తాతా ధిత్తై తరిగిణతోం 51

తాతా ధిత్తై తరిగిణతోం 51

 

జీడిగుంట రామచంద్రమూర్తి

 

Get latest telugu famous comedy serials Taataadhithai tadiginatom, telugu serial comics and latest jokes online

 

"తమరు ఎట్టి పరిస్థితిలోనూ తమరి మావగారింటికి ఎల్లకూడదంటండి. అందుకే మీ కూడానే వుండీ మిమ్మల్ని బస్సుదిగ్గానే నేరుగా టేసిన్ కి తీసుకెల్ళీ రైలెక్కించమన్నారండి. ఈ డ్యూటీ చేస్తున్నందుకు ఖర్చులు కాకుండా పైన వెయ్యి రూపాయలిచ్చారండి."

"నేనిప్పుడు రెండువేలిస్తాను. చెప్పినట్టు చెయ్యి." జేబులోంచి పర్సు తీస్తూ అన్నాడు శ్రీరామ్. అర్థం కానట్టు చూశాడు వీరయ్య.

"వెంటనే తిరుగు బస్సులో మనూరెళ్లిపో నేను ఆదివారం తిరిగి మనూరొచ్చేదాకా హాయిగా నీ ఇంట్లో పెళ్లాం పిల్లలతో కాలక్షేపం చెయ్యి. మా నాన్నగారికి అనుమానం రాకుండా నేను చూస్తాలే." పర్సులోంచి నోట్లు తీసి ఇవ్వబోయాడు.

"కానీ అయ్యగారు..." నోట్లవైపు చూస్తూ నీళ్లు నమిలాడు వీరయ్య.

"భయం లేదన్నాగా! మా నాన్నగారితో నువ్వీ రెండ్రోజులూ ఇక్కడే నాకోసం వున్నావని చెప్తాను. వెళ్లు...అసలే ఆడపిల్లలు గలవాడివి ఈ డబ్బు వాళ్ళకెందుకైనా ఉపయోగ పడుతుంది." అంటూ వాటిని వీరయ్య చేతిలో పెట్టాడు.

రెండు క్షణాలు ఆలోచించాడు వీరయ్య.

"సరే బాబూ! తమరు సెప్పినట్టే చేస్తా. తర్వాత నాకు ఆపదరాకుండా మీరే చూసుకోవాల." అంటూ నమస్కారం చేసి బస్సు వైపు నడిచాడు. శ్రీరామ్ తృప్తిగా నిట్టూర్చి రోడ్డువైపు నడిచాడు.

*                 *             *            *

విజయవాడ స్టేషన్ లో రైలు దిగి అశ్వినీ, శ్రీరామ్ ఆటో ఎక్కి ఓ లాడ్జికి చేరుకున్నారు. రిసెప్షన్ కౌంటర్లో తీరుబడిగా పేపరు చదువుకుంటూ కూర్చున్న మేనేజరు దగ్గరకు వచ్చిన శ్రీరామ్ "మాకు 'రూం ' కావాలి డబుల్ రూం." అన్నాడు.

మేనేజరు వాళ్ళిద్దరి వైపూ పరిశీలనగా చూశాడు తర్వాత మళ్లీ పేపర్లో తల దూర్చాడు.

శ్రీరామ్ కి చిర్రెత్తుకొచ్చింది.

"మిమ్మల్నే అడుగుతున్నాను మాకు రూమ్ కావాలి." మళ్లీ అడిగాడు.

మేనేజరు పేపర్ని పక్కనపెట్టి అశ్వినిని ఆపాదమస్తకం చూశాడు.

శ్రీరామ్ కి అరికాలిమంట నడినెత్తికెక్కింది. అడుగుతున్నది నేను. తనవైపు చూస్తారేమిటి" హెచ్చరిస్తున్నట్టుగా బల్లమీద చేత్తో కొట్టి విసుగ్గా చూస్తూ అడిగాడు.

"ఆ అబ్బే! మరేం లేదు ఇస్తాను. రూమ్ ఇస్తాను." అంటూ ఓ రిజిస్టర్ తీసి శ్రీరామ్ ముందుంచాడు.

"ఇందులో మీ పేరూ అడ్రస్సు రాయండి" అన్నాడు.

శ్రీరామ్ రాస్తూంటే అతను అశ్విని వైపు తదేకంగా చూశాడు ఈ లోగా రిజిస్టర్ లో అడ్రస్సు రాసి అడ్వాన్సు కూడా ఇచ్చాడు శ్రీరామ్.

"ఒరే సాంబా. అయ్యగార్నీ, అమ్మగార్నీ పదమూడో నంబరు రూమ్ కి తీసుకెళ్లు!" అంటూ 'బాయ్' ని పిలిచి 'రూమ్' తాళం చెవి ఇచ్చాడు మేనేజరు.

ఇద్దరూ బాయ్ వెంట రూమ్ లోకి వచ్చారు. "చూడు! ముందు మాకు రెండు స్ట్రాంగ్ కాఫీ పట్టుకురా." సూట్ కేసూ, బ్యాగూ బల్లమీద వుంచి బయటకు వెళ్లిపోతున్న బాయ్ తో చెప్పాడు శ్రీరామ్.

"థాంక్ గాడ్. మొత్తానికి మనం అనుకున్నట్టుగా జరుగుతోంది. ప్లాన్ ప్రకారం రూమ్ లోకి వచ్చి పడ్డాం." మంచం మీద కూర్చున్న అశ్విని తేలిగ్గా నిట్టూరుస్తూ చెప్పింది.

"కానీ మనం తొందరపతున్నమేమో అనిపిస్తోంది అశ్వినీ." తన బ్యాగ్ లోంచి బట్టలు తీస్తూ అన్నాడు శ్రీరామ్.

"ఇప్పటికీ ఆలస్యం చేశాం." అందామె కొంటెగా చూస్తూ.