TeluguOne Services
Copyright © 2000 -
2025
, TeluguOne - Comedy - All rights reserved.
తాతా ధిత్తై తరిగిణతోం 50
జీడిగుంట రామచంద్రమూర్తి
"ఏమిటీ? నీ వివాహమునకు ఆ సుబ్బారావు వాళ్లావిడతో వచ్చాడా? అలాంటప్పుడు నీవిప్పుడు వాడి పెళ్ళికి వెళ్ళుట ఏమిటీ? ఆ తలమాసిన వానికి ఇప్పుడు జరుగుతున్నది ద్వితీయ వివాహమా? అటులైన గ్రీటింగు కొట్టుట కూడా అనవసరము." అన్నాడు వీరభద్రం విసురుగా.
తను కొంచెం 'ఓవర్' గా యాక్ట్ చేయబోయి 'డైలాగ్' ను తడబడి చెప్పిన సంగతి గ్రహించాడు శ్రీరామ్...వెంటనే సర్దుకుంటూ అన్నాడు.
"అంటే ....అదీ...వాడిది లవ్ మేరేజ్ అన్నమాట. కాలేజిలో చదివేటప్పుడు ఓ అమ్మాయిని ప్రేమించాడు...ఆ అమ్మాయినే వెంట బెట్టుకుని నా పెళ్ళికి కొచ్చాడు...ఆ అమ్మాయినే పెళ్ళి చేసుకుంటున్నాడు...అదన్నమాట."
"బావున్నది! కాలేజీ చదవుతో పాటు మీరిద్దరూ ప్రేమాయణాలు కూడా సాగించారన్నమాట! ఒకే రూమునందు అఘోరించినందుకు ఒకేరకమైన బుద్ధులు కూడా ఒంట బట్టినట్టున్నవి."
అంతలోనే పార్వతమ్మ వెండిగ్లాసుతో మజ్జిగ తెచ్చింది....భర్త మాటలు ఆమె చెవిన కూడా బడ్డాయి.
"అబ్బ మీకు ఆ ఆరాలన్నీ ఎందుకు చెప్పండి? వాడింకా చిన్నపిల్లాడా ఎవన్నానా? ఏం చేయాలో, చెయ్యకూడదో వాడికి తెలీదా? పాపం...పెళ్ళయి నాలుగు నెలలు కావస్తున్నా పెళ్లాంతో ఓ పుణ్యక్షేత్రానికి కూడా వెళ్లి రాలేకపోయాడు. కనీసం స్నేహితుడి పెళ్ళికూడా వెళ్ళద్దు పొమ్మంటే ఎలా? అయినా రెండ్రోజులు భాగ్యానికి ఇంత హడావిడి చెయ్యాలా?" గ్లాసు భర్తకు అందిస్తూ అడిగింది.
గ్లాసులో మజ్జిగ తాగుతూనే ఆలోచించాడు వీరభద్రం. ఆ తర్వాత ఓ నిర్ణయానికి వచ్చిన వాడిలా చెప్పాడు.
"సరే...అఘోరించమను."
అశ్విని వేసిన పథకం ప్రకారం అక్షరాలా అమలు జరుగుతున్నందుకు ఆనందంతో ఎగిరిగంతేయ బోయాడు శ్రీరామ్. కానీ తండ్రికి అనుమానం వస్తుందేమోనన్న ఆలోచనతో ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నాడు.
వెంటనే సెల్ ఫోన్ తీసి గబగబా నంబర్లు నొక్కి ఫోన్లో చెప్పాడు ఉత్సాహంగా.
"ఒరే సుబ్బారావ్! నువ్ చెప్పినట్టే నీ పెళ్లికి వచ్చేస్తున్నాన్రా." అయితే శ్రీరామ్ సెల్ ఫోన్ నొక్కిన నంబరు అశ్వినిదనీ, 'ఒరే సుబ్బారావ్' అని శ్రీరామ్ సంబోదించింది 'అశ్వినీ' ననీ వీరభద్రానికీ, పార్వతమ్మకు తెలీదు.
