TeluguOne Services
Copyright © 2000 -
, TeluguOne - Comedy - All rights reserved.
సిల్లీఫెలో - 46
- మల్లిక్
"లోపలికి రా బాబూ..." అని వెనక్కి తిరిగి లోపలికి అడుగులు వేసింది. బుచ్చిబాబు ఆమెను అనుసరించాడు.
హాల్లో మినిస్టర్ మిన్నారావ్ కూర్చుని వున్నాడు. వెంకటలక్ష్మి ఆయన కూర్చున్న సోఫా ప్రక్కన నిలబడింది.
బుచ్చిబాబుని చూస్తూనే మినిస్టర్ మిన్నారావు చెవులదాకా నవ్వాడు.
"ఆ.... రావోయ్ రా! నీ ట్రాన్స్ ఫర్ కాన్సిల్ అయిందిగా, హ్యాప్పీనా?" కులాసాగా కాళ్ళూగిస్తూ అడిగాడు.
"లేదండీ" మెల్లగా అన్నాడు బుచ్చిబాబు.
"అదేంటి. నీ ట్రాన్స్ ఫర్ ఆగిపోయిందిగా?" ఆశ్చర్యంగా అడిగాడు మినిస్టర్ మిన్నారావు.
"అంటే చిన్న ప్రాబ్లెం వచ్చిందండీ"
"ఏంటో త్వరగా చెప్పు.... ఇప్పుడు నేను చికెన్ సెంటర్ ఓపెనింగ్ చెయ్యడానికి వెళ్ళాలి" చేతి వాచ్ వంక చూస్తూ అన్నాడు మినిస్టర్ మిన్నారావు.
"నేను విజయవాడకి వెళ్ళడానికి ఇష్టంలేక ట్రాన్స్ ఫర్ కాన్సిల్ చేస్కున్నాను కదండీ. కాని ఇప్పుడు ఎందుకులే... విజయవాడకే పోదాంలే అనుకుంటున్నానండీ. మా బాస్ ని అడిగితే అది హెడ్డాఫీసువాళ్ళ ఇష్టం! నీకు మళ్ళీ ఆర్డర్ వెయ్యాలన్నా వాళ్ళే వెయ్యాలని అన్నాడండి! అందుకని మీ హెల్ప్ తీసుకుందామని వచ్చానండీ" అన్నాడు బుచ్చిబాబు.
మినిస్టర్ మిన్నారావు కళ్ళు ఇంతింతచేసి బుచ్చిబాబు వంక చూశాడు.
"అంటే ఏమిటి నీ ఉద్దేశ్యం? నీ కళ్ళకి మినిస్టర్ లంటే పనీపాటా లేని బేవర్స్ గాళ్ళలా కనిపిస్తున్నారా?" సీరియస్ గా అడిగాడు.
"అందుకేగా ఓ పండూ కాయా ఏటీ లేకుండా సేతు లూగించుకుంటూ వచ్చాడు" మూతి తిప్పుతూ అంది వెంకటలక్ష్మి.
"అంతా నీ ఇష్టమేనా? నువ్వు వెళ్ళను అంటే నీ ఆర్డర్ కాన్సిల్ చేయించేయాలా? మళ్ళీ వెళ్తానంటే నీకు ఆర్డర్స్ వేయించాలా... ఇలా ఒక పనినే పదిసార్లు చేస్తే మిగతా పనులు ఎలా అవుతాయ్?"
"అసలే ఆయనకి ప్రతిరోజు చికెన్ సెంటరూ, కిళ్ళీషాపు ఓపెనింగ్ లు లాంటివి వుంటాయ్"దీర్ఘాలు తీస్తూ అంది వెంకటలక్ష్మి.
బుచ్చిబాబు బిత్తరపోయాడు. మినిస్టర్ మిన్నారావు అలా మాట్లాడతాడు అనుకోలేదు.
ఛ... ఛ.... వెంకట్రావు ఊర్నుండి వచ్చేదాకా ఆగి వాడితో కలిసి రావాల్సింది అనుకున్నాడు.
"ఇంక వెళ్ళుబాబు" అన్నాడు మినిస్టర్ మిన్నారావు.
"అంటే నేను సరదాకీ సిల్లీగా చెయ్యడం లేదండీ. నాకు కొన్ని ఫామిలీ ప్రాబ్లెమ్స్ వచ్చీ..." బుచ్చిబాబు ఏదో చెప్పబోయాడు.
"ఒకసారి కుదరదని చెప్పాక కుదరదు. ఇంకా అడుగుతావేం? అసలే నాకు చికెన్ సెంటర్ ఓపెన్ చేసే టైం అయింది" అంటూ వాచ్ వంక చూసి" అమ్మో... టైమయిపోయింది. అని సోఫాలోంచి గబుక్కున లేచి నిలబడ్డాడు.
"అవునే లక్ష్మీ... ఈ సెక్రటరీగాడు ఇంకా రాలేదే? డ్రైవర్ ని కారు తీసి ఉంచమను" అని హడావిడిగా భార్యకు ఇన్ స్ట్రక్షన్స్ ఇచ్చి బుచ్చిబాబు వంక విసుగ్గా చూసి "నువ్వింక వెళ్ళు అన్నాడు.
బుచ్చిబాబు మనసు చివుక్కుమంది. తన భవిష్యత్తేంటి? ఇప్పుడా ట్రాన్స్ ఫర్ కాకపోతే ఉన్నచోటే తెలిసిన వాళ్ళ మధ్య పెళ్ళి గిళ్ళీ ఏమీ లేకుండా సీతతో కాపురం పెట్టలేడుగా మరి?
బుచ్చిబాబు భారంగా నిట్టూర్చి వెనక్కి తిరిగాడు.
* * *
|