TeluguOne Services
Copyright © 2000 -
, TeluguOne - Comedy - All rights reserved.
ఆహా నగర్ కాలనీ
సూరేపల్లి విజయ
15 వ భాగం
సాయంత్రం నుంచి రాత్రి వరకూ ఆహానగర్ కాలనీలో ఓ రౌండ్ వేసి, హోటల్ వైపు వెళ్తుండగా దారిలో ఉన్న వియన్ కాలనీ పోలిస్ స్టేషన్ లో నుంచి అరుపులు వినిపించాయి. సాకేత్ కు.
"నేను జేబు కత్తిరించేసాను. నేను దొంగను....పాపిని....నన్ను కోర్టుకు తీసుకెళ్ళండి" అంటూ. వెంటనే పోలిస్ స్టేషన్ లోకి పరుగు పెట్టాడు సాకేత్.
పోలిస్ స్టేషన్ లాకప్ లో లాకప్ డెత్ చేస్తున్నారా?థర్డ్ డిగ్రి ప్రయోగిస్తున్నారా? అనేక అనుమానాలు. సాకేత్ లోపలికి వెళ్ళేసరికి ఓ వ్యక్తి గిలగిల కొట్టుకుంటున్నాడు. పోలిసులు అతనికి సపరిచర్యలవి చేస్తున్నారు.
"ఇన్ స్పెక్టర్ వాటీజ్ దిస్...ఓ నిందితుడ్ని లాకప్ డెత్ చేస్తున్నారా?" కోపంగా అడిగాడు సాకేత్.
"మీరెవరు సార్?" సౌమ్యంగా అడిగాడు ఇన్ స్పెక్టర్.
"బాధ్యతగల పౌరుడ్ని" గంభీరంగా అన్నాడు.
"కూచోండి బాద్యతగల పౌరుడు గారూ" అంటూ కుర్చీ ఆఫర్ చేసాడు ఇన్ స్పెక్టర్.
"ఏంటీ....మాటల్లో పెట్టి నన్ను కూడా లాకప్ డెత్ చేద్దామనే" అన్నాడు.
"అయ్యేయ్యో....అన్నేసి మాటలెందుకులెండి. ముందు మీరు రిలాక్స్ అవ్వండి." ఇంకా సౌమ్యంగా అన్నాడు ఇన్ స్పెక్టర్.
ఇంతకీ అతడ్ని ఏం చేశారు? కోపంగా అడిగాడు.
ఈ లోగా సింహాచలం తేరుకున్నాడు.
సాకేత్ అతని దగ్గరికి వెళ్ళి మీరేం భయపడకండి. మిమ్మల్ని ఈ పోలిసులు ఏం చేశారో చెప్పండి. నేను జర్నలిస్టును. "థూ....నీ యబ్బ జీవితం....నన్ను వాళ్ళూ కొట్టినా బావుండు....నన్ను కొట్టకుండా ఒక్క బూతు తిట్టకుండా.....ఛీ....నా జీవితం టాంక్ బండ్ లో అంతమవ్వ" అంటూ తనని తానే తిట్టుకున్నాడు.
"అసలేం జరిగింది?" అనుమానంగా అడిగాడు సాకేత్.
"బిర్యాని మీద బిర్యాని పెట్టి తినమని చంపారు. తినకపోతే ఎక్కడ చంపుతారో అని చావలేక నిజం చెప్పి చచ్చాను. నేరకపోయి ఈ దిక్కుమాలిన కాలినికి వచ్చాను" అంటూ మళ్ళీ ఏడ్చాడు.
వెంటనే ఇన్ స్పెక్టర్ షేర్ ఖాన్ సాకేత్ మీద చేయేసి "ఎక్సయిట్ అవ్వొద్దు." అని రైటర్ రామేశాన్ని పిలిచి క్యాసెట్ వి.సి. ఆర్ లో పెట్టి ఆన్ చేయమన్నాడు. వీడియో క్యాసెట్ మొత్తం చూశాక, రెండు చేతులు జోడించాడు సాకేత్.
"ఇన్ స్పెక్టర్ గారూ... ఒక్క రక్తం చుక్క బయటకు రాకుండా ఒంటిమీద చెయి వేయకుండా, ఫుడ్డు మీద ఫుడ్డు పెట్టి నడ్డీ విరక్కుండా నిజం చెప్పించారు. చూడండీ...వెంటాస్టిక్ ...మిమ్మల్ని చూస్తుంటే కురుక్షేత్రంలో అర్జునుడికి గీతబోధ చేస్తున్న శ్రీకృష్ణుడిలా కనిపిస్తున్నారు. వెంటనే షేర్ ఖాన్ తన కృష్ణుడి గెటప్ లో ఎలా ఉంటానో అని ఊరించేసుకుంటున్నాడు.
"సార్....కొత్తరకం ఇంటరాగేషన్ కు మీరే అద్యులు. ఇంతకీ ఈ క్యాసెట్ ఏం చేస్తారు?" అడిగాడు ఆసక్తిగా సాకేత్.
"మా స్టేషన్ కు వచ్చే నిందుతులకు ఇది చూపించి నిజం చెప్పమని అడుగుతాం. లేదంటే మరో కొత్తరకం ట్రీట్ మెంట్. అసలు మా డీజీపి ఒప్పుకుంటే ఈ క్యాసెట్ అన్నీ పోలిస్ స్టేషన్లకు పంపి నేరస్తులకు చూపించాలి" అన్నాడు షేర్ ఖాన్.
"చాలా చక్కని ఆలోచన" అన్నాడు మనస్పూర్తిగా సాకేత్.
* * *
అలారం మోత విని కళ్లు తెరిచాడు సూరిబాబు.
"అబ్బ....అప్పుడే తెల్లారిందా? రాత్రంతా దోమల సంగీతంతో నిద్రలేదు." అనుకుంటూ దుప్పటి గిరాటేసి, అద్దం ముందు నిలబడ్డాడు. తన మొహం తనే చూసుకుంటే అదృష్టం కలిసి వస్తుందని అతని నమ్మకం.
అందుకే రోజు నిద్రలేవగానే అద్దం ముందుకు వెళ్ళందనే కళ్ళు తెరవడు. అలాగే, ఆ రోజు కూడా అద్దం ముందు నిలబడి కళ్ళు తెరిచి, కెవ్వుమన్నాడు.
"అదేమిటండీ....అర్దరాత్రి స్టార్ మూవీస్ లో హరర్ షో చూసినట్టు ఆ గావుకేకలు" పడక గదిలోకి వచ్చి, భర్తని పరామర్శించి అడిగి, ఆ తర్వాత భర్త అవతారం చూసి తనూ కెవ్వుమని కేకవేసింది.
"ఛీ...ఛీ... సిగ్గులేకుండా నువ్వు కూడా అరుస్తావా?" కోపంగా అన్నాడు సూరిబాబు.
"బావుంది నేనేం చేసాను" అంది అతని భార్య.
|