Maa Aavidaku Pathi Dorikaadu

మా ఆవిడకి పతి దొరికాడు

పొత్తూరి విజయలక్ష్మి

పొద్దున పదిగంటలు అయింది.ఆనందరావు నెత్తిన చేతులు పెట్టుకుని కూర్చున్నాడు.ఇంట్లో వాతావరణం అంతా అస్తవ్యస్తంగా వుంది.అవతల ఆఫీసు టైమయిపోతోంది.

ఇంకా టిఫిన్ రెడీ కాలేదు.పిల్లల స్కూల్ బస్ మిస్ అయింది. టిఫినుదేముంది ?బయట ఎక్కడైనా తినొచ్చు.కానీ అలా వెళ్ళిపోతే రామకి కోపం వస్తుంది.అసలే అగ్గిబుగ్గి అయిపోతోంది.ఇంకా రెచ్చగొడితే ఏదైనా అఘాయిత్యం చేస్తుందేమోనని భయం.ఎంతసేపు కూర్చున్నా వంటింట్లోంచి వూడిపడదు.

కాసేపు నీళ్ళు నమిలి వెలిగా వంటింటివైపు వెళ్లాడు ఆనందరావు. పొయ్యి మీద వుంచిన పదార్ధం మాడిపోతున్నా పట్టించుకోకుండా దిగులుగా నిలబడి వుంది రమ. స్టౌవ్ ఆపేసి భార్య భుజం మీద చెయ్యి వేశాడు ఆనందరావు. పతీ అంటూ భ్రున ఏడిచింది రమ.

“ఏడవకు ఏడవకు..నేను ప్రయత్నం చేస్తున్నాను కదా!” అని ఓదార్చాలని విఫల ప్రయత్నం చేశాడు ఆనందరావు. “చేసేదంతా చేసి ఇప్పుడు ఏం ప్రయత్నం చేస్తే ఏం లాభం ?”వుక్రోషంగా సమాధానం చెప్పి మళ్ళీ పతీ అంటూ ఏడుపు ప్రారంభించింది రమ.

మరోసారి తల బాదుకుని బయటికి వచ్చాడు ఆనందరావు. అప్పుడే మెడ దిగి కిందికి వచ్చాడు బాబాయ్.

“ఒరే ఆనందా..ఇంకా టిఫిన్ రెడీ కాలేదా ?”అన్నాడు. పళ్ళు కొరుకున్నాడు ఆనందరావు.

ఇంతలో వాకిట్లోంచి వచ్చింది రాజ్యం అత్తయ్య.ఆవిడ చేతిలో నవనవలాడుతున్న సొరకాయ వుంది. “ ఒరే ఆనందా...ఇవాళెందుకో మీ మామయ్య తెగ గుర్తొస్తున్నార్రా!ఆయనకీ సొరకాయ అవబెట్టిన కూరంటే చచ్చేంత ఇష్టం.పతిగాడెక్కడున్నాడో కాస్త తొందరగా చూడ్రా.వాడయితే బాగా చేస్తాడు కూర "అంది ఆదరంగా. కడుపులోంచి దుఃఖం తన్నుకొచ్చింది ఆనందరావుకి. చేతుల్లో మొహం దాచుకుని కుళ్లికుళ్లి ఏడవసాగాడు.వంటింట్లోంచి వచ్చిన రమ, భర్త పక్కేనే కూర్చుని పతీ అంటూ ఏడవసాగింది.

***

రమాపతికి ఇరవై ఏళ్ళుంటాయి.మెరికలాంటి వాడు.నమ్మకస్తుడు. రమ ఫ్రెండ్ ఇంట్లో రెండేళ్లుగా పని చేస్తున్నాడు.ఆవిడ అమెరికాకు వెళ్ళిపోతూ రమ దగ్గరకు పంపించింది.అతని గురించి ఫోన్ లో గొప్పగా చెప్తుంటే "ఎందుకు లేవే!”అంది రమనిరాసక్తిగా. "అలాకాదు నలుగురు వచ్చిపోయే ఇంట్లో ఎంత కష్టంగా ఉంటుందో నాకు తెలీదా.పైగా నీకేం తక్కువ?బోలెడంత ఆస్తి...హాయిగా కాలు మీద కాలేసుకుని ఎన్ జాయ్ చెయ్యక.. ఎందుకొచ్చిన హైరానా నీకు..?”అంది రమ.

