Taataadhitai Tadigibatom - 11

Episode-11

తాతా ధిత్తై తరిగిణతోం

జీడిగుంట రామచంద్రమూర్తి

"అసలు నీకింత పట్టుదల ఎందుకో నాకర్థం కావటం లేదు బేబీ...వద్దన్నా వాడి వెంటపడటం ఎందుకసలు?...పైగా నీ స్టేటస్సూ, నీ అందచందాలు చూసి ఏ ఫారిన్ కుర్రాడో కళ్ళకద్దుకుని మరీ పెళ్ళి చేసుకుంటాడు...నెత్తిన పెట్టుకుని పూజిస్తాడు."

"అవునా, మరి అలాంటి స్టేటస్సూ, అంతటి అందచందాలు వున్న నన్ను పల్లెటూరి నించి వచ్చిన ఓ మామూలు కుర్రాడు ఎందుకు పట్టించుకోవటం లేదు?...అదేనాకు అర్థం కావటం లేదు డాడీ!...నాకు తెలుసు అతనికి నేనంటే ప్రేమ వుంది....ఆ సంగతి అతనే చెప్పాడు కానీ పెళ్లి చేసుకునేందుకు భయపడుతున్నాడు. అందుకు కారణం వాళ్ళ నాన్న...ఆయన చండశాసనుడట డాడీ!...అతనే చెప్పాడు."

"అలాంటప్పుడు ఆ చండశాసనుణ్ణి మన దారికి తెచ్చుకుంటే ప్రాబ్లం సాల్వ్ అయిపోతుందిగా?" అడిగాడు విష్ణుమూర్తి.

"దానికంటే ముఖ్యం శ్రీరామ్ కి తండ్రిపట్ల వున్న భయాన్ని పోగొట్టడం...! అప్పుడు ఆటోమేటిగ్గా అతనే మన దారికి వస్తాడు." అంటూ లేచింది అశ్విని. ఆమె మాటల్లోని తాత్పర్యాన్ని వెతుకుతూ అలాగే చూస్తుండిపోయాడు విష్ణుమూర్తి.

* ** *

హాస్టల్లో తన గది ముందు అటూ ఇటూ పచార్లు చేస్తూ పుస్తకం చదువుతున్నాడు శ్రీరామ్. అతని మిత్రుడు అవధాని అక్కడకు వచ్చాడు. అతని చేతిలో ఓ ఇన్ లాండ్ కవరుంది.

"ఓరేయ్ శ్రీరామ్.'కాలేజి పోస్ట్ బాక్స్'లో నీ పేర ఈ కవరు కనిపించిందిరా...తీసుకొచ్చా!" అంటూ దాన్ని అతని చేతికిచ్చి వెళ్ళిపోయాడు అవధాని. శ్రీరామ్ ఆత్రంగా కవరువిప్పి, అందులో వున్న మొదటి వాక్యాన్ని చదివాడు "ఒరేయ్ శుంఠాగ్రేశ్వర చక్రవర్తీ!" ఆ వాక్యాన్ని అప్రయత్నంగా పైకి చదివినందుకు తనకు తనే షాకై చుట్టుపక్కల ఎవరైనా వుండి విన్నారేమోనని అనుమానంగా చూశాడు. ఎవరూ లేరని నిర్ధారణ చేసుకున్నాక స్థంభం పక్కకెళ్ళి ఉత్తరాన్ని పూర్తిగా చదువుకున్నాడు.

"శ్రద్ధగా చదివి అఘోరించమని నిన్ను టౌనుకి పంపిస్తే పుస్తక పాఠాలు మానేసి ప్రేమపాఠాలు వల్లించుచుంటివని తెలియవచ్చింది. ఎవరో అశ్వనియట! ఆమె వలలో పడి నీవు 'కుడితి'లో పడిన మూషికం లాగా గిలగిలా కొట్టుకుంటున్నావట. మీ క్లాసుమేటు ఒకడు తెలియపరిచాడు. నేను ఎంత చండశాసనుడనైప్పటికి కన్నకొడుకు కోరికను కాదనే దుర్మర్గుడను కాను! నీకు సమ్మతమైనచో నాకూనూ సమ్మతమే! నీ పరీక్షలు పూర్తికాగానే మీ వివాహమునకు ముహూర్తం పెట్టించెదను... ఇట్లు నీ పితృదేవుడు వీరవాసరం వీరభద్రం వరాలు. ఉత్తరం చదివిన శ్రీరామ్ బిత్తరపోయాడు.

