Antera Bamardee 19

This story is a courtesy of Padma Bhushan Varaprasad Reddy.

అంతేరా బామ్మర్దీ - 19

*********************

“ మనం ఊహించినట్టే జరిగింది మిస్టర్ పాణీ " అని.

“ అనుకున్నాను సార్ "

“ సింగినాదం, వాళ్ళ బామ్మర్దీ ఉద్యోగం కోసమే వచ్చేడు "

“ అడ్డం పడింది నేను గనుక నా చెంప చెళ్ళుమనిపించాడు. ఆయన తమర్ని డైరక్టుగా కలుసుకుని వుంటే, అడక్కండి సార్! ఊహించడానికి భయం వేస్తుంది " అన్నాడు పాణి.

“ దీన్ని బట్టి నీకేం తెలుస్తుంది మిస్టర్ పాణి? అచ్చెప్పు నాకు "

“ పేపరు వార్తలు మనపాలిట భగవద్గీత లు సర్ !”

“ అని నువ్వంటున్నావా ?”

“ అంత పవిత్రమైన మాటలు నేనెందుకంటాను సర్! శ్రీ శ్రీశ్రీ వేనుగోపాలాచార్యులు సంస్కృతంలో సెలవిచ్చేరు సార్ "

“ ఏవని యిచ్చేరు అచ్చెప్పు నాకు " కృష్ణ పరమాత్మ గీత బోధిస్తున్న బాణిలో పాణి సంస్కృత శ్లోకం ఒకటి చదివేడు! అతను చదివిన శ్లోకాన్ని కళ్ళు మూసుకుని చేతులు జోడించి పారవశ్యంతో విన్నాడు బసవరాజు.ఆ తరువాత అన్నాడు.

“ ఆహా! ఏమన్నాడయ్యా మహానుభావుడు "

“ బాగా అర్థమైందా సార్ "

“ కొంచం అర్థమైనట్టే వుంది "

“ సంస్కృతం కదా సర్.తెలుక్కి కొంచెం దగ్గర్లో వుంటుంది "

“ శ్రీశ్రీశ్రీ వేణుగోపాలచార్యులు " అని అంటుండగా సరిగ్గా ఆ మాటమీదే ఆఫీసు బాయ్ క విజిటింగ్ కార్డు తీసుకొచ్చి బసవరాజుకి ఇచ్చాడు. బసవరాజు ఆ విజిటింగ్ కార్డుని గట్టిగా చదివేడు.

“ వేణుగోపాల్ ఎం.ఎ.ఎంబిఎ. రమ్మను " ఆఫీసుబాయ్ వెళ్ళిపోయాడు. పాణి అంటున్నాడు.

“ శ్రీశ్రీశ్రీ వేణుగోపాలాచార్యుల వారి గురించి ముచ్చటించుకుంటుంటే వేణుగోపాలుడు రావడం విచిత్రంగా వుంది సార్ " అని.

ఆ గదిలోకి వేణు అడుగుపెడుతూనే ఎంతో వినయంగా "గుడ్ మార్నింగ్ సర్" అన్నాడు. వేణుని చూసి బసవరాజు ఎంతో ముచ్చటపడిపోతూ అన్నాడు. “ ప్లీజ్ బి సీటేడ్ " అని.

వేణు ఒద్దికగా కూచుని " థేంక్యూ " అన్నాడు.

“ మీ కంపెనీ గురించి నేను చాలా విన్నానండి " అని కూడా అన్నాడు వేణు.

“ వినే వుంటారు. ముఖ్యంగా మీలాంటి సంస్కృత పండితులు " బసవరాజు మాటకు పాణి అడ్డం పడ్డాడు.

“ వారు వీరు కాదు సార్ " అని.

“ ఏమిటో ? వారే వీరనుకున్నాను! చెప్పండి మిస్టర్ వేణూ. నేను మీకేం చేయగలను ?”

“ మీ కంపెనీలో నాకు తగిన ఉద్యోగం లభిస్తే అయ్ విల్ బి గ్రేట్ ఫుల్ టు యు! ఇది నా బయోడేటా. ఇవి నా సర్టిఫికేట్లు " అని వాటిని ఇచ్చాడు వేణు.

“ అయ్ సీ ! ఉద్యోగం కోసం వచ్చేరన్నమాట "

“ అవునండీ "

“ కాసేపు మా విజిటర్ లాంజిలో కూచోండి.ఈలోగా మీ పేపర్సు పరిశీలిస్తాను " వేణు సంస్కరించి ఆ గదినుంచి బయటపడ్డాడు. బసవరాజు , వేణు యిచ్చిన కాగితాలు చూస్తున్నాడు.

******************

రంగనాథం ఇల్లు! ఆ ఇంట్లో రంగనాథం గోడల్నీ కుర్చీలని కాల్తో తన్నుకుంటూ శివతాండవం చేస్తున్నాడు.మాటల్లో నిప్పుల వర్షం కురిపిస్తున్నాడు.అన్నపూర్ణమ్మ చోద్యం చూస్తోంది.

