సిల్లీ ఫెలో - 97

 

Get latest Mallik telugu famous comedy serials, Mallik Telugu Comedy Serial Silly Fellow,  Mallik telugu serial comics and latest jokes online

 

సిల్లీఫెలో - 97

 

- మల్లిక్

 

బుచ్చిబాబు ఆవులించుకుంటూ నిద్రలేచి గోడ గడియారం వంక చూశాడు.

టైం ఎనిమిది అయింది.

"బాబోయ్" గట్టిగా అరిచి మంచం మీంచి కిందికి దూకాడు.

కాఫీ త్రాగాలి? ఎప్పుడు వంట చెయ్యాలి? ఎప్పుడు స్నానం చెయ్యాలి? ఎప్పుడు భోజనం చెయ్యాలి? ఎప్పుడు తయారై ఆఫీసుకెళ్ళాలి? అంత బండగా నిద్రపోయినందుకు బుచ్చిబాబు తనని తాను పచ్చిబూతులు తిట్టుకున్నాడు. నేను నిద్రపోతే పోయాను. సీతయినా నిద్రలేపొచ్చుగా? ఛా ఛా. మోస్ట్ ఇర్రెస్పాన్స్ బుల్ పర్సన్! అని తిట్టుకుంటూ గూట్లోని పేస్టూ బ్రష్షు అందుకున్నాడు.

ఎక్కడా అలికిడి లేదు. సీత ఎక్కడుంది?

పళ్ళు తోముకుంటూ హాల్లోకి వెళ్ళాడు. సీత అక్కడ లేదు. అక్కడినుండి వంట గదిలోకి వెళ్ళాడు. సీత అక్కడుంది బిజీగా వంట చేసేస్తూ.

ఆ సీన్ చూసి బుచ్చిబాబు సంతోషంతో గట్టిగా కేకెయ్యాలనిపించింది కాని నోటినిండా పేస్టు నురగ ఉండడంతో ఆ ప్రయత్నం మానుకున్నాడు.

గబగబా పళ్ళు తోముకుని వంట గదిలోకి వెళ్ళాడు.

"థాంక్యూ సీతా... ఇంత ఆలస్యంగా లేచాను. ఇప్పుడు వంటెలా చెయ్యాలి, ఆఫీసుకు కెప్పుడెల్లాలి? అని కంగారుపడుతున్నా అన్నాడు సీత బుగ్గమీద ముద్దు పెట్టుకుంటూ.

"కూర్చో. కాఫీ ఇస్తా!" అంది సీత.

బుచ్చిబాబు పీట వేసుకుని కూర్చున్నాడు. సీత కాఫీ కాచి కప్పులో పోసి అతని కందించింది.

"నీకో?" అన్నాడు బుచ్చిబాబు.

"నేను ఇందాక తాగేశాను. నేనేం నీ పెళ్ళాన్ని కాదుగా నువ్వు వచ్చేదాకా ఆగడానికి?" నవ్వుతూ అంది సీత.

పెళ్ళాం కాకపోతేనేం... నా మీద చచ్చేంత ప్రేమ ఏర్పడిందిగా... అందుకే పాపం నాకెక్కడ ఆలస్యం అయిపోతుందో ... నేనెక్కడ ఇబ్బంది పడిపోతానో అని నేను లేచేదాకా ఆగకుండా గబగబా వంట చేసేస్తున్నావ్. ఎలాగయినా ఈ మధ్య నీకు నేనంటే ప్రేమ ఎక్కువై పోయిందిలే" చిలిపిగా అన్నాడు బుచ్చిబాబు.

"అదేం కాదులే... ఈ రోజునుండీ వంట డ్యూటీ నాది!" నిర్లిప్తంగా అంది సీత.

"ఆ!" నోరు తెరిచాడు బుచ్చిబాబు.

"సరే.. సరే తెరిచింది చాలు! ఆ నోరు కాస్త మూసి త్వరగా త్రాగు... చల్లారిపోతుంది"

బుచ్చిబాబు కాఫీ కప్పు నేలమీద పెట్టాడో లేదో డోర్ బెల్ మోగింది.

"ఎవరొచ్చారో చూడు" అంది సీత.