" కళా? నిజమా? మా నాన్న అశ్వినితో పెళ్ళికి ఒప్పుకుంటాడా?" అని మనసులో పదేపదే ప్రశ్నించుకున్నాడు. ఎన్నిసార్లు అలా ప్రశ్నించుకున్నా ఖచ్చితమైన, నమ్మకమైన సమాధానం దొరకలేదు...ఆ ఉత్తరంలో ఏదో తిరకాసుందని నిర్ధారణ చేసుకున్నాడు.

వెంటనే మళ్లీ కవరులోకి నిశితంగా చూశాడు...అందులోని భాష, శైలి, ముఖ్యంగా ఆ సంబోధనా గమనిస్తే అచ్చం తన త్రండి రాసినట్టే అనిపించింది. అంతకు నాలుగు రోజుల ముందు తన తండ్రి రాసిన ఉత్తరంలోణి చేతివ్రాతతో దాన్ని పోల్చి చూడాలనుకున్నాడు. ఆత్రంగా ఆ ఉత్తరంకోసం వెతికాడు...కానీ అది కనిపించలేదు.

"అసలింతకీ ఈ ఉత్తరం తన త్రండి కాక మరెవరు రాసుంటారు? అలా రాయాల్సిన అవసరం ఎవరికి వుంటుంది?" జుట్టు పీక్కుంటూ ఆలోచించాడు.

అతని వ్యవహారాన్ని దూరంగా వుండి గమనిస్తున్న అశ్విని అక్కడకు వచ్చింది. ఆమెను చూడగానే శ్రీరామ్ కి అనుమానం కలిగింది. అవధాని ద్వారా ఆ ఉత్తరాన్ని అశ్విని పంపించి ఉండాలనుకున్నాడు.

"హలో శ్రీరామ్ ఏమిటి వర్రీగా వున్నావు?" కొంటెగా చూస్తూ అడిగింది అశ్విని.

అంతలోనే తనను ఉడికించటానికే అలా అడిగిందని అర్థం చేసుకున్నాడు.

"ఇన్నాళ్ళూ ఆకాశా రామన్నల గురించే వినేవాళ్ళం. ఇప్పుడు 'ఆకాశ సీత'లు కూడా తయారయ్యారేమిటా అని వర్రీ అవుతున్నాను" చెప్పాడు.

"ఆకాశ సీతలా?" ఆశ్చర్యం నటించింది అశ్విని.

"ఇదిగో ఈ ఉత్తరం చూడు నీకే బోధపడుతుంది. దైర్యంగా రాసే దమ్ముల్లేక ఎవరో మా నాన్న రాసినట్టు రాశారు" ఆ కవర్ని విసురుగా ఆమె చేతికి అందించాడు.

"ఒరేయ్! శుంఠగ్రేశ్వర చక్రవర్తీ!" కవరు తెరచి మొదటి వాక్యాన్ని చదివింది అశ్విని.

"పైకి చదవక్కర్లేదు...లోపల చదువుకోవచ్చు!" కోపాన్ని అణుచుకుంటూ అన్నాడు శ్రీరామ్.

వస్తున్న నవ్వును బలవంతంగా ఆపుకుంటూ ఉత్తరాన్ని మనసులోనే గబగబా చదివేసిందామె.

"భలే వుంది! ఒకవేళ మీ నాన్నగారే రాశారేమో దీన్ని!" అడిగింది.

"నెవ్వర్! ఛస్తే అలా రాయరాయన!"

"మరైతే ఎవరు రాసుంటారబ్బా?"

"ఇంకెవరూ? తమరే! ఆ మాత్రం తెలుసుకోలేని చవటదద్దమ్మ కాను!" ఆమె చేతిలోంచి

ఆ కవర్ని మళ్ళీ లాక్కుంటూ అన్నాడు.

"నేనా?" తెల్లబోయినట్టు చూసింది అశ్వని.

