TeluguOne Services
Copyright © 2000 -
2025
, TeluguOne - Comedy - All rights reserved.
సిల్లీఫెలో - 98
- మల్లిక్
బుచ్చిబాబు హుషారుగా విజిలేస్కుంటూ లేచాడు. అతనికి ఈ మధ్య హుషారుగానే ఉంది. సీతకి సంబంధించిన ప్రాబ్లెం సాల్వ్ అయిపోయి నట్టుగానే వుంది మరి! ఇహ లైఫ్ మొత్తం సాఫీగా, హాయిగా ప్రేమమయంగా సాగిపోవడమే!
విజిలేస్కుంటూ వీధి తలుపు గడియతీసిన బుచ్చిబాబు ఎదురుగా వాళ్ళని చూసి కెవ్వుమని అరిచాడు. ఎదురుగా సూట్ కేస్ తో అతని తల్లిదండ్రులు పార్వతమ్మ పర్వతాలరావులు నిలబడి వున్నారు.
పర్వతాలరావు, పార్వతమ్మ బిత్తరపోయి బుచ్చిబాబు వంక చూసారు.
రెండు క్షణాల తరువాత పర్వతాలరావు తేరుకుని బుచ్చిబాబుని ప్రశ్నించాడు.
"అదేంట్రా వెధవాయ్! మమల్ని చూడగానే అంత ఘోరంగా అరిచావ్. మమల్ని చూస్తే ఏ దయ్యాన్నో భూతాన్నో చూసినట్లుగా వుందా నీకు?"
"వాటిని చూసినా అలా అరిచుండేవాడిని కాదు. ఈ టైం అలాంటిది" నసిగాడు బుచ్చిబాబు.
"ఏంటో వెధవ... ఏదీ స్పష్టంగా మాట్లాడ్డు. సరే... గుమ్మానికి అడ్డంగా గెడకర్రలా నిల్చుండిపోయావ్. మమ్మల్ని లోపలికి రానియ్యవా ఏంటి?" బుచ్చిబాబుని తోస్కుని లోపలికి రాబోయాడు పర్వతాలరావు.
"కెవ్ వ్ వ్..."
మరోసారి భయంకరంగా అరిచి వాళ్ళమొహం మీద తలుపేసేసి గడియపెట్టి వంటగదిలోకి పరుగు తీసాడు బుచ్చిబాబు.
"ఏంటలా అరుస్తున్నావు. ఎవరొచ్చారు?" అడిగింది సీత.
"కొంపలు మునిగిపోయాయ్" ఆయాసపడుతూ అన్నాడు బుచ్చిబాబు.
"నాన్చకుండా విషయం సరిగ్గా చెప్పు" విసుక్కుంటూ అంది సీత.
"మా అమ్మా నాన్నా వచ్చారు" పాలిపోయిన మొహంతో చెప్పాడు బుచ్చిబాబు.
"హమ్మయ్య! ఈ చాప్టర్ కి ఇక్కడితో తెరపడుతుందన్న మాట. రానీయండి, రానీయండి. కొడుకు లీలలు కళ్ళారా చూసి ఆనందిస్తారు. అవునుగానీ వాళ్ళేరీ... లోపలికి రాలేదా?"
"లేదు.. వాళ్ళని బయటే వుంచి గడియపెట్టేశా!"
"ఎందుకూ?" ఆశ్చర్యంగా అంది సీత.
"ఎందుకేంటి? నినిక్కడ చూస్తే మా నాన్న అగ్గిరాముడై పోతాడు" కంగారుపడుతూ అన్నాడు.
"అయితే నన్నిప్పుడు ఏం చెయ్యమంటావ్?"
|