మరికాసేపటికే వచ్చాడు రమాపతి. రమ అతడిని చూడగానే "పని వచ్చా?నమ్మకంగా చేస్తావా!?”ఐ అడగలేదు. “హీరోలా వున్నావ్.నీకెందుకీ పనులు.సినిమాల్లోకో,కనీసం టి.వి.ల్లోకి వెళ్లక పోయావా"అంది. సిగ్గుగా నవ్వేశాడు రమాపతి.

“పొండి అమ్మగారూ"అంటూ. ఇంటి పరిస్థితులని వివరించి చెప్పింది రమ. అన్నింటికీ తలాడించాడు రమాపతి.అన్నీ విని కైకేయిలా తను కూడా మూడు వరాలు అడిగాడు. మొదటిది జీతం మరో రెండొందలు ఎక్కువ ఇవ్వాలి.రెండవది ఇంట్లో పాచిపనికి తన మేనత్తని పెట్టాలి.మూడవది నెలకి రెండు రోజులు శెలవు కావాలి. అన్నింటికీ సరే అంది రమ. సోమవారం నుండి పనికి వస్తానని చెప్పివెళ్ళాడు.సోమవారం తెల్లారేసరికల్లా మేనత్తని వెంటబెట్టుకుని వచ్చాడు. ఇద్దరూ కలిసి ఇంటిని హేండోవరు చేసుకున్నారు.పొద్దున్న పదిగంటలు అయ్యేసరికి ఇంటి స్వరూపం మారిపోయింది.అద్దంలా వున్న ఇంటిని చూసి రమ భర్త ఆనందరావు మురిసిపోయాడు.

ఇంటి పనులు,బజారు పనులు సమాస్తం చెయ్యడమే కాకుండా బాబాయ్ నీ,అత్తయ్యనీ కూడా చాలా చక్కగా హేండిల్ చేస్తాడు. “పెద్దయ్యగారూ!మధ్యాహ్నం మాయాబజార్ చూసేటప్పుడు నన్నూ పిలవండి "అని ఆయనని సంతోష పెడుతాడు.

“పెద్దమ్మగారూ!లేత చింతకాయలు తెచ్చాను.మీ వారికిష్టంట కదా.పచ్చడి చేస్తా.తినండి. ఆయనకీ అర్థభాగం తృప్తిగా ఉంటుంది" అంటాడు రాజ్యం అత్తయ్యతో. వారం రోజులు తిరిగేసరికి రమాపతి లేకుండా అసలు ఇన్నాళ్ళూ ఎలా ఉన్నాం అనుకున్నారు రమా, ఆనందరావు.అయితే అతని పేరుతోనే కాస్త చిక్కు వచ్చింది.

పనిలోచేరిన కొత్తలో'రమాపతి...రమాపతీ...'ఐ పిలవడం మొదలు పెట్టింది రమ.కానీ అప్పటిదాకా కూనిరాగాలు తీస్తూ పని చేస్తున్న వాడు సీరియస్ కావడంతో తెల్లబోయింది. విషయమేమిటని అతని మేనత్త అడిగారు.రమ,ఆనందరావు. “అమ్మగారూ!మీకోమాట చెప్పాలి.మావాడికి తన పేరంటే చాలా చిరాకు వాళ్ళమ్మకి ఆడపిల్లలంటే ముద్దు.అందరూ కొడుకులే.వీడే కడసారివాడు.అందుకే ఆరేళ్ళువచ్చేదాకా జుట్టు పెంచి,జడవేసి,పరికిణీలు కత్తి ఆడపిల్లలా పెంచింది.

ఆ వేషం చూసి,ఆడపిల్లలందరూ ఏడిపించేవారు.కాస్త పెద్దవగానే క్రాపు చేయించేసుకున్నాడు. అయినా తన పేరులో ఆడతనం మిగిలిపోయిందని బాధ.పూర్తిపేరు పెట్టి పిలిస్తే వాడికి చిర్రెత్తుకొచ్చింది "అని చెప్పింది అతని మేనత్త అడిగింది. “మరైతే..'రమా!'అని పిలవ మంటావా?”అన్నాడు ఆనందరావు చికాగ్గా.