"ఔను!...ముమ్మాటికీ నువ్వే!..అయినా నాతో ఎందుకిలా ఆటలాడుకుంటావ్? నీకు పుణ్యం వుంటుంది...చేతులు జోడిస్తాను...నన్నొదిలేయ్ అశ్వినీ..." అంటూ దణ్డం పెట్టాడు.

అశ్విని ముఖకవళికలు గంభీరంగా మారిపోయాయి.

"నిజమే శ్రీరామ్!...నీతో ఆటలే ఆడుతున్నాననుకో!...కానీ అది దొంగాట మాత్రం కాదు. ప్రేమాట!....'లవ్ గేమ్' నువ్ వద్దన్నకొద్దీ నేను దగ్గరవుతాను...గుర్తించుకో!" సూటిగా అతనివైపే చూసి చెప్పింది.

మళ్లీ మరో అడుగు ముందుకు వేసి చెప్పంది.

"శ్రీరామ్! 'లవ్ ఎట్ ఫస్ట్ సైట్' అంటారు తెలుసా?..అంటే తొలిచూపులోనే ప్రేమ కలగటం!...నేను కాలేజీలో చేరిన తొలిరోజునే లెక్చరర్ అడిగిన ఓ ప్రశ్నకి నువ్ హుందాగా నిలబడి సమాధానం చెప్తూవుంటే నిన్ను అలవోకగా చూసిన నేను నాకు తెలియకుండానే ప్రేమించాను...ఒకప్పుడు కాకపోతే మరొకప్పుడైనా నువ్వు నన్ను చూస్తావనీ నా ప్రేమను 'ఓకే' చేస్తావని ఆశపడ్డాను!"

"అది దురాశ అవుతుందని చాలాసార్లు చెప్పాను!" మధ్యలోనే ఆమె మాటల్ని తుంచేస్తూ అన్నాడు శ్రీరామ్.

"అదే! ఎందుకూ అని నేనూ చాలాసార్లు అడిగాను నాకేం తక్కువ? పడిచచ్చేటంత పిచ్చిప్రేమ కూడా వుంది...అలాంటి నన్ను నిజంగానే పిచ్చిదాన్ని చేసి మానాన్నకి ఆకాశరామన్న ఉత్తరం రాశావ్!" ఆ మాటతో శ్రీరామ్ కొంచెం మెత్తపడ్డాడు.

అంతలో హేండ్ బ్యాగ్ లోంచి ఆ కాగితం తీసి అతనికి చూపిస్తూ అడిగింది. "ఇది నువ్వు రాయలేదూ!" శ్రీరామ్ తల వంచుకున్నాడు.

"నాకు తెలుసు నువ్వే రాశావని! అందుకే దీనికి జవాబుగా దాన్ని నేను రాశాను! ఆనాడు రాత్రి నీరూమ్ లోకి వచ్చినప్పుడు బల్లమీద కనిపించిన ఇన్ లాండ్ లెటర్ని నిన్ను ఆటపట్టించాలని నేనుతీసి నా బ్యాగ్ లో వేసుకున్నాను. ఆ తర్వాత దాన్ని యధాలాపంగా చూశాను. మీ నాన్న గారు రాసినట్టు గ్రహించాను. అందులోని భాషా, శైలీ నాకు వింతగా అనిపించి ఉత్తరం మొత్తం చదివాను...అదే స్టయిల్ లో మీ నాన్న గార్ని అనుకరిస్తూ రాశాను. తప్పయితే క్షమించు...కానీ నా ప్రార్థన ఒక్కటే! నన్ను దూరం చేయాలని ప్రయత్నించకు!...దగ్గరకు ఎలా తీసుకోవాలో ఆలోచించు!...నామీద ప్రేముందని ఒకనాడు నువ్వేచెప్పావ్!..మనసుంటే మార్గం అదే దొరుకుతుంది." అంటూనే అతని జవాబుకోసం ఎదురు చూడకుండా అక్కణ్ణించి వేగంగా వెళ్ళిపోయింది అశ్విని.

నిశ్చేష్టుడై ఆమెవైపు చూస్తూ...తన చేతిలో వున్న ఉత్తరాన్ని అప్రయత్నంగా చింపేశాడు శ్రీరామ్....

(ఇంకావుంది)

(హాసం వారి సౌజన్యంతో)