TeluguOne Services
Copyright © 2000 -
2025
, TeluguOne - Comedy - All rights reserved.
సిల్లీఫెలో - 103
- మల్లిక్
ఎందుకలా అరిచింది? అమ్మకేమయింది? 'నాగరాజు - నంగనాచి' సినిమాలో హీరోని మంచం క్రిందనుండి
పామొచ్చి కాటేసినట్టు ఇక్కడ కూడా జరగలేదు కదా?
బుచ్చిబాబు సోఫాలోంచి ఒక్క గెంతు గెంతి బెడ్ రూం దగ్గరికి పరుగు తీసాడు.
గుమ్మం దగ్గర ఆగిపోయి లోపలికి ఆందోళనగా చూశాడు.
పార్వతమ్మ కుడిచేయి పైకెత్తి ఒక బ్రాసరీని పట్టుకుని ఉంది.
ఆమె దాన్ని ఆందోళనగానూ, పర్వతాలరావు దాన్ని ఆశ్చర్యంగానూ చూడసాగారు. ఆ దృశ్యాన్ని చూసిన
బుచ్చిబాబు భయంకరంగా అరిచాడు.
"కెవ్ వ్ వ్"
"ఏంట్రా ఇదీ...?"
కాస్సేపయ్యాక అడిగింది పార్వతమ్మ.
"అదీ.. అదీ... నన్నుడుగుతావేం?"
"అదేంటి మాకు తెలీకకాదు.. అదిక్కడ ఎందుకుందీ అని అడుగుతున్నాం" అరుస్తున్నట్టుగా అన్నాడు
పర్వతాలరావ్.
బుచ్చిబాబు బుర్రంతా గందరగోళంగా మారిపోయింది.
"అదీ.. మరే... మరే... నాదే... అందుకుని ఇక్కడ ఉంది" చటుక్కున అనేశాడు.
పార్వతమ్మ, పర్వతాలరావులు ఆ సమాధానానికి ఉలిక్కిపడ్డారు. పార్వతమ్మ అయితే నేలమీదే
కూలబడిపోయింది.
"నువ్వు మరీ అంత ఘోరంగా ఉలిక్కిపడిపోనక్కర్లా...."
విసుక్కుంటూ పార్వతమ్మ జబ్బపట్టుకుని నేలమీంచి లేపాడు పర్వతాలరావు.
తర్వాత బుచ్చిబాబు వంక సీరియస్ గా చూస్తూ ప్రశ్నించాడు.
"అది నీదా? నువ్వు దాన్నెందుకు కొనుక్కున్నావ్? చెప్పరా వెధవ కుంకాయ్"
"అంటే... మరీ.... ఈ ఊళ్ళో ఉక్కపోత ఎక్కువ కదా.. అందుకని బనీనులు ఫుల్ గా కవర్ చేస్తాయ్..
ఇదైతే కాస్తంతమేరే కవర్ చేస్తుంది... అందుకనీ!" బుర్ర గోక్కున్నాడు బుచ్చిబాబు.
"నీ వెధవ ఆలోచనలు ఏడ్చినట్టే ఉన్నాయ్... అంతగా ఉక్కపోత ఎక్కువైతే బనీన్లు వేస్కోకు. అంతేగానీ
బాడీలు వేస్కోవడం ఏంట్రా పింజారీ వెధవా... హవ్వా హవ్వ హవ్వ!" నోటిమీద కొట్టుకున్నాడు
పర్వతాలరావు.
"అంటే ఇక్కడ విజయవాడలో చాలామంది బాడీలు వేస్కుంటారు. మరేం ఫర్వాలేదేమోనని నేనూ
వేసుకుంటున్నా..." బిక్కమొహం వేస్కుని అన్నాడు బుచ్చిబాబు.
ఇంతలో పార్వతమ్మ మళ్ళీ కెవ్వుమని అరిచింది.
బుచ్చిబాబు పర్వతాలరావూ ఉలిక్కిపడి పార్వతమ్మ వైపు చూశారు.
పార్వతమ్మ కళ్ళు ఇంతింత పెద్దవి చేసి నోరు తెరుచుకుని చూస్తూ ఉంది.
ఆమె చూస్తున్న వైపుకి ఇద్దరూ తలలు త్రిప్పి చూశారు.
అక్కడ గూట్లో ఓ అరడజను దాకా చీరలు, జాకెట్లూ మడతపెట్టి ఉన్నాయ్.
వాటిని చూడగానే బుచ్చిబాబు కృంగిపోయాడు.
|