Antera Bamardee 23

 

This story is a courtesy of Padma Bhushan Varaprasad Reddy

అంతేరా బామ్మర్దీ 23

బిర్లా మందిరం!

స్వామి వారిని వేణు ఉమలు దర్శించుకున్నారు. తీర్థప్రసాదాలు పుచ్చుకుని మెల్లగా ఆలయం వెలుపలకు వచ్చేరు. ఒకచోట కూచున్నారు. కొన్ని నిమిషాలపాటు వాళ్ళిద్దరూ మవునంగానే వుండిపోయేరు.

ఇక ఓర్చుకునే ఓపికలేక కొంచం కోపంగానే అనేసింది. " తండ్రిలాంటి బావగారిని నొప్పించి ఆ ఇల్లు విడిచిపెట్టి రావడం హీరోయిజం అనిపించుకోదు " అని ఉమ అంది.

" నిజమేనేమో కానీ, ఆ ఇంట్లో వుంటే నేను హీరోని కాలేను ఉమా " అన్నాడు వేణు.

" అందుకని దేవుడిలాంటి మీ బావగార్ని విడిచిపెట్టి రావడం ధర్మమా ?" అంది ఉమా!

" బావ నాకు ఎల్లప్పుడూ దేవుడే! ఆ దేవుడిని కాదనే ధైర్యం కాని దమ్ము కాని నాకు లేవు " అన్నాడు వేణు.

" మాటలకేమిలే ! బాగానే చెబుతావు ? అంత విశ్వాసం, అంత భక్తీ మాటల్లోనే కాదు. చేతల్లో కూడా కనిపించాలి. నిజంగా ఆయన నీకు దేవుడే అయితే ఆ ఇల్లు విడిచిపెట్టేవాడివి కావు " అని అన్నది ఉమా!

" మన పెళ్లి త్వరగా జరగాలనుకుంటే, ఇష్టం లేకపోయినా కొన్నాళ్ళ పాటు నేను బావకి దూరంగా వుండాల్సిందే " అన్నాడు వేణు.

" అంటే ?" అర్థంకాక అడిగింది ఉమా.

" నీతో నా పెళ్లి.... మా బావ చేయలేడు "

" విడ్డూరంగా మాట్లాడకు "

" నేను నిజమే చెబుతున్నాను ఉమా! మీ నాన్న పేరు వింటేనే చాలు...మా బావ నిప్పులు కక్కుతున్నాడు! ఇల్లాంటి పరిస్థుల్లో బసవరాజు గారి అమ్మాయితో నా పెళ్లి జరిపించు బావా అని అడిగితే, నా మెళ్ళో చెప్పుల దండేసి ఊరంతా తిప్పుతాడు! అంచేత బావ ప్రమేయం లేకుండా నా పెళ్లి నేనే చేసుకోవాలనుకుంటున్నాను. అందుకే ఇంటి నుంచి బయటికి వచ్చాను " అని చెప్పాడు వేణు.

" కట్టుకథలు చెప్పి నీ చర్యని సమర్ధించుకుంటున్నావా వేణూ ?"

" వెంకన్న సాక్షిగా నిజమే చెబుతున్నాను ఉమా "

" మీ బావగారి విషయం అట్లా వుంచు! మీ బావగారి మీదున్నకోపంతో మన పెళ్ళికి మా నాన్న అంగీకరిస్తాడనే గ్యారంటీ ఏమిటి ?"

" అదీ పాయింటు ! నేను ఫలానా అని తెలిసి కూడా నాకు ఉద్యోగం యిచ్చేరు. ఉద్యోగం ఇచ్చినవారు పిల్లనివ్వరా ? ఎందుకైనా మంచిదని మా బావకీ దూరమై మీనాన్న గారికి మరింత దగ్గరయ్యేందుకు ప్రయత్నం చేస్తున్నాను ! అవునూ మీ నాన్నగారి హాబీలేమిటి ?" అని అన్నాడు వేణూ.

" ఉడ్ హవుస్ ని చదవడమొక్కటే అనుకున్నాను! ఆయన చెప్పిన థియరీలు వంటబట్టించుకున్నట్టున్నావు ?"

" ఏం చేయమంటావు ? ఈ పరిస్థితుల్లో ఉడ్ హవుసే నాకు దిక్కు "

" మా నాన్నకి మార్నింగ్ వాకంటే చాలా యిష్టం " అని చెప్పింది ఉమా.

" థేంక్యూ " అన్నాడు వేణు.

ఈ చిన్న సమాచారానికి థేంక్యూ ఎందుకు చెప్పాడో ఉమకి అర్థం అప్పుడు కాలేదు. అందుచేత అతని వేపు విడ్డూరంగా చూసింది.

*****************

హైదరాబాద్ నిండా కేవలం అపార్టుమెంటులే వున్నాయని చెప్పడం సరికాదు. కొన్ని చోట్ల అందమైనా మైదానాలు కూడా వున్నాయి! ఈ మైదానాలు మార్నింగ్ వాక్ కి బాగా ఉపకరిస్తాయి.

ఆ ఉదయం...ఒకానొక మైదానంలో, బసవరాజు జాగింగ్ చేస్తున్నాడు!

ఆ కార్యక్రమంలో అతను బిజీగా వుండగా దూరంగా వేణు రేసు గుర్రంలా పరుగెత్తుతూ కనిపించాడు. తాను చేస్తున్న జాగింగ్ కి చుక్క పెట్టి వేణుని కన్నార్పకుండా చూస్తున్నాడు బసవరాజు.

వేణు ఇప్పుడు పరుగులు ఆపి బస్కీలు తీస్తున్నాడు.

అతన్ని చూస్తూ ముచ్చటపడుతున్నాడు.

వేణు బస్కీలు పూర్తీ చేసి మళ్ళా రేసు గుర్రంలాగా పరుగెత్తుకుంటూ మాయమైపోయాడు.

బసవరాజు గొణుక్కుంటున్నాడు.

" స్మార్ట్ బాయ్! చాకులాంటి కుర్రాడు! దేశానికి, నా కంపెనీకి ఇలాంటి కుర్రాళ్ళే కావాలి " అని.

(ఇంకావుంది)

(హాసం సౌజన్యంతో)