“రామ రామ...!అలా రమా ఐ పిలిస్తే పనొదిలి పోతాడు "అంది మేనత్త. ఆ దంపతుల గుండె రామంది.

“మరైతే ఏం చెయ్యమంటావు ?”అన్నారు ముక్తకంఠంతో.

“పతీ అని పిలవండి "అంది. నెల రోజులు గడిచాయి.పిల్లలూ పెద్దలూ అందరూ రమాపతి పనిపట్ల ముగ్దులైపోయారు.అన్ని పనులూ అతనికి అప్పచెప్పి నిశ్చింతగా వుండటం మొదలు పెట్టారు. ఓ రోజు ఆనందరావు బంధువులు భోజనానికి వచ్చారు.

“అంతా బాగానే వుంది బావగారూ.ఆ పనివాడిని మా అక్క పతీ పతీ అని పిలవడం,మీరేమో మా రమాపతి అని మురిసిపోవడం నాకు నచ్చలేదు సుమండీ మా అక్క రమ.వాడు రమాపతి!మరి మీరెవరు!” అన్నాడు ఆ గుంపులోని బావమరిది వరసైన ఓ ప్రబుద్దుడు.

ఆనందరావు మనసు చివుక్కుమంది.పైకి నవ్వేసి వూరుకున్నాడు. మరికొద్దిరోజులకే ఎవరో ఫ్రెండ్స్ వస్తే వాకిట్లోని వరండాలో కూర్చుని మాట్లాడుతున్నాడు ఆనందరావు. లోపలి నుంచి "పతీ పతీ "అని అరిచింది రమ. “మీ మిసెస్ పిలుస్తున్నారు "అన్నారు వాళ్ళు. “అబ్బే నన్ను కాదండీ.మా పనివాడిని.” చెప్పాడు ఆనందరావు.

“ఏమిటీ మీ ఆవిడ...పనివాడిని పతీ అంటుందా...?మరి మిమ్ముల్ని ఏమంటుంది ?”అంటూ భళ్ళున నవ్వేశారు. ఈ సారి కాస్త సీరియస్ గానే రియాక్ట్ అయ్యాడు ఆనందరావు.ఆ రాత్రి రమతో చర్చించాడు. “చాల్లెండి మీదంతా విచిత్రం.వాగేవాళ్ళు ఏదో వాగుతూనే వుంటారు "అనేసింది రమ.

“అలా కాదు రమా!వాళ్ళన్న దాంట్లో పాయింటు లేకపోలేదు "అన్నాడు ఆనందరావు. “మరైతే పర్యవసానం ఆలోచించండి "అనేసి పడుకుని నిద్రపోయింది రమ. ఆనందరావుకి మాత్రం నిద్ర పట్టలేదు. "రమాపతిని ఎలా పిలివాలి, రమా అంటే వాడిక్కోపం, పతీ అంటే బాగోలేదు.మరెలా...మర... రవ...మావ...వర...మతి..” అనుకుంటూ ఎన్నో కాంబినేషన్లు ప్రయత్నించి చూశాడు.ఏదీ కుదర్లేదు. తెల్లారాకా రమాపతిని పిలిచి "పతీ నిన్ను ముద్దుగా చిన్నా అని పిలవమంటావా ?” అని అడిగాడు ఆనందరావు.

“ఎద్దులా వున్నాను నేను చిన్నాని ఏమిటండీ "అన్నాడు పతీ. “పోనీ...అబ్బాయ్ అని పిలవమంటావా ?”అన్నాడు ఆనందరావు. “అబ్బాయిని కాక అమ్మాయినా?అయ్యగారూ నన్నేమైనా అనండి.నాపేరునడ్డం పెట్టుకుని ఏడిపిస్తే నేనూరుకోను.అంతగా మీ కిష్టం లేకపోతే చెప్పండి నేను పనొదిలేసి పోతాను " అన్నాడతను సీరియస్ గా.

“అమ్మమ్మ వద్దులే "అన్నాడు ఆనందరావు. ఏదైనా ఇబ్బంది అనిపించనే కూడదు.ఒకసారి అలా అనిపించడం మొదలు పెడితే అతి చిన్న సమస్య కూడా భూతంలా కనిపిస్తుంది.ఆనందరావు పనీ అలాగే వుంది. ఎవరి ఎదటైనా అతన్ని రమ "పతీ"అన్నప్పుడల్లా ఇతని మనస్సు కలుక్కుమంటూనే వుండేది. ఒకసారి ఆనందరావు ఆఫీసు వాళ్లందరూ పిక్నిక్ ప్రోగ్రాం వేశారు.కార్తికమాసం కూడా కలిసివచ్చింది.

