పీడ విరగడయింది....!

పీడ విరగడయింది....!

-పద్మశ్రీ

గోల గోలగా అటూ ఇటూ తిరుగుతూ ఇంట్లో ఉన్న వస్తువులని చిందరవందర చేస్తూ తెగ అల్లరి పెట్టే ఎనిమిదేళ్ళ నానిగాడి అల్లరి సడన్ గా ఆగిపోయేసరికి పక్క గదిలో షేవింగ్ చేసుకుంటున్న కైలాసం తగ కంగారు పడిపోయాడు.

“ఓరే నానిగా... నానీ.... ఏమయిందిరా.....”

షేవింగ్ చేసుకుంటూనే గట్టిగా అరిచాడు....

“అబ్బా... డిస్టర్బ్ చేయకు డాడీ... టీ.వి. చూస్తున్నాను....”

వాడు కూడా అరుస్తూనే రిప్లై చేసాడు. ఆ రిప్లై విని మనసు కాస్త శాంతించడంతో తిరిగి షేవింగ్ చేసుకోవడంలో నిమగ్నమయ్యాడు కైలాసం. గత ఎనిమిదేళ్ళుగా వాడు చేసే అల్లరి అతని చెవికి వినిపించకపోతే తెగ యిదయిపోతాడు. ఎందుకంటే ఆ వెంకటేశ్వర స్వామికి సుప్రభాతం ఎలాగో మన కైలాసానికి అతని పుత్రరత్నమైన నానిగాడి అల్లరి అలాగన్నమాట. ఈ ఎనిమిదేళ్ళుగా వారి దినచర్యలో నానిగాడి అల్లరి కూడా ఓ పార్టయిపోయింది.

అంతగా అల్లరి చేసే వాడు ఉన్న పళంగా అల్లరి ఆపేసి టి.వి. చూస్తున్నాడంటే....

ఆ టి.వి.లో ఏదో ఇంట్రెస్టింగ్ ప్రోగ్రాం వస్తుండి ఉంటుంది. అననుకుని షేవ్ చేసుకుంటున్న కైలాసానికి సడెన్ గా ఏదో అనుమానం రావడంతో ఉలిక్కిపడ్డాడు, అలా ఉలిక్కిపడ్డంతో చెంపపై కసుక్కున దిగింది బ్లేడు.

దాంతో కెవ్వుమని అరిచి అద్దంలో చూసుకునే సరికి... ఎర్రటి రక్తం తెల్లటి షేవింగ్ క్రీము నురగలో కలవడం గమనించి.... మళ్ళీ కెవ్వుమన్నాడు కైలాసం...

తాను ఇంత పెద్దగా అరిచినా నాని గాడి నుండి రిప్లై లేకపోవడంతో గబగబా హాల్లోకి వెళ్లిన కైలాసానికి నానిగాడు ఎంతో ఇంట్రెస్టుగా, కాన్ సన్ ట్రేషన్ మొత్తం టి.వి. పైనే పెట్టి చూడడం గమనించి తల తిప్పి టి.వి. వంక చూసిన కైలాసం కళ్లు గిరిగిరా తిరిగాయ్ ఒకేసారి.

టి.వి. లో సరిగ్గా నానిగాడి వయసువాడే కనిపిస్తున్నాడు. చాలా రఫ్ గా ఉన్నాడు.

వాడి ముందు టి.వి. ఛానెల్ మైకులున్నాయి...

వాడి వెనకాల నలుగురు పోలీసులు ఉన్నారు. వాడి తల పక్కనే మరో సబ్ స్క్రీన్ లో మరో దృశ్యం కనిపిస్తుంది..

ఆ దృశ్యంలో ఓ మైనర్ బాలిక కనిపిస్తుంది. ఆమె ఒంటిపైన దుస్తులు చిందర వందరగా కనిపిస్తున్నాయి..

టీ.వీలో కనిపిస్తున్న బాలుడు హీరోలా ఫోజు పెట్టి నిలబడ్డాడు.

“ఇంతకీ నీకు రేప్ చేయాలనే ఆలోచన ఎందుకొచ్చింది..?” ఓ విలేఖరి అడుగుతున్నాడు.

“ఇంతకీ రేప్ అంటే ఏమిటీ...?” ఆ కుర్రాడు అమాయకంగా ప్రశ్నించాడు.

“అదే... నువ్వు ఆ అమ్మాయిపై... లంగాపై,,,, అలా చేసావు కదా... దాన్నే రేపని అంటారన్న మాట....

