Antera Bamardee 5

 

This story is a courtesy of Padma Bhushan Varaprasad Reddy.

ఐదవ భాగం

అన్ని ఇష్టాలతో పాటు జానికిరాం బుక్ హవుసిష్టం!

జనవరి ఇరవై అయిదిష్టం!

మిగతా యిష్టాల గురించి వివరించి చెప్పకపోయినా ఫర్లేదు గానీ,జానకిరాం బుక్ హవుసూ,జనవరి ఇరవై అయిదూ ఎందుకిష్టమో చెప్పకపోతే ఆ రెండు యిష్టాల లిస్టులో ఎందుకు చేరేమో తెలీయకుండా పోతుంది.

వేణుకి కొందరు తెలుగు రచయితల పట్ల గౌరవమున్నట్టే,ఇంగ్లీష్ రచయిత ఉడ్ హవుస్ పట్ల అపారమైన అభిమానముంది ! అంచేత అతను ఉడ్ హవుస్ రచనలను ఆణిముత్యాల్లాగా భావిస్తాడు.చదివిన పుస్తకమే మళ్ళా మళ్ళా చదివి మళ్ళా మళ్ళా మురిసిపోతుంటాడు.

ఈ నేపథ్యంలో అతను భద్రంగా దాచుకున్న ఉడ్ హవుస్ నవల 'మనీ ఇన్ ది బేంక్ 'మిస్సయింది!ఎక్కడ మిస్సయిందో ఎట్లా మిస్సయ్యిందో తెలీయడం లేదు.ఆ నవల మిస్సయిందని తెలీగానే వేణు విలవిల్లాడి పోయేడు.'మనీ ఇన్ ది బేంక్ 'మిస్సవ్వగానే తన దగ్గరున్న బంగారు నిధిని కాకులేత్తుకు పోయినట్టు భావించి తట్టుకోలేకపోయేడు.

అర్జంటుగా ఆ పుస్తకం తన బుక్ షెల్ఫ్ లో చేరకపోతే తనకి పిచ్చెక్కే ప్రమాదముందని గ్రహించాడు. అంచేత ఆ పుస్తకం కొనుక్కునేందుకు అతను జానకిరాం బుక్ హవుస్ కి పరుగెత్తాడు. అతను ఆ బుక్ హవుస్ లో అడుగు పెడుతూనే ఉమని చూసేడు. ఉమని చూడగానే అతని మనసున మల్లెల మాలలూగేయి.

ఆమె అందానికి ముగ్ధుడయ్యేడు.

“ఓహో అందమా !ఇదా నీ చిరునామా ?”అని గొణుక్కున్నాడు.

ఉమ గొడవలో పడి అంత పెద్ద ఉడ్ హవుస్ నీ ఆ కాసేపు మరచిపోయేడు.

“ఏం కావాలి సార్ ?”షాపతను అడిగాడు.

“అందం "అన్నాడు వేణు. ఆ టైటిల్ విని షాపు మనిషి బిక్క మొహం పెట్టేడు.

“రచయిత పేరు ?”ఇంకో మనిషి షాపు మనిషే అడిగేడు.

“బ్రహ్మ !”అన్నాడు వేణు.

ఆ రచయిత పేరు విని ఇంకో మనిషి కూడా బిక్కు మొహం పెట్టేడు. ఇప్పుడు స్వయంగా షాపు ప్రొప్రయిటరే కలగజేసుకున్నాడు.

“ఆ పుస్తకం గురించి గానీ ఆ రచయిత గురించి గానీ మేము వినలేదు.అంచేత...”అన్నాడు.

“ఆ మాటకొస్తే క్షణం క్రితం...నేను కూడా మీటైపే !జస్టిప్పుడే తెలుసుకున్నాను "అన్నాడు వేణు. “ఆయసీ !మా షాపులో దొరకదు.మరోచోట వెతకండి !”అన్నాడు ఆ షాపతను.

అప్పటిగ్గాని వేణు పూర్తిగా తేరుకోలేదు.

దొరకని పుస్తకం కోసం ఇంకోషాపుకి వెళ్ళిపోతే ఇక్కడ దొరికిన అందాల రాశి మిస్సయిపోతుందనే బెంగతో 'మనీ ఇన్ బేంక్ 'కావాలని చెప్పేడు ! సరిగ్గా ఆ పుస్తకం వెతికే పనిమీద ఒక మనిషి బిజీగా వున్నాడని షాపు ప్రొప్రయిటరు చెప్పేడు.

“దొరికింది "అని అరిచేడు ఆ పుస్తకాన్ని వెతికే మనిషి.

“థేంక్స్ "అన్నాడు వేణు.

“ఎందుకు థేంక్స్ ?”అడిగాడు ఆ షాపు మనిషి.

“ఆ పుస్తకం కోసమే వచ్చెను !”అన్నాడు వేణు.

“ఒక్క కాపీయే వుంది !”అన్నాడు.

“నాకు కావల్సింది కూడా ఒక్క కాపీనే !”

“మీ కంటెముందు మేడం గారు అడిగేరు !”అంటూ షాపు మనిషి ఆ పుస్తకాన్ని ఉమకి యిచ్చేడు. ఉమ ఆ పుస్తకం తీసుకుంటూ వేణుని ఉద్దేశించి అన్నది.

(ఇంకావుంది)

(హాసం సౌజన్యంతో)