TeluguOne Services
Copyright © 2000 -
2025
, TeluguOne - Comedy - All rights reserved.
సిల్లీఫెలో - 13
- మల్లిక్
"నువ్వు ముందే చెప్పొద్దూ! మీ నాన్నగారు వింటే ఎంత డేంజర్ అయ్యుండేది?" బుచ్చిబాబు మీద విసుక్కుంది.
"నాకేం తెల్సు... నువ్వింత సిల్లీగా ఘోరమైన పాట పాడ్తావని?" నెత్తి కొట్టుకున్నాడు బుచ్చిబాబు.
"సరే అలగైతే. ముత్యమంత పసుపు ముఖమెంత ఛాయ, ముత్తయిదు కుంకుమా బ్రతుకంత ఛాయా పాడ్నా!?"
"వెరీ గుడ్... అది కానియ్!" అంటూ లోపలికి పరుగుతీశాడు బుచ్చిబాబు.
సీత "ముత్యమంతా పసుపు"అంటూ పాటేత్తుకొని ముగ్గెట్టడం మొదలు పెట్టింది.
పల్లవి పుర్తయిందో లేదో లోపలినుండి పర్వతాలరావు గావు కేక పెట్టాడు.
"ఒరేయ్. తెల్లారే ఆ వెధవ టేప్ రికార్డర్ పెట్టవెంట్రా సోంబేరి వెధవా... ముందు దాన్ని కట్టెయ్"
బుచ్చిబాబు పరుగున బెడ్ రూంలోకి వెళ్ళి "అది టేప్ రికార్డర్ కాదు నాన్నా..." అన్నాడు ముసిముసిగా నవ్వుతూ.
"కాకపొతే మరెంట్ర?" అడిగింది పార్వతమ్మ నిద్ర కళ్ళేసుకుని ఆవలిస్తూ.
"మీరే ఒకసారి బయటకొచ్చి చూడండి" అన్నాడు బుచ్చిబాబు సంబరంగా.
వరండాలోకి వచ్చి వాకిట్లో తలంటుకుని పెద్దబొట్టు పెట్టుకుని పాట పాడుతూ ముగ్గుపెడుతున్న సీతని చూసిన పర్వతాలరావు, పార్వతమ్మ అలానే నోరు తెరుచుకొని చూస్తూ నిలబడిపోయారు.
వాళ్ళు అలా నోరు తెరుచుకొని అశ్చర్యంలో మునిగుండగానే సీత ముగ్గుపెట్టం పూర్తిచేసి దేవుళ్ళకి పూజ కూడా చేసేసి హారతి పళ్ళెం వాళ్ళిద్దరి దగ్గరికీ తెచ్చింది.
"హారతి తీస్కోండి" అంది సీత.
వాళ్ళిద్దరూ ఈ లోకంలోకి వచ్చి కంగారు కంగారూగా హారతిని కళ్ళకద్దుకున్నారు.
సీత ఇద్దరి చేతిలో ప్రసాదం పెట్టింది. ఇద్దరూ గబుక్కున ప్రసాదం నోట్లో వేసుకొని తర్వాత పళ్ళు తోముకోలేదని గుర్తొచ్చి నాలుక కొరుక్కున్నారు.
"ఒరేయ్ బుచ్చీ! సీత నాకు నచ్చిందిరా" అన్నాడు పర్వతాలరావు మెరిసే కళ్ళతో బుచ్చిబాబు వంక చూస్తూ.
"యాహూ!"
గుండెలు బద్దలయ్యేలా కేకపెట్టాడు బుచ్చిబాబు.
బుచ్చిబాబు మేనేజర్ ఏకాంబరం క్యాబిన్ లోకి వెళ్ళాడు. అతని చేతిలో స్వీట్స్ బాక్స్ వుంది.
"రావోయ్ రా... ఏంటి చేతిలో స్వీట్స్ బాక్స్ వున్నట్టుందే? ఏంటి విశేషం?"
అన్నాడు బుచ్చిబాబు వంక చూసి కళ్ళేగురేస్తూ ఏకాంబరం.
"అంటే... అదీ... మరీ" కాస్త మెలికలు తిరిగి ఆ తర్వాత స్వీట్స్ బాక్స్ ముందు పెడ్తూ "నా పెళ్ళి కుదిరిందండీ" అన్నాడు బుచ్చిబాబు.
"హోరి.. అలాగాటోయ్?" ఏకాంబరం బాక్స్ లోంచి ఓ స్వీట్ తీస్కున్నాడు.
నువ్వొట్టి టింగారి టింబివోయ్!"
"ఏంటిసార్... పెళ్ళి చేస్కుంటన్నందుకు నన్ను పొగడ్తున్నారా సార్?" సంబరంగా అడిగాడు బుచ్చిబాబు.
"కాదు తిడ్తున్నాను. టింగారి టింబి అంటే తెలివితక్కువ సన్నాసి అని అర్థం!"
ఏకాంబరం స్వీట్ ముక్క కొరికాడు.
"అదేంటి సార్?" అలా అనేసారు?" బుచ్చిబాబు అయోమయంగా మొహం పెట్టాడు.
|