Antera Bamardee 2

 

This story is a courtesy of Padma Bhushan Varaprasad Reddy.

రెండవ భాగం

ఒక జీవిత సత్యం చెప్పాలనుకున్నా తన తండ్రి బసవరాజుతో,కొడుకు మురళి ఇలా అన్నాడు.

“ఇప్పటికే చాలా సత్యాలు చెప్పేపు నాన్నా!”అని.

“ఇది కొత్త సత్యం రా !సరికొత్త సత్యం.జాగ్రత్తగా విను.భార్య చేతికి ఏమిచ్చినా పర్లేదు.పర్సు మాత్రం ఇవ్వకు.ఎందుకు ఇవ్వద్దంటున్నానో గమనించేవా ?” అన్నాడు తండ్రి బసవరాజు.

“లేదు నాన్న "చెప్పాడు మురళి.

“నీ పర్సు మీ ఆవిడ చేతిలో పెడితే నీ పరువు గంగాపాలవుతుంది.భర్తవై వుండి కూడా, ప్రతి చిన్న బేవార్సు ఖర్చుకీ భార్యని అడుక్కోవాలి "చెప్పాడు బసవరాజు.

డాక్టర్ మురళి,తండ్రికి తాను తెలుసుకున్న సూత్రం చెప్పే ఉద్దేశంతో "భర్తలు భార్యల్ని ఆడుక్కుంటుంటే, భార్యలు ఆనందిస్తారు నాన్నా.ఆడవాళ్ళూ అల్ప సంతోషులు "అని.

బసవరాజు ఆశ్చర్యపోతూ అన్నాడు "వామ్మో.నాకు అంటే ఈ బసవరాజు ది గ్రేట్ కి తెలీని సూత్రం చెబుతున్నావే?”అని.

“నువ్వు ది గ్రేట్ వే కావచ్చు నాన్నా.అంతమాత్రాన అన్ని సూత్రాలూ క్షుణ్ణముగా తెలియాలనే రూలు ఏమైనా ఉందా..?”

“ఆఫ్ కోర్స్..”

“పర్సు మన జేబులో పెట్టుకుని ఆప్టరాల్ అయిదు నోటు ఖర్చు చేసినా,ఆడవాళ్ళు అమ్మో అంటారు "

“ఆఫ్ కోర్స్.అది వాళ్ళ లక్షణం "

“అదే పర్సు ఆడవాళ్ళ చేతికిచ్చేసి,వంద అడుక్కుని తీసుకున్నా ఆప్టరాలనుకుని ఆనందంగా యిస్తారు.”అన్నాడు కొడుకు మురళి.

“ఈ పాయింటు పూర్తిగా అర్థం కాలేదు.కొంచెం వివరించి చెప్పు"అన్నాడు బసవరాజు.

“వెరీ సింపుల్ నాన్నా.చెట్టంత మొగుడు చిట్టెలుక లాటి పెళ్ళాన్నిఅడుక్కుంటూన్నాడంటే ఆ వైఫ్ ఎంత ఆనందిస్తుందో తెలుసా?జస్ట్ సైకలాజికల్ ఫీలింగ్.సాక్షాత్తు విష్ణుమూర్తి భక్తుడ్ని బిడి ముక్క దానం చెయమని అడిగినట్టవుతుందన్నమాట"వివరంగా చెప్పాడు మురళి.

“ఛీ వెధవ బతుకు.ఇంత మంచి పాయింటు నాకింతవరకు తట్టనందుకు నన్ను నేను చెప్పుతో కొట్టుకోవాలి "అన్నాడు బసవరాజు బెంగపడిపోతూ.

మురళి తండ్రి రియాక్షన్ పట్టించుకోలేదు.

“ఇప్పుడు చెప్పు నాన్నా.పర్సు మన దగ్గరే పెట్టుకుని అయిదు రూపాయలతో సరిపెట్టుకోమంటావా ?పర్సు వాళ్ళ చేతికిచ్చి వందకి ప్లాన్ వేయమంటావా ?”అడిగాడు మురళి.

ఆ మాటకి బసవరాజు సమాధానం చెప్పకుండా,బోలెడు ఆశ్చర్యాన్ని మొహాన్న పులుముకుని మురళిని అడిగాడు.

(ఇంకా వుంది)

(హాసం సౌజన్యంతో)