“పిల్లలను చూసుకుంటాడు.వాళ్ళు నా మాట వినరు.నేను పెడితే తినరు "అంటూ రమాపతిని కూడా ప్రయాణం చేయించింది రమ. వాడు వెంటరావడం ఇష్టంలేకపోయినా రమ వినదు కాబట్టి ఊరుకున్నాడు ఆనందరావు.

అందరూ వచ్చారు.వన భోజనాల ఏర్పాట్లు కూడా బ్రహ్మాండంగా వున్నాయి.పెద్దవాళ్ళూ పిల్లలైపోయారు.ఆనందరావు పేకాడుతున్నాడు.మరోవైపు గేమ్స్ జరుగుతున్నాయి. మ్యూజికల్ చైర్స్ వగైరాలు అయ్యాయి.మరో గేమ్ ప్రారంభం అయింది.వచ్చిన వాళ్ళందరి పేర్లూ ఓ డబ్బాలో వేసి ఒక్కోటి తీసి వారిని పిలిచి ఆటలు ఆడిస్తున్నారు.ముచ్చటగా మూడో పేరు రమ చీటీ వచ్చింది.

“ మీరు మీ శ్రీవారితో కలిసి మాంచి రొమాంటిక్ డ్యూయెట్కి డ్యాన్స్ చేయాలి అని వుంది. అంతా గొల్లున నవ్వేశారు.నేను రాను నేను రాను అని మొహమాట పడుతున్న రమని ముందుకీ నెడుతున్నారు ఫ్రెండ్స్. ప్రోగ్రాం కండక్ట్ చేస్తున్నాయన "లాభం లేదు రమగారు రావాలి.రమాపతిగారు కూడా ఎక్కడున్నా స్టేజి మీదకు రావాలి "అన్నాడు మైకులో.

సిగ్గుపడుతూ వెళ్ళింది రమ. ఆనందరావు పక్కవాళ్లకి తన ముక్కలు అప్పజెప్పి వెళ్లబోయేలోగానే "రమగారు వచ్చేశారు.ఇక రమాపతిగారు రావాలి"అనే ఎనౌన్స్ మెంట్ వినిపించడం,వెంటనే ఆదరాబాదరాగా పిల్లలకి అన్నం తినిపిస్తున్న రమాపతి స్టేజి మీదకి వెళ్లడం క్షణంలోనే జరిగిపోయాయ.

ఒక్క క్షణం అందరూ తెల్లబోయారు.మరుక్షణం అంతా ఘోల్లున నవ్వేశారు.గోలగోల చేశారు. రమ గతుక్కుమని వెంటనే సర్దుకుంది. ''పతీ పిలిచింది నిన్నుకాదు.అయ్యగారిని'' అంది నవ్వేస్తూ. ఆనందరావు మాత్రం అంత తేలిగ్గా తీసుకోలేదు.సాయంత్రందాకా ఫ్రెండ్స్ ఏడిపిస్తూ వుంటే లోలోపలే ఉడికిపోయాడు.

ఇంటికి రాగానే రమాపతి మీద వంటికాలిమీద లేచాడు.రమాపతి ఏదో చెప్పబోతుంటే కొట్టినంత పని చేశాడు. రమ అడ్డుపడి ఆపింది. "మీరు ఆవేశంలో వున్నారు.వెళ్లి పడుక్కోండి.రేపు తెల్లారాక మాట్లాడుకుందాం " అంది. తెల్లావారేసరికి రమాపతిలేడు.వాడి మేనత్తా లేదు.రమ గుండె బోరుమంది.ఆ విషయం ఆనందరావుకి చెప్పింది.

