సిల్లీ ఫెలో - 56

Get latest Mallik telugu famous comedy serials, Mallik Telugu Comedy Serial Silly Fellow,  Mallik telugu serial comics and latest jokes online

 

సిల్లీఫెలో - 56

- మల్లిక్

 

బుచ్చిబాబు ఉలిక్కిపడి నిద్రలేచాడు.

"బుచ్చీ... బుచ్చీ..." సీత బుచ్చిబాబు భుజం తడుతూ వుంది.

కళ్ళు తెరిచి సీత వంక చూసాడు బుచ్చిబాబు.

"విజయవాడ వచ్చేసింది" అంది సీత.

చటుక్కున బెర్తుమీద నుండి లేచాడు బుచ్చిబాబు, గబగబా దుపట్లు, తలగడలు తీసి చుట్టేసి తాడుతో కట్టేశాడు.

"అబ్బ! ఇలా అర్థరాత్రి ఊరొచ్చే ట్రైన్ ప్రయాణం చాలా బోర్. అసలు పడుకున్నట్టే ఉండదు" అన్నాడు బుచ్చిబాబు రైలు కిటికీలోంచి బయటకి చీకట్లోకి చూస్తూ.

"అవును" ఆవులిస్తూ అంది సీత.

రైలు స్పీడు తగ్గి స్లో అయ్యింది. ఓ అయిదు నిముషాల్లో విజయవాడ ప్లాట్ ఫాం మీద ఆగింది. బుచ్చిబాబు, సీత సామాన్లు తీసుకుని ప్లాట్ ఫాం మీదికి దిగేశారు.

బుచ్చిబాబు చూపులు ప్లాట్ ఫాం మీద వెతకసాగాయి.

"మీ ఫ్రండ్ వచ్చినట్టు లేడు కదూ?" అంది సీత.

"లేదు... తప్పకుండా వస్తాడు." బుచ్చిబాబు ప్లాట్ ఫాం మీద హడావిడిగా తిరిగే జనాన్ని చూస్తూ.

"ఎలాగయినా ఇంత అర్థరాత్రి అతనికి రావడం కష్టమే."

"అయినా వస్తాడు. ఎందుకంటే మనకి ఇల్లుచూసి పెట్టింది వాడే. ఆ ఇల్లు ఎక్కడుందో నాకు తెలీదు. ఇప్పుడు వాడొచ్చి మనల్ని రిసీవ్ చేసుకుని ఆ ఇంటికి తీసుకెళతాడు."

"పాపం అతనికి చాలా శ్రమే అంది సీత.

"శ్రమేం వుంది? ఫెండ్ కోసం ఆ మాత్రం చెయ్యలేడా?"

"ఇంతకీ అతను నీకెలా తెలుసు?"

"మేమిద్దరం కాలేజీలో క్లాస్ మేట్స్ మీ. ఇప్పుడు వాడు కూడా మా ఆఫీసులోనే పని చేస్తున్నాడు . ఇక్కడే... ఈ విజయవాడ బ్రాంచీలో."

"బాగానే వుంది. అయితే ఇక్కడ మీకు కాలేజ్ మేట్ దొరికాడన్నమాట" నవ్వుతూ అంది సీత.

"వాడు ఉండబట్టే మనకి ఇల్లు చూసి పెట్టాడు" అన్నాడు బుచ్చిబాబు.

ఓ నిముషం గడిచాక బుచ్చిబాబు ఫ్రెండ్ హడావిడిగా వగరుస్తూ వాళ్ళ దగ్గరకి వచ్చాడు.

"సారీరా బుచ్చిబాబూ..... నిద్రపట్టేసింది. అందుకే రావడం ఆలస్యం అయింది" అన్నాడు అతను.

"మరేం ఫరవాలేదు. మేం వచ్చి అయిదు నిమిషాలే అయింది అన్నాడు బుచ్చిబాబు.

"పద వెళ్దాం" వెనక్కి తిరిగాడు అతను.

"ఒక్క నిముషం" అతన్ని ఆపాడు బుచ్చిబాబు.

అతను ఆగి బుచ్చిబాబు వంక ప్రశ్నార్థకంగా చూసాడు.

"ఇతను నా ఫ్రెండ్ మోహన్!" సీతకి పరిచయం చేస్తూ అన్నాడు బుచ్చిబాబు.

సీత మోహన్ కి నమస్కారం పెట్టింది. మోహన్ కూడా ప్రతి నమస్కారం చేశాడు.

అప్పడు చూశాడు సీతని.

"ఈమె సీత" చెప్పాడు బుచ్చిబాబు.

"సీతా? అంటే?" సందేహంగా అడిగాడు మోహన్.

బుచ్చిబాబు అప్పటికే నాలుగడుగులు ముందుకు వేసాడు. బుచ్చిబాబుకి తన ప్రశ్న వినిపించిందో, వినిపించీ పట్టించుకోలేదో మోహన్ కి తెలీలేదు.

బుచ్చిబాబుని మోహన్, సీత అనుసరిస్తూ స్టేషన్ బయటకి నడిచారు.


*         *            *