“ ఉద్యోగం! బోడి ఉద్యోగం? వెళ్లగా వెళ్లగా ఆ బసివిగాడికి దగ్గరికే వెళ్ళాలా? వాడు నీచుడే!పరమనీచుడు! ఆ బోడి కంపినీకి వేణుని ఎందుకు పంపించేవ్? మాటాడవే ?”అని అరుస్తున్నాడు.

“ నన్నంటారేమిటి? హరతిచ్చి నేను పంపలేదు. శపథం చేసి వాడంతట వాడే వెళ్లేడు " అని అన్నది అన్నపూర్ణ. ఆమాట వినగానే రంగనాథం ప్లవర్ వాజ్ పగలకొట్టేడు.

“ శపథం! బోడి శపథం! అదేమైనా ఇంద్రపదవా? దేవేంద్రుని సీటా? ఈ బోడి ఉద్యోగం కంటే నాగపూరు ఉద్యోగమే ఎన్నోరెట్లు బెటర్. వెళ్లిపొమ్మను నాగపూరు " అని అన్నాడు రంగనాథం.

“ మనల్ని విడిచి వుండలేనంటున్నాడుగా! ఆ మాటకొస్తే వాడ్ని విడిచి మీరు మాత్రం వుండగలరా! ఈ ఊళ్లోనే ఉద్యోగం చేయమని మీరే అన్నారుగా " అని గుర్తు చేసింది అన్నపూర్ణ.

“ అన్నానే అన్నాను..తొందరపడి అన్నాను! బుద్ధిగా గడ్డితిని అన్నాను. ప్రాణమిత్రుడూ వంకాయ్ స్నేహితుడూ పెద్ద ఉద్ధరించేస్తాడని బేవార్స్ ఆలోచన కడుపులో పెట్టుకుని తప్పుడు కూత కూసేను. బసివిగాడి అసలు రంగు తెలిసిపోయింది గదా! ఇంకా ఏ మొహం పెట్టుకుని వాడి బోడి కంపనీలో ఉద్యోగం చేస్తాం? అసలు వేణుకి అక్కడ ఉద్యోగం దొరకద్దూ? మీ బావనే గెంటిపారేసిన తరువాత నువ్వొకలెక్కా అని పెడతాడే గడ్డి " అని మరింత కోపంగా అన్నాడు.

ఆ మాటకి అన్నపూర్ణమ్మ ఓర్చుకోలేక అన్నది " అట్లా ఎందుకనుకోవాలి? వాడి చదువుసంధ్యలు చూచి ఉద్యోగం ఇవ్వచ్చుగా ?” అని. రంగనాథం కుర్చీ తన్ని అన్నాడు " అక్కర్లేదు..అవమానం నాకు జరిగినా నా బావమరిదికి జరిగినా ఒక్కటే! నా ట్లకొట్టేసి వాడి మెళ్ళో దండవేస్తే సంతోషిస్తాననుకున్నావా? అది ఈ జన్మలో జరగదు. పదండి పోదాం!అందరం కట్టగట్టుకుని నాగపూరే వెళ్ళిపోదాం! దేశభక్తి ముఖ్యంగానీ ఊరుభక్తి ఎవడిక్కావాలి? ఉన్న ఊర్లో ఛీ కొట్టించుకుని పరమాన్నం భోంచేసి కంటే పోరుగుర్లో మంచీ మార్యదల్తో పచ్చడి మెతుకులు కతికి కడుపు నింపుకోవడం బెటరు! ఏం తింటున్నామో ముఖ్యం కాదే పిచ్చి మొహమా? ఎట్లా బతుకున్నాం? అది ముఖ్యం! అదే ముఖ్యం! ఏమిటర్థమైందా ?” అన్నాడు రంగనాథం.

“ అర్థమైందిలెండి! బాగా అర్థమైంది. రండి భోంచేద్దుగారుగాని "అని అన్నపూర్ణమ్మ వంట గదివేపు కదిలింది.

“ ఆగక్కడ " అని రంగనాథం అరిచేడు. గబుక్కున అన్నపూర్ణమ్మ ఆగిపోయింది.

“ అవమానంతో బాగా కడుపునిండిపోయింది.ఆ వడ్డింపు చాలునాకు! నువ్వు ప్రత్యేకించి నాకేం వడ్డించక్కర్లేదు " అని అన్నాడు రంగనాథం.

“ చాల్లే ఊరుకోండి "

“ నిన్ను తగలెయ్య! నేను నిజమే చెప్తున్నాను.నాకిప్పుడు అన్నం నీళ్ళు సయించవు.అంచేత నువ్వు వంటగదిలోకి అడుగు పెట్టేవంటే అడ్డంగా నరుకుతా! ఆ తరువాత నిన్ను కూరండుకుని తింటా! మా ఇంటావంటా నాన్ వెజిటేరియన్ తిల్లు తెలీవు. నన్ను మాంసాహారిని చేయద్దు! తర్వాత నీ యిష్టం!” అని ఒక్క గెంతు గెంతి మంచంమీద పడ్డాడు రంగనాథం.

అన్నపూర్ణమ్మ కళ్ళ వత్తుకుంటుంది.

(ఇంకావుంది)

(హాసం సౌజన్యంతో)