TeluguOne Services
Copyright © 2000 -
2025
, TeluguOne - Comedy - All rights reserved.
సిల్లీఫెలో - 93
- మల్లిక్
బుచ్చిబాబు తెచ్చిన ఫైల్స్ చూసి "వెరీగుడ్! నువ్వింక వెళ్ళొచ్చయ్యా బుచ్చిబాబూ ! సరేగానీ నువ్వు మరీ అతిగా కష్టపడిపోకు. ఈ ఆఫీసులో కిల్లారి కిత్తిగాళ్ళు ఇంకా చాలామంచి ఉన్నారుగా! వాళ్ళకి నీ పని కూడా నేను అప్పగిస్తాలే" అన్నాడు ఏకాంబరం.
"అలాగే సార్" బుచ్చిగా తల ఊపాడు బుచ్చిబాబు.
"నేనింక వెళ్ళనా సార్?"
వెళ్ళమనే కదా చెప్పా! అవునయ్యోవ్, ఓ ముఖ్యమైన విషయం మర్చి పోయా... నీకు తెలిసిన మంచి క్యాండిడేట్ ఎవరయినా వున్నారా?"
"దేనికి సార్?"
"వేరే సెక్షన్స్ లో కాస్త స్టాఫ్ అవసరం పడింది. టెంపరరీగా రిక్రూట్ చేస్కుందామనీ..."
"ఉన్నారు సార్..." చటుక్కున అనేశాడు బుచ్చిబాబు సీతని దృష్టిలో వుంచుకుని.
సీత ఉదయం ఇలా అడిగేసరికి సాయంత్రం ఉద్యోగం అలా కాళ్ళ దగ్గరకికి వచ్చేసరికి బుచ్చిబాబు చాలా థ్రిల్లింగ్ గా ఫీలయ్యాడు.
"ఎవరూ...ఏంటీ కథ?" క్యాండిడేట్ కిల్లారి కిత్తి అయితే లాభం లేదు... మంచి డింగాలడిప్పి అయి వుండాలి!"
బుచ్చిబాబు అంతలోనే ఆలోచనలో పడిపోయాడు.
సీత గురించి చెప్తే ఆమె ఎవరూ? నీకేమవుతుందీ? అంటూ ప్రశ్నలేసి చంపుతాడు.
"ఏంటీ ఆలోచిస్తున్నావ్? క్యాండిడేట్ వచ్చి కిల్లారి కిత్తా?" అనుమానంగా చూస్తూ అడిగాడు ఏకాంబరం.
"కాద్సార్... మాంచి డింగాలడిప్పే!"
"మరెందుకు ఆలస్యం?
"అంటే... ఆ క్యాండిడేటేమో ప్రస్తుతం అండమాన్ దీవుల్లో వున్నాడు సార్"
"ఎందుకూ?"
"ఏమో సార్! సిల్లీగా అక్కడికెళ్ళి వున్నాడు సార్. పోనీ పిలిపిద్దామంటే వాడి అడ్రస్ కూడా నా దగ్గర లేద్సార్.
"ఓ..." బాధగా జుట్టు పీక్కున్నాడు ఏకాంబరం. "నువ్వు డింగాల దిప్పిలా కాకుండా డప్పాల డిప్పిలా మాట్లాడితే ఎలానోయ్? క్యాండిడేట్ వున్నాడా అంటే అందుబాటులో వున్న క్యాండిడేట్ గురించి చెప్పాలి గానీ ఎక్కడో అండమాన్ దీవుల్లో ఉన్నవాడి గురించి చెప్తే ఎలానోయ్... సర్లే... వేరే మంచి క్యాండిడేట్ వుంటే చెప్పు. నీ క్యాండిడేట్ కే ఉద్యోగం ఇచ్చేస్తా!"
"అలాగే సార్" అని క్యాబిన్ బయటికి వచ్చేసాడు.
అప్పుడు ఆఫీసు టైం కూడా అయిపోయింది. అప్పటికే సెక్షన్ లోని వాళ్ళంతా వెళ్ళిపోయారు. బుచ్చిబాబు కూడా టేబుల్ సొరుగు సర్దుకుని ఆఫీసు బయట కొచ్చేసాడు. బస్సుస్టాండు వైపు అడుగులు వేస్తుండగా అతని ప్రక్కన స్కూటర్ ఆగింది. బుచ్చిబాబు తల ప్రక్కకి తిప్పి చూశాడు.
నవీన్! పక్క సెక్షన్ లో వుంటాడు.
"హలో... బాగున్నారా?" చిరునవ్వుతో పలకరించాడు నవీన్.
"బాగానే వున్నాను. థాంక్యూ అన్నాడు బుచ్చిబాబు.
"ఎటు వెళ్తున్నారు?" అడిగాడు?" అడిగాడు నవీన్.
"లబ్బీపేట!" చెప్పాడు బుచ్చిబాబు.
"ఓ రండి... నేను కూడా ఆటే వెళ్తున్నా... మిమ్మల్ని డ్రాప్ చేస్తాను"
బుచ్చిబాబు స్కూటర్ వెనకాల కూర్చున్నాడు. నవీన్ స్కూటర్ ని ముందుకు పరిగెత్తించాడు.
అయిదు నిమిషాల్లో లబ్బీపేట వచ్చేసింది.
"ఇక్కడ ఆపండీ" అన్నాడు బుచ్చిబాబు.
"మీ ఇల్లు ఎక్కడ?" స్కూటర్ ఆపుతూ అడిగాడు నవీన్.
"ఇదిగో... ఈ సందులోంచి కాస్త ముందుకెళ్తే వస్తుంది"
"మరి ఇక్కడే ఆపమన్నారేం? ఇంటి దగ్గర ఆపుజేస్తాలెండి!"
బుచ్చిబాబు వద్దు వద్దని అంటున్నా నవీన్ స్కూటర్ ని సందులోకి తిప్పాడు.
|