* * * *
భుజాన 'ఎయిర్ బ్యాగ్' వేసుకుని టౌన్ బస్టాండు లో బస్సు దిగాడు శ్రీరామ్.
తనను 'రిసీవ్' చేసుకునేందుకు అశ్విని పంపిస్తానని చెప్పిన కారు బస్టాండు బయట ఉంటుందని ఊహించి హుషారుగా ఈల పాట పాడుకుంటూ, అటువైపు వేగంగా నడిచాడు.
పదడుగులు వేశాడోలేదో 'చిన్నయ్య గారు' అంటూ పిలుపు వినిపించింది. బహుశా అశ్విని పంపిన పిలుపు వినిపించింది. బహుశా అశ్విని పంపిన కారు డ్రైవరు తనకోసం వచ్చినట్టున్నాడని పక్కకు తిరిగి చూశాడు. పరుగులాంటి నడకతో తన వైపు వస్తున్న వ్యక్తిని చూసి గతుక్కుమన్నాడు శ్రీరామ్.
ఆ వ్యక్తి కారు డ్రైవరు కాదు.స్కూలు బంట్రోతు వీరయ్య.
"నేను ఫస్టు బస్సులోనే వచ్చేశానండయ్యా! తమరు కూడా అందులోనే వచ్చేస్తారనుకున్నాను. పర్లేదులెండి. రైలుకింకా టైముంది." అన్నాడు కొంచెం వగరుస్తూ. విషయం బోధపడలేదు శ్రీరామ్ కి.
"నేనొస్తానని నీకెలా తెలుసు? అయినా నువ్వెందుకొచ్చావసలు?" మనసులో చెలరేగుతున్న అలజడుల్ని అణిచిపెట్టుకుంటూ అడిగాడు.
"నిన్న సాయంత్రం స్కూలొదిలింతర్వాత పెద్దయ్యగారు పిల్సి చెప్పారండయ్యా."
"ఏం చెప్పారు?"
"అదేనండి! తమరిప్పుడు విశాఖపట్నం ఎడతారంట కదండీ? టౌన్ దాకా సాయం వెళ్లీ బస్టాండునించి సిన్నయ్యగార్ని టేసన్ కి తీసుకెళ్ళి విశాఖపట్నానికి టిక్కెట్టుకొనీ జాగ్రత్తగా రైలెక్కించూ అన్నారండి. మల్లా...ఎల్లుండి తమరు రైల్లోంచి దిగగానే వెంట పెట్టుకునీ ఎకాఎకి బస్సులో మనూరు తీసుకొచ్చేయమన్నారండీ!" వివరించాడు వీరయ్య.
"ఆయనకేమన్నా మతిపోయిందా? ఈ టౌన్లో చదువుకున్నవాణ్ణి...ఇక్కడ తిరిగినవాణ్ణి....నాకు సాయం ఎందుకూ?" లోపల అనుకోబోయి, పైకి అనేశాడు శ్రీరామ్.
"ఆ సంగతే నాకు తెలియక 'నా మతోయిందండి!"
తండ్రి చేసిన ఆ ఏర్పాటు వెనుక ఎలాంటి కుట్ర వుందో వెంటనే గ్రహించాడు శ్రీరామ్.
"సర్లే. వచ్చినవాడివి ఎలానూ వచ్చావ్. హాయిగా ఉడిపి హోటల్లో భోంచేసి శారదా టాకీసులో సినిమా చూసి వెళ్లిపో. నేను స్టేషన్ కి వెళ్లి టిక్కట్టు కొనుక్కుని రైలెక్కగలనులే." అన్నాడు.
"అయ్యో...కుదర్దండి. పెద్దయ్యాగారూ సెప్పినట్టు సెయ్యకపోతే నా ఉద్యోగం ఊడిపోద్దండి. అసలే ఆడపిల్లలు గలవోణ్ణి పైగా ఇందులో ఇంకో మతలబు కూడా ఉండండి." చెప్పాడు వీరయ్య.
"మతలబా.? అంటే?"
|