Antera Bamardee 3

 

This story is a courtesy of Padma Bhushan Varaprasad Reddy.

 

మూడవ భాగం

ఆ మాటకి బసవరాజు సమాధానం చెప్పకుండా,బోలెడు ఆశ్చర్యాన్ని మొహాన్న పులుముకుని మురళిని అడిగాడు. “ఇంత గొప్ప అయిడియా ఎట్లా తట్టిందిరా నీకు "అని.

“సంసారం -సంసారం అనే పుస్తకంలో ఇల్లాంటి అయిడియాలు అనేకం వున్నాయి నాన్నా" అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతున్నాడు మురళి.

అతను వెళ్లిపొతే తెలుసుకోవలసిన విషయం పూర్తిగా తెలుసుకునే అవకాశం ఉండదనే ఉద్దేశంతో "ఒరే మురళి "అని పిలిచాడు బసవరాజు.

ఆ పిలుపు విని ఆగిపోయేడు మురళి.

బసవరాజు గబగబా మురళి దగ్గరికి వచ్చి "ఆ పుస్తకం పేరేమిటన్నావ్ ?”అని కుతూహలం గా అడిగేడు.

“సంసారం -సంసారం"చెప్పాడు మురళి.

“అది నీ దగ్గరుందా ?”

“ఎందుకు నాన్న ?”అడిగాడు మురళి.

“పుస్తకం ఎందుకని అడుగుతావేమిట్రా వెర్రి నాయనా!చదవడానికి.నేను చదవడానికి ఉందా.”

“లేదు"

“ఏమైంది ?పోయిందా ?”

“మా ఫ్రెండ్ కి కావాలంటే యిచ్చాను నాన్న.”

“మీ ఫ్రెండుకిచ్చావా?ఫ్రెండ్ కంటే తండ్రే ఖచ్చితంగాగొప్పవాడు!గుర్తుపెట్టుకో "

“ఆ మాటకొస్తే పుస్తకం కంటే ఎంతో విలువైన గ్రంధం తండ్రి "అన్నాడు మురళి.

“అని ఎవరన్నారు ?"

"వేదవాక్కు నాన్నా!వేదాల్లో చెప్పేరు.పుస్తకాల్లో అక్షరాలు మాత్రమే వుంటాయి.తండ్రి దగ్గర పచ్చి అనుభవాలుంటాయి.అక్షరం గొప్పదా?అనుభవం గొప్పదా?”అన్నాడు మురళి.

“అనుభవమే గొప్పది"

“మరింకే?”

“కానీ నీ తండ్రికి పర్సు అనుభవం బొత్తిగా లేదుగా!అదన్నమాట.సంసారం -సంసారం చదివి ఆ రూల్సుని నేను కూడా అమల్లోపెట్టుకుంటా !” అన్నాడు బసవరాజు.

“ఈ వయస్సులో ఆ చిట్కాలు పనిచెయ్యవు !”అని డాక్టర్ మురళి ఆ గది నుండి బయటికి వెళ్ళిపోయాడు.

అతను వెళ్ళిన వైపు కళ్ళింతవి చేసుకుని చూస్తూ నిలబడిపోయాడు బసవరాజు.అలా నిలబడిపోయి నోటికి వచ్చినట్టు గొణుక్కుంటూన్నాడు.

“ఈ వెధవ వేలడంతలేడు!నాకే చెబ్తున్నాడేమిటీ పాఠాలు?అంతేమరి!తండ్రయ్యేదీ తాతయ్యేదీ చెప్పేవాడికి అడిగేవాడు లోకువ!అంచేత ఇకముందు వీడినేమీ అడక్కూడదు" అని.

బసవరాజు తీసుకున్న కొత్త నిర్ణయం యింకా పచ్చిపచ్చిగానే వున్నసమయంలో అతని కుమార్తె ఉమ అతని గదిలోకి "నాన్నా" అని పిలుచుకుంటూ వచ్చింది.

ఆమె ఎందుకు వచ్చిందో తెలీక అడిగాడు. “ఏమ్మా ఉమా.మీ అన్నలాగా నువ్వుకూడా ఏదైనా వేదవాక్కు చెప్పడానికి వచ్చేవా!చెప్పుతల్లీ!గుడ్డొచ్చి పిల్లని వెక్కిరించిందని ఊరికే అన్నారా చెప్పు!”

“మా ఫ్రెండ్ పెళ్లి నాన్నా!”

''ప్రండనగా ఎవరు?ఆడ ఫ్రండా మగ ఫ్రండా అని ఖచ్చితంగా అడగాలనుకుని,అడిగితే వేదవాక్కు చెబుతుందేమోనన్న భయంతో ఏమీ అడగలేక 'మీ ఫ్రండా 'అన్నట్టు చూసేడంతే ! తండ్రి పాయింటును ఉమ అర్ధం చేసుకుంది కాబోలు.అందుకే చాలా స్పష్టంగా చెప్పింది.

“వనజ నాన్నా!మా వనజ పెళ్లి "అని. ఆ మాట విని బసవరాజు కొంచెం రిలాక్సయ్యాడు.

ఉమా చెబుతూనే వుంది. “ఈ పక్క ఊళ్లోనే పెళ్లి "

“ఈ పక్క ఆ పక్క వద్దు!ఊరు పేరు చెప్పు"

“వరంగల్ "

“పక్క ఊరేనంటావే !కొంచెం దూరమే!”

“కారులో వెడతాంగదా!దగ్గిరే అవుతుంది.రాత్రి పెళ్లి.సాయంత్రం వెళ్లి,మళ్ళీ రేపు మార్నీంగ్ కల్లా వచ్చేస్తా!”

“ఒంటరిగా వెడుతున్నావా ?”అడిగాడు బసవరాజు.

“ఊహు..సునీత,సుశీల,సుందరి...అందరం కలిసే వెడుతున్నాం.పెళ్ళివారు మా కోసం రెండు కార్లు పంపిస్తున్నారు "చెప్పింది ఉమ.

“కార్లు పంపకపోతే కాలినడకన రమ్మంటారా?నేను అడగదలుచుకున్నది అది కాదు.పెళ్లి కూతురు నీకంటే పెద్దదా చిన్నదా.అది చెప్పు నాకు!” అన్నాడు బసవరాజు.

“వనజ నాన్నా.వనజ.రెండు జడల వనజ.వనజ తెలీదూ ?"

“తెలీదు.మనింటికి వచ్చే ఆడపిల్లల జడల్ని లెక్క పెట్టడం నాకిష్టం లేదు.వనజా తెలీదు.వనజ వయస్సు తెలీదు.ఆ పిల్ల వయస్సెంత ?”అన్నాడు బసవరాజు.

“నా క్లాస్ మేట్ నాన్నా.మా యిద్దరిదీ ఒకటే వయస్సు "చెప్పింది ఉమ.

ఆ సమాధానం వినగానే బసవరాజు వళ్లు మండిపోయింది.ఉమకి సమాధానం చెప్పకుండా, జానకీ...జానకీ అని పిలుచుకుంటూ ఆ గదిలోంచి బయటపడుతున్నాడు.

అమ్మనెందుకు పిలుస్తున్నాడో ఉమకి అర్ధం కాలేదు.

అంచేత తండ్రి వాలకానికి తాత్పార్యం చెప్పికోలేక తండ్రి గదిలోనే నిలబడిపోయింది ఉమ.

(ఇంకావుంది)

(హాసం సౌజన్యంతో)