లాంచనములు కానీ, ఇచ్చుటా, స్వీకరించుటా మా సంఘం అంగీకరించదు. మనసా, వాచా, కర్మణా ఆకట్టుబాటుకై లొంగి వుండవలెనన్నది నా సిద్ధాంతం! ఇక రాద్ధాంతము చేయకు దయచెయ్యి!"

సరిగ్గా అదే క్షణంలో నారాయణ పాట పాడుకుంటూ లోపలకు ప్రవేశించాడు. ఈ జీవనతరంగాలలో ఆ దేవుని చదరంగంలో ఎవరికి ఎవరూ సొంతమూ ఎంతవరకీ బంధము...' అంటూ ఇంకా పాడబోతూనే ఎదురుగా కనిపించిన వీరభద్రాన్ని చూసి ఠక్కున పాట ఆపేశాడు.

"బాబుగారు! తమరింకా ఇంట్లోనే వుంది పోయారేమిటి?..అవతల కొంపంటుకుంది" అన్నాడు భుజంమీది  తుండుగుడ్డతో ముఖం తుడుచుకుంటూ.

"ఏమిటి నారాయణా...ఏం జరిగింది/" గాభరాగా అడిగింది పార్వతమ్మ.

"కొంపంటు కుందమ్మ గారూ!" అతని నోట మళ్ళీ అదే మాట.

"ఎవరి కొంపరా?" పార్వతమ్మది మళ్ళీ అదే ప్రశ్న.

"ఇంకెవరి కొంపండీ? మామల సంఘం 'సెక్రటరీ' గారులేరండీ? ఆరిది!"

"ఇంతకీ విషయం వివరించి చావకుండా ఏమిటా అఘోరింపు?...అప్పారావ్ కి ఏమైంది?" వీరభద్రం విరుచుకు పడ్డాడు.

"సిత్తం! మొన్న ఆరింటికి అల్లుడు గారొచ్చారు కదండీ?"

"అవును!...పండుగలకు అల్లుళ్లు మామల ఇళ్లకు రావటం మామూలే. మనింటికి మా అల్లుడు కూడా వచ్చివున్నాడుగా?" అసహనంగా అన్నాడు వీరభద్రం.

"ఇంతకీ వాళ్ళ అల్లుడు వస్తే ఏం జరిగిందేమిటి నారాయణా?" ఏదో కీడు శంకిస్తూ అడిగింది పార్వతమ్మ మరింత ఆత్రంగా.

"ఇవాళ కొంప అంటించాడు అమ్మగారు!"

"అయ్యో బంగారం లాంటి ఇల్లు...కట్టి పదేళ్లు కూడా కాలేదు...కోటలావుండే ఇల్లు....ఎలా అంటించాడురా?..అసలేం జరిగింది?" బుగ్గలు నొక్కుకుంటూ ప్రశ్నించింది. 

"అబ్బ మీరుండండమ్మా...వరసలో సెప్పుకొస్తానుగా?...మొన్న వాళ్ళల్లుడు వచ్చి నిన్న వాళ్ళ మావగార్ని "మావా, నేనో 'లారీ కొనుక్కుంటాను డబ్బియీ" అని అడిగాడట!"

"బొమ్మ లారీయా?"
"అబ్బ కాదమ్మగారూ! నిజం లారీయే!"

"అఘోరించినట్టే వుంది...ఎవరైనా ఒక మణికట్టు గడియారమో ద్విచక్రవాహనమో అడుగుతారు....కానీ 'లారీ' ఏమిటి!..ఇంకానయం! రైలో, విమానమో కొనివ్వమని కోరలేదు!" మధ్యలో మండిపడుతూ అన్నాడు వీరభద్రం.

"చిత్తం అల్లుడుగారూ ఏదో దిగుమతి ఎగుమతి యాపారం చేసుకుంటారంట బాబూ! అందుకని లారీ అడిగారు!"

"రుణముగానా?...బేవార్సుగానా?""