ఇలా ఆ అమ్మాయిని రేప్ చేయాలనే కోరిక నీకెందుకు కలిగింది....?” ఓ విలేఖరి ‘రేప్’ అంటే ఏమిటో ఆ బాలుడుకి కూలంకషంగావివరించి వాడికి ఆ ఆలోచన ఎందుకొచ్చిందన్న ప్రశ్న వేసాడు.

“ఎందుకంటే మరేమో మొన్న నైటు ఓ టి.వి. ఛానెల్ లో క్రైం న్యూస్ లో నా అంత వయసువాడు, అచ్చు ఇలాగే చేసాడు... అది టి.వి. లో చూసాక నాక్కూడా అలాగే చేయాలనిపించి పక్క ప్లాట్ లో ఉంటున్న ఈ అమ్మాయిని మేడ పైకి లాక్కెల్లి అలా చేసాను...”

“నువ్వు రేప్ చేస్తున్నప్పుడు ఆ అమ్మాయి అరవలేదా...?”

“ఊహూ... అరవకుండా చేసాను...”

“ఎలా చేసావ్... వివరంగా చెప్పు...”

“మరేమో...” అంటూ ఆ కుర్రాడు చెబుతుంటే దాన్ని నానిగాడు కన్నార్పకుండా చూస్తుంటే మళ్ళీ కెవ్వున అరిచి పరిగెత్తి టి.వి. ఛానెల్ మార్చాడు కైలాసం.

“నానిగా... ఇలాంటి చెత్త న్యూస్ లు చూడకూడదు...” అన్నాడు గంభీరంగా...

దాంతో నని గాడికి కోపమొచ్చి పక్కనే ఉన్న గాజు గ్లాసందుకుని ‘ఫేడేల్’ మని నాలక్కొట్టడంతో గాజు ముక్కలు హాలంతా చెల్లాచెదురయ్యాయి...

“నేనా న్యూసే చూస్తాను... పో..” అంటూ మరో గాజు గ్లాసు కోసం వెతుకుతున్న నానిగాడి దగ్గరకు కంగారుగా పరుగెత్త బోయిన కైలాసం పాదాల్లోకి ఓ మూడు నాలుగు గాజు ముక్కలు కసుక్కున దిగడంతో మళ్ళీ కెవ్వు...కెవ్వుమని అరిచి ఎలాగైతేనేం నానిగాడి దగ్గరకు వెళ్లాడు.

“ఒరే కన్నా...అలాంటివి నువ్వు చూడకూడదురా...”

నొప్పిని భరిస్తూ, ఏడుపు మొహంతో బాధగా అన్నాడు కైలాసం..

“ఎందుకు చూడకూడదు...?” అన్నాడు నానిగాడు కోపంతో...

“ఎందుకంటే... ఎందుకంటే,,,,” ఏం చెప్పాలో అర్ధం కాక జుట్టుపీక్కుంటే మళ్లీ సడెన్ గా నానిగాడు సైలెంటయిపోయి

ఇంట్రెస్టింగ్ గా టీ.వీ. వైపు చూడడం ప్రారంభించాడు...

కైలాసం కూడా ఉలిక్కిపడి టీ.వీ. వైపు చూసాడు... అది మరో ఛానెల్ లో వస్తున్నా స్పెషల్ ప్రోగ్రాం...

ఓ యాంకర్ వయ్యారాలు ఒలకబోస్తూ కనిపించింది... ఆమె వెనకాల గ్రాఫిక్స్ లో కొన్ని సీన్స్ స్క్రోలింగ్ మాదిరిగా కదులుతున్నాయి..

ఆ సీన్స్ హిరో హీరోయిన్స్ వి.... ఆ స్పెషల్ ప్రోగ్రాం పేరు

“ముద్దంటే చేదా...” ఆ యాంకర్ వెనకాల హీరో హీరోయిన్లు వివిధ భంగిమల్లో పెదాలు, పెదాలు ఆనించుకుని గాఢంగా ‘ముద్దు’ పెట్టుకునే దృశ్యాలుస్పష్టంగా కనిపిస్తున్నాయి....

అదిగో ఆ దృశ్యాలనే నానిగాడు చూస్తున్నాడు. ఆ యాంకర్

“ఏఏ సినిమాలో ఎవరెవరు ముద్దు పెట్టుకున్నారు... ముందు ముందు సినిమాలలో ఎవరెవరు ముద్దు పెట్టుకోబోతున్నారు, ఆ ముద్దు సీన్ అయిపోయిన తర్వాత ముద్దు పెట్టుకున్న హీరో హీరోయిన్ల పీలింగ్స్ ఎలా ఉన్నాయి ఇత్యాది విషయాల గురించి కూలం కూషంