TeluguOne Services
Copyright © 2000 -
2025
, TeluguOne - Comedy - All rights reserved.
సిల్లీఫెలో - 102
- మల్లిక్
"అయినా అతను పెళ్ళాన్ని ఇక్కడకు పంపించాడేంటి? మనిద్దరికీ ఆమెతో పరిచయం లేదు. అతను మీతోపాటు ఆఫీసులో పనిచేస్తాడు కాబట్టి అతనే ఇక్కడికి రావాల్సింది. మీరిద్దరూ కలిసి పాడుకునేవారుగా?"
"నిజమేగానీ అతను ఆమెని పంపించాడు. దానికి మనమే చేస్తాం? మనం అలానే లోపల చర్చిస్తూ కూర్చుంటే ఆమె బయట ఏమయినా అనుకుంటుంది. పద బయటికి పోదాం అంటూ ఆమె సమాధానం కోసం ఎదురుచూడకుండా బయటకొచ్చేసాడు మోహన్. రామలక్ష్మి అతనితో పాటు బయటకొచ్చేసింది.
తనకి అంతటి ఇబ్బందికరమయిన పరిస్థితి కలిగించినందుకు బుచ్చిబాబుని తిట్టుకుంటూ నిల్చుంది సీహ్త.
"సారీ సీతగారూ! మిమల్ని ఇక్కడే నిలబెట్టినందుకు" సీతకు సారీ చెప్పాడు మోహన్.
"రామూ! సీతని లోపలికి తీస్కెళ్ళు"
"రండి సీతగారూ" సీతని ఆహ్వానించింది రామలక్ష్మి.
"నేనొస్తానండీ" సీతకి చెప్పి ఇంట్లోంచి బయటపడి హుషారుగా విజిలేసాడు మోహన్.
భోజనాలయ్యాక బ్రేవ్ మని తేనుస్తూ లేచారు పర్వతాలరావు పార్వతమ్మలు."
"ఏమో అనుకున్నాగానీ నువ్వు వంట భలేగా చేసావురా బుచ్చీ పాపం" అంది పార్వతమ్మ సంబరంగా.
"చేసాడులే వెధవ వంట. కూరలో ఉప్పు తక్కువ వేసాడు. చారులో ఉప్పు ఎక్కువేసాడు వెధవ" అన్నాడు పర్వతాలరావు.
"మీరసలు వాడినేప్పుడయినా మెచ్చుకున్నారా పాపం" పార్వతమ్మ భర్త వంక చికాకుగా చూసింది.
"మీరు ప్రయాణం చేసి బాగా అలసిపోయి ఉంటారు. కాసేపు పడుకోండి నాన్నా!" అన్నాడు బుచ్చిబాబు.
"నువ్వేంటోయ్ ఇంట్లోనే వుండిపోయావ్. ఆ వెధవాఫీసుకు వెళ్ళవా ఏంటి? ఈవేళ ఆఫీసుకు శలవా ఏంటి?" అడిగాడు పర్వతాలరావు.
"ఆఫీసుకు శలవేం లేదు నాన్నా, నేనే ఆఫీసుకు వెళ్ళడం లేదు. చాలా రోజులకి మిమ్మల్ని చూసాను కదా! రేపటి నుండి వెళతాను."
"అబ్బో! తల్లిదండ్రులంటే పెద్ద భక్తున్నట్టు పెద్ద వేషాలు."
"ఎందుకండీ వాడిని ఊర్కే ఆడిపోసుకుంటారు పాపం" అంది పార్వతమ్మ బాధగా.
"నాన్నగారి మాటలకేంగానీ మీరు రెస్ట్ తీస్కోండమ్మా... మీరా బెడ్ రూంలో పడుకోండి. నేనిక్కడ సోఫాలో నడుంవాలుస్తా" అన్నాడు బుచ్చిబాబు.
పర్వతాలరావు, పార్వతమ్మ బెడ్ రూంలోకి వెళ్ళారు.
బుచ్చిబాబు హాల్లో సోఫాలో నడుం వాల్చాడు.
అయిదు నిమిషాలు గడిచాయి.
అంతలో భయంకరమయిన గావు కేక!
"బాబోయ్!"
అది పార్వతమ్మ పెట్టిన గావుకేక.
ఆ కేకకి బుచ్చిబాబు గుండెలవిసిపోయాయి.
|