“పోతేపోయాడు.పీడా వదిలింది.వీడి తాతలాంటివాడిని మరొకడిని తెస్తాను"అంటూ బీరాలు పోయాడు ఆనందరావు. తాతలాంటివాడు కాదు కదా.మనవడి లాంటి వాడు కూడా దొరకలేదు.ఫలితం ఆ ఇల్లు మళ్ళీ ఒక సర్కస్ డేరాలా తయారయింది. పనివాడు వుండనీ లేకపోనీ బాబాయ్ గారికీ అత్తయ్య గారికీ వేళకి అన్నీ అమర్చాలి.ఇవి కాక భర్తపనీ పిల్లలపనీ..అన్ని పనులతో పాపం రమ హూనం హూనం అయిపోసాగింది.భార్య అవస్థ చూడలేక ఏమీ చేయలేక అవస్థ పడిపోతున్నాడు ఆనందరావు.నాలుగు రోజులు హోటల్ నుంచి తెప్పించాడు.పిల్లలు సర్దుకుపోయినా బాబాయ్ అత్తయ్యా మాత్రం గొడవ చేసేవారు.సమస్య తీవ్రతరం అయింది.

రమ శారీరకంగా కన్నా మానసికంగా కృంగిపోయింది. "అమ్మా అమ్మా అంటూ కడుపునా పుట్టిన బిడ్డలా వుండేవాడు.అలాంటి వాడిని అన్యాయంగా వెళ్ళగొట్టారు.”అంటూ గుర్తు చేసుకుని ఏడుస్తుంటే పశ్చాత్తాపంతో బాధపడ్డాడు ఆనందరావు. రమాపతి కోసం వెతికించడం మొదలు పెట్టాడు.ఈ ఊళ్ళో ఎవరికైన పనిచేశాడేమో వాకబు చేస్తే లేదని తెలిసింది.వాళ ఊరికి మనిషిని పంపించాడు.ఇష్టదైవాలకు దణ్ణాలు పెట్టాడు.పిల్లలు బెంగపెట్టుకుని నాన్న పతి ఎప్పుడు వస్తాడు అని అడుగుతున్నారు.

అస్తమానం పతీ అంటూ తల్చుకుని తల్చుకుని ఏడుస్తుంది రమ. అతి కష్టం మీద వారం రోజులు గడిచాయి. ఊరికి వెళ్ళిన పెద్దమనిషి కూడా రిక్తహస్తాలతో తిరిగి వచ్చేశాడు.నిలువునా నీరయిపోయాడు ఆనందరావు. ఓనాడు..రాత్రి పది గంటలయింది.ఫోన్ మోగింది.తీసి హలో అన్న ఆనందరావు...ఆనందంతో ఎగిరి గంతేశాడు. “పతీ నువ్వా ?”అన్నాడు.

“అయ్యగారూ!బుద్ది గడ్డితిని మీకు చెప్పకుండా వచ్చేశాను.మిమ్ములందరినీ వదిలి ఉండలేకపోతున్నాను.మీ ఇష్టం వచ్చిన పేరుతో పిలవండి.మీరేం పిలిచినా పలుకుతాను. మళ్ళీ పన్లోకి రావొచ్చా ?” దీనంగా అడిగాడు. “ మేము నిన్ను వదిలి వుండలేకపోతున్నాము.నీ ఇష్టం వచ్చిన పేరుతోనే పిలుస్తాం. వచ్చేయ్.ఇన్నాళ్ళూ రాకపోతే వేరే చోట పనికి కుదిరావనుకున్నా" అన్నాడు ఆనందరావు. “ఒకచోట పని కుదిరిందండి.కానీ పతీ అని పిలవాలగానే ఆ ఇంటాయన తాడి యెత్తున లేచాడండి.ఆయన భార్య పేరు పతిట " చెప్పాడు పతీ.

పక్కున నవ్వాడు ఆనందరావు. ఈ సంభాషణ వింటున్న రమ ఒక్క గెంతులో ఫోన్ దగ్గరికి వచ్చేసింది. “ఎవరు...పతేనా "అన్నది సంభ్రమాశ్చర్యాలలో.

“అవును పతే!ఇదిగో మాట్లాడు "అంటూ ఫోన్ అందించాడు. “పతీ ఎలా వున్నావు?ఎక్కడున్నావు ?త్వరగా ఇంటికి వచ్చేయ్.”అని రమ అంటుంటే బాధ అనిపించలేదు ఆనందరావుకి.

“అమ్మయ్య నా భార్య ఇకనైనా ఆనందంగా వుంటుంది.పతి దొరికాడుగా "అనుకున్నాడు ఆనందరావు తృప్తిగా.