TeluguOne Services
Copyright © 2000 -
, TeluguOne - Comedy - All rights reserved.
యాక్షన్ ఫీట్సా...?
-పద్మశ్రీ
“ఏమయిందిరా...?”
“కాలు విరిగింది...?”
“వర్షం పడింది...!”
“వర్షం పడితే కాలు విరగడమేమిట్రా...”
“హైదరాబాదులో అంతే...!”
“అబ్బా... అర్థమయ్యేలా చెప్పు...”
“ఆకాశం మేఘావృత్తమయివుంది... వర్షం వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. అసలే సాయంకాలం ఆరుగంటలు... అందరూ ఆఫీసు పనులు వదిలించుకుని, అలసిపోయిన శరీరాలతో ఎప్పుడు ఇంట్లో వాలిపోవాలా అనుకుంటూ వారి వారి మోటారు సైకిల్స్ పైన వేగంగా వస్తున్నారు....
సారీ...సారీ... హైదరాబాదులో వేగంగా రావడమేంటీ నా బొంద.... సూపర్ ఫాస్ట్ గా వస్తున్నారు. అంటే గంటకి 10 కిలోమీటర్ల వేగంతో అన్నమాట.. అలా వస్తున్న వాళ్ళలో నేనూ ఒక్కణ్ణి... ఎప్పుడు ఇంట్లో వాలిపోవాలా అన్న ఆతృత లోలోపల ఉన్నా నాలాంటి ఎందరో అభాగ్యుల మధ్యలో నేనున్నాను కాబట్టి, నాలాగే నాచుట్టూ ఉన్న వాహనచోదకులు కూడా ఆలోచిస్తారు కాబట్టి ఎవరికి వారం ఎవరికి ఎంత అనుకూలిస్తే అంత సాధ్యామైనంత వేగంగా ముందుకు పరుగుతీయిస్తున్నాం మా వెహికల్స్ ని... సరిగ్గా సగం దూరం వెళ్ళాయో లేదో మెల్లిగా వర్షపు చినుకులు పైనుండి రాలడం మొదలయ్యాయి..
నాలో కంగారు మొదలైంది... నాలాగే మిగతావారి పరిస్థితి కూడానూ... అలాగే మరింత వేగంగా వెళ్ళాలనే ఆరాటంతో యాక్సిలేటర్ ని మరి కాస్త పెంచి రయ్యున దూసుకుపోనిచ్చాను.
అంతలో ఓ ప్లై ఓవర్ బ్రిడ్జి వచ్చేసింది... దాని పైకి ఎక్కాలి... సరే ఎక్కేస్తాం.. సరిగ్గా అప్పుడు జరిగింది ఆ సంఘటన.... అసలేం జరుగుతుందో ఆలోచించాలనే వ్యవధి లేకుండానే ఒక్కసారిగా... జరిగిపోయింది...
నేను చూస్తున్నది నిజమేనా అన్న సందేహం కూడా కలిగింది... ఇంగ్లీషు సినిమాలలో కనిపించే అద్భుతమయిన యాక్షన్ సీన్ లాంటిది కళ్ళముందు కదలాడినట్లు....
నా ముందు నుండి వెళుతున్న ఓ మోటారుసైకిలు ఆసామి నేను చూస్తుండగానే దబ్బున బైక్ తో సహా కిందపడిపోయాడు.. అది గ్రహించి అరెరే అని అనుకుని నా బైకుని ఆపేయడానికి నేను చేసిన ప్రయత్నం సగం కూడా ఫలించకముందే నేను కూడా సరిగ్గా అతను పడిపోయినట్లుగానే పడిపోయాను..
‘అమ్మా..’ అన్న ఆర్తనాధం... ఆ తర్వాత నా మోకాలిచిప్ప పగిలిపోయిన శబ్ధం.... అంతేనా...! నా వెనకాల వచ్చిన వాహనాలు కూడా వరుసగా సరిగ్గా మేము పడిపోయిన చోటుకి రాగానే ఎవరో అదృశ్య వ్యక్తి తన హస్తాలతో కిందికి తోసేస్తున్నట్టుగా కిందపడిపోతున్నారు...
అలా నాలాంటి ఎందరో బాధితులు తమ తమ కాళ్ళు, చేతులూ విడతల మాదిరిగా పోగొట్టుకున్నారు...
అదన్నమాట సంగతి...” “ఛ.. నేన్నమ్మను... ఓకే చోట అన్ని మోటార్ సైకిళ్ళూ దబ్బున పడిపోవడం ఏంటీ... చోద్యం కాకపోతేనూ...”
“అయ్యా... మానవ మాత్రులేవరూ నమ్మలేని అద్భుతమైన సంఘటనలు ఒక్క హైదరాబాదులోనే జరుగుతుంటాయి”
“ఇంతకీ.. అసలు మీరందరూ అలా ఎలా పడిపోయారో ఏమైనా తెలిసిందా...?”
“ఎందుకు తెలియదూ.. తెలుసుకున్నాను...”
“అసలేం జరిగింది...”
“ఏం జరిగిందంటే....? వర్షం రాకముందు ఆ రోడ్డువెంట ఓ ఆయిల్ ట్యాంకర్ వెళ్ళిపోయింది. దానిలోనుండి ఆయిల్ లీకయ్యి రోడ్డుపైన పడిపోయింది. ఆయిల్ లీకయినప్పుడు అది కనిపిస్తుంది కాబట్టి వాహనదారులు పక్కనుండి జాగ్రత్తగా వెళ్ళిపోయారు...
ఆ తర్వాత వర్షం రావడంతో ఆ వర్షపునీటిలో ఆయిల్ కలిసిపోవడంతో పోల్చుకోలేని నాలాంటి అభాగ్యులందరూ ఆ వర్షంలో తడవకుండా తొందరగా ఇంటికి చేరుకోవాలనే ఆతృతతో ఇలా అడ్డంగా పడిపోయారు... హు...హు.
.” ఒక చిన్న నిర్లక్ష్యం ఎంత పెద్ద ప్రమాదానికి దారితీస్తుందో తెలియచెప్పే సంఘటన ఇది. ఆయిల్ టాంకర్ లీక్ కావడం, ఆ వెహికల్ ప్రధాన రహదారులగుండా వెళ్ళడంతో జరిగిన ప్రమాదం ఇది...
ఇలాంటి వాహనాలని గుర్తించి తక్షణం అడ్డుకోవాల్సిన పోలీసుల కళ్ళకి ఇవి కనిపించవు కానీ... ఎంత దూరంలో ఉన్నా హెల్మెట్ లేని వాహనదారుని గుర్తించి మరీ ఆపి చాలాన్లు వసూలు చేస్తారు.
ఇది కల్పితంగా వ్రాసింది కాదు... హైదరాబాదులో జరిగిన ఓ యదార్థ సంఘటన....
|