TeluguOne Services
Copyright © 2000 -
, TeluguOne - Comedy - All rights reserved.
సిల్లీఫెలో - 22
- మల్లిక్
అరగంట గడిచింది.
మినిస్టర్ మిన్నారావు హఠాత్తుగా బయటికి వచ్చాడు. అరమోడ్పు కళ్ళు వేస్కొని కాళ్ళు బార్లా చాపి సోఫాలో విశ్రమించిన ఆ ఇద్దర్నీ చూసి.
"ఓర్నియవ్వ... ఛాం ఛాం సెలూన్ మీరే ఓపెన్ చేసినట్లు అంత అలసిపోయారేంటయ్యా ఆ!?" ఆనాడు వాళ్ళ ఎదురుగా కూర్చుంటూ.
ఈ హఠాత్పరిణామానికి ఇద్దరూ కంగారుగా లేచి నిలబడ్డారు "న... న... నమస్కారం సార్" అన్నారు కోరస్ గా.
"మీరేనా వీరేశం పంపిన మనుషులు?"
ఇద్దరూ వినయంగా చేతులు కట్టుకుని తలలు ఊపారు.
వెంటనే మినిస్టర్ మిన్నారావు జేబులోంచి ఓ ఫోటో తీసి వాళ్ళ ముందున్న టీపాయ్ మీద పడేసాడు. వెంకట్రావు అయోమయంగా ఆ ఫోటో చేతికిలోకి తీసుకున్నాడు. ఇద్దరూ ఆ ఫోటోని కళ్ళార్పకుండా చూసారు.
ఆ ఫోటోని మిన్నారావు ఎందుకిచ్చాడో వాళ్ళకి అర్థంకాలేదు. కొంపదీసి రికమెండేషన్ గురించి ఆ ఫోటోలోని మనిషిని కలవమని చెప్పాడు కదా?" అనుకున్నారిద్దరూ.
ఇంతలో "ఠాప్..." మని శబ్దం వినిపించింది.
ఇద్దరూ ఉలిక్కిపడి తలెత్తిచూశారు. టీపాయ్ మీద వంద రూపాయల నోట్ల కట్టలు అయిదు వున్నాయి. అంటే యాభైవేలు.
"ఆ డబ్బు తీస్కోండి" అన్నాడు" మినిస్టర్ మిన్నారావ్.
బుచ్చిబాబు ఉక్కిరిబిక్కిరి అయ్యాడు.
"ఈ మినిస్టర్ చాలా మంచివాడిలా వున్నాడు. మనకి ట్రాన్స్ ఫర్ కాన్సిల్ చేయించి పెట్టడం కాకుండా ఎదురు డబ్బులు కూడా ఇస్తున్నాడు.యాభైవేలు!" వెంకట్రావు చెవిలో సంబరంగా అన్నాడు.
"నీ బొంద అదేంకాదు....! ఇందులో ఏదో తిరకాసుంది" బుచ్చిబాబుని చెవిలో తిట్టి "ఏంటి సార్ ఇది? యాభైవేలు ఇస్తున్నారు" అన్నాడు వెంకట్రావు మిన్నారావుతో.
"అన్తేనయ్యా. నేను పూర్తి డబ్బులు ముందుగా ఇవ్వను. పని పూర్తయ్యాక మిగతా యాభైవేలు ఇస్తాను. ఆ ఫోటోలోని వాడిని జాగ్రత్తగా చూడండి. కావాలంటే ఫోటోని మీ కూడా తీసుకెళ్ళండి. కానీ వారం రోజుల్లోగా వాడు ఖతం కావాలి!~"
వెంకట్రావ్, బుచ్చిబాబులు వాళ్ళ మధ్య బాంబుపడినట్లు ఉలిక్కిపడ్డారు. వెంకట్రావు చేతిలోంచి ఫోటో జారి కిందపడింది.
|