TeluguOne Services
Copyright © 2000 -
2025
, TeluguOne - Comedy - All rights reserved.
సిల్లీఫెలో - 99
- మల్లిక్
"నువ్వు ఇక్కడి నుండి వెంటనే వెళ్ళిపోవాలి."
సీత చేతిలోని గరిట జారి నేలమీద ఠంగున శబ్దం చేస్తూ పడింది.
"నేను వెళ్ళిపోవాలా? ఎక్కడికి?" అయోమయంగా చూసింది.
"ఒరేయ్ వెధవాయ్... తలుపులు తియ్యరా సన్నాసెదవా"
బయట నుండి తలుపులు దబదబ బాదేస్తున్నాడు పర్వతాలరావు.
"బాబోయ్! మా నాన్న తలుపులు విరగొట్టుకుని లోపలికి వచ్చేసేలా వున్నాడు" గాభరాగా అన్నాడు బుచ్చిబాబు.
"ఉండు, నేను వెళ్ళి తలుపులు తీస్తాను" సీత వెళ్ళబోయింది.
"అమ్మో... వద్దు సీతా" అన్నాడు.
"ఈ విప్లవ మార్గంలో వెళ్ళడానికి నీకు ధైర్యం లేనప్పుడు బుద్ధిగా పెళ్ళిచేసుకో. ఉండు, మీ అమ్మానాన్నతో జరిగిందంతా చెప్పేస్తాను."
సీతా సీతా సీతా.. ప్లీజ్! కాస్త ఓపికపట్టు. హఠాత్తుగా నువ్వీ విషయం చెపితే మానాన్న గుండాగిపోతుంది. అసలే ఆయన హార్టుపేషెంట్. కావాలంటే మొన్న నువ్వు నవీన్ కి చెప్పావ్ గా. అలా ఇక్కడున్న అందరికీ మన విషయం గురించే చెప్పెయ్. మా అమ్మానాన్నలకు మాత్రం ఈ విషయాన్ని మాత్రం సమయం చూసి చెప్తాను" బ్రతిమలాడుతూ దీనంగా అన్నాడు బుచ్చిబాబు.
"ఒరేయ్ పింజారి వెధవా... తలుపులు తీస్తావా బద్దలుకొట్టనా?"
తలుపులు చెక్కలూగేలా బాదసాగాడు పర్వతాలరావు.
"హమ్మో.. సీతా ప్లీజ్! నువ్విక్కడినుండి తక్షణం వెళ్ళిపో.
"ఎక్కడికీ?"
"మా మోహన్ ఇంటికి" చెప్పాడు బుచ్చిబాబు.
"ఛీ... అతనా? అతనంటే నాకష్టంలేదు" మొహం చిట్లించింది సీత.
"అలాగంటే ఎలా? మోహన్ చెడ్డాడేంకాదు. అయినా ఇక్కడ నాకు తెలిసిన వాళ్ళు వేరే ఎవరూ లేరు."
"కానీ అతనితో ఏం చెప్పాలి?" ఆలోచిస్తూ అంది సీత.
ఒరేయ్ దగుల్బాజీ వెధవా... తలుపులు తీస్తావా లేదా?"
పర్వతాలరావు దెబ్బకి తలుపు చెక్కలు కదిలిపోయాయి.
|