"రుణముగా ఇమ్మని అడిగితే కొంపెందుకు మునుగుతాదండీ?...బేవార్సు గానే ఇమ్మాన్నార్టండి!" చెప్పాడు నారాయణ.

"ఆహా?...మామల సంఘానికి కార్యదర్శి అయ్యుండి సంఘం కట్టుబాటూ, రూల్సు అన్నీ గంగపాలు చేసి అడిగిన కానుక ఇచ్చేదరని భావించాడా, ఆ దశమగ్రహం?"

"ఆమాటే అప్పారావుగారు కూడా చెప్పి ఒప్పించాలని ప్రయత్నించారంటండి! కానీ అల్లుడు గారూ ఇన్లేదండి. లారీ కొనిస్తారా?... మీ అమ్మాయిని మీ ఇంట్లోనే వుంచేసుకుంటారా అని నిలదీసి అడిగారంట!"

"ఏమి పొగరూ?" ఆశ్చర్యాన్ని ప్రకటించాడు వీరభద్రం.

"చిత్తం?...పోగరేనండీ!"

"ఇంతలో అసలేం జరిగిందో పూర్తిగా చెప్పరా!" పార్వతమ్మ ఆతృతను ఆపుకోలేక పోయింది.

"అప్పుడేం జరిగిందంటే కూతురి కాపురం ఎక్కడ కూలిపోద్దోనని అల్లుగుగారి సేతిలో  నాలుగు లచ్చలకు 'సెక్కెట్టి' అప్పారావు గారేమో రెండు సీసాల నిద్ర మాత్రలు నోట్లో పోసుకున్నారంట."

"అంతే మరి అది మా కట్టుబాటు...రేపు మనల్లుడు మొండికెత్తినా నాకు అదేదారి కదా!" అన్యాపదేశంగా పార్వతమ్మతో అన్నాడు వీరభద్రం.ఉలిక్కిపడి భర్తవైపు చూసింది పార్వతమ్మ...

"మన అల్లుడు ఆ అప్పారావుగారి అల్లుడులాగా లారీలు, బస్సులూ అడగటం లేదులెండి. అతనికి ఇవ్వాల్సిన కట్నం బాకీ 'డబ్బు' ఇచ్చేస్తే చాలు....విమానం కొని తెచ్చినంత ఆనందిస్తాడు!" చెప్పింది.

"విలువ ఎంతటిదైననూ కట్నం కట్నమే."

"మీ మూర్ఖత్వం మీదే!" అని విసురుగా చూసి వంటింట్లోకి వెళ్లిపోయింది పార్వతమ్మ.

"ఆ...నేను పోయి అప్పారావు భౌతిక కాయంపైన పుష్పగుచ్చాన్ని వుంచి శ్రద్ధాంజలి ఘటించి వస్తా!" అంటూ కండువా భుజం మీద వేసుకున్నాడు వీరభద్రం.

వెంటనే నారాయణ ఖంగారుగా చూస్తూ చెప్పాడు "అయ్య బాబోయ్ ఆరింకా పోలేదండీ!...ఆసుపత్రిలో చేర్పించారు. 'పెనగండం' లేదని డాక్టర్లు చెప్పారంట!"

"పోనీలే!..బ్రతికిపోయాడు!" అనుకున్నాడు వీరభద్రం.

గుడికి వెళ్ళిన రాజేంద్ర, గీత అప్పుడే తిరిగి వచ్చారు...వాళ్లరాకను గమనించిన వీరభద్రం వాళ్ళకు వినిపించేలా అన్నాడు మళ్లీ "అయిననూ ఈ అల్లుళ్ల ఆరళ్ళకు అంతు లేకుండా పోతున్నది!...వీటిని అరికట్టుటకు దేశవ్యాప్తంగా మా సంఘం శాఖలుగా ఏర్పడి ఉద్యమించవలసి వుంటుంది!"

రాజేంద్ర ఆ మాటలు విన్నాడు.


(ఇంకావుంది)
(హాసం వారి సౌజన్యంతో)