అమ్మో అమ్మాయిలు 8

Listen Audio File :

అబ్బులు కథలో యిరుక్కున్న జయచిత్ర మహా ఆతృత పడిపోతూ "ఆ తర్వాతే మయిందండీ" అంది.

“అలా దారికిలా అమ్మడూ!” అనుకున్నాడు అబ్బులు.

“కోయ్ రా నాయనా కోయ్" అనుకున్నాడు వ్యాకర్ణ.

అబ్బులు మళ్ళీ మొదలుపెట్టాడు. “ఓసారి మా బంధువొకాయన కోర్టు పనిమీద మా యింటి కొచ్చాడు. ఆయన పేరు ఆంజనేయులు.ఆయన పేరు కూడా మా పేరులో తోకలా తగిలించారు లెండి. ఆంజనేయులుగారు మెచ్చుకుంటారని మా అమ్మ ఆయన పేరుతో అనగా నా పేరు లోఓ భాగం విడదీసి పిలవటం మొదలుపెట్టింది. ఎలా అంటే? 'ఒరేయ్ ఆంజనేయులూ! కాఫీ వెచ్చపడ్డాది తాగిపోమ్మా!', “బాబూ! ఆంజనేయా! యిలా రామ్మా? ఆంజనేయుడూ! అలా పోమ్మా!” అంటూ మా అమ్మ ఆయనకి వినపడేటట్లు నన్నుపేరుతో పిలుస్తూనే వుంది. ఆ సాయంత్రం దాకా వచ్చిన ఆంజనేయులుగారి పేరే కాక బుద్ధి కూడా వంకరే.

ఊరికి వెళ్ళేటప్పుడు అమ్మని పిలుచి కోపంగా మూతి యింత పొడుగున జాపి.. “అమ్మాయ్! నీకు మంచి మర్యాద తెలియదు. పెద్దవాడిని. చెట్టంత మనిషిని నా పేరు వాడికి పెడితే మాత్రం. నా ఎదురుగా ఆంజనేయులూ అంటావా? పెద్దంతరం చిన్నంతరం అక్కరలేదా?” అంటూ కోప్పడి వెళ్ళిపోయాడు.

ఆ తర్వాత.......” అక్కడితో ఆగాడు అబ్బులు.

“ఆ. ఆ తర్వాతేమయిందండీ?” అంది జయచిత్ర మహా మహా ఆతృత పడిపోతూ.

మళ్ళీ మొదలుపెట్టాడు అబ్బులు మహా ఉత్సాహంగా "కొన్నాళ్ళ తర్వాత ఓ రోజు మరో అతిథిదిగారు మా యింట్లో. ఆయన మా ఇంట్లో రెండురోజులుండి టైమ్ ప్రకారం సుష్టుగా భోంచేసి తను వచ్చినపని కానిచ్చుకుని వెళ్ళేటప్పుడు. మా అమ్మని నాలుగు మాటలని వెళ్ళాడు" అంటూ మళ్ళీ అబ్బులు ఆగిపోయాడు.

“మీ అమ్మేం చేసింది?” అంది జయచిత్ర సస్పెన్స్ క్రైమ్ నవల మధ్య సడెన్ బ్రేక్ పడినట్లు చింతిస్తూ.

“అబ్బులూ! బాగా సబ్బు అరగదీస్తున్నావు. కానియ్ కానియ్" అనుకున్నాడు వ్యాకర్ణ.

“అమ్మేం చేయలేదండీ. వచ్చిన అతిథి పేరు శంకరం. అప్పుడు మా అమ్మ నన్ను శంకరం అని పిలుస్తుండేది. అప్పుడు నాకు పదేళ్ళు, అప్పుడు నేను చాలా అల్లరి చేస్తుండేవాడిని, అప్పుడప్పుడు మా అమ్మని విసిగిస్తూ వుండేవాడిని. అప్పుడు.......”

“మీ అప్పుడు చప్పుడు త్వరగా కానిచ్చి అసలు విషయంలోకి రండి" అంటూ కోప్పడింది జయచిత్ర.

'అప్పుడు విషయం యిప్పుడు చెప్పవలసి వచ్చింది కదండీ! అప్పుడేం జరిగిందో తెలియాలంటే అప్పటి విషయం చెప్పాలి. అప్పుడు సంగతి అయిందిలేండి. అప్పుడు ఆయన అనగా శంకరంకి జరిగిన అవమానం ఇదండీ. ఏంటంటే మా అమ్మ నన్ను - 'ఒరేయ్ శంకరం వెధవా! ఓరి పనికిమాలిన శంకరమా! శంకరాయ్ నీకేం తిప్పు వచ్చిందిరా! అంటూ శంకరం పేరుతో తిట్టిందండీ. అది విన్న అతిథి శంకరానికి అప్పుడు అనుమానం వచ్చింది. తన పేరుగా కొడుకుని పిలుస్తూ తన్నే తిట్టిపోస్తున్నది అని. అదేమాట మా అమ్మతో అని మరీ వెళ్ళాడు. అప్పుడు జరిగింది అదండి.

దానివల్ల మా అమ్మకి నా పేరుతో వున్న ప్రతిబంధువుతో బాధ తప్ప ప్రయోజనం కనపడలేదు. ఓ పుల్లారావు వచ్చి నా పేరు పెట్టారు. ఆ పేరుతో మీ అబాయిని పిలవరేంటి? పిలవనివాడికి పేరెందుకు పెట్టాని అని పొట్లాడితే మరో ఎల్లారావు వచ్చీ 'అయ్! నా పేరు గౌరవంగా వాడాలి కాని తిట్లకి శాపనార్థాలకీనా!” ఇలా గోల గోల అయింది.

మా అమ్మకి విసుగేసి ముద్దుగా అబ్బులూ అని పిలవటం మొదలుపెట్టింది. అప్పటినుంచి నా పేరు అబ్బులయింది. అబ్బులు, అబ్బునాధం, అబ్బూయిలా మా యింట్లోను మా బంధుమిత్రులు పిలవటం ప్రారంభించి అదే ఖాయం చేశారు. యిదండీ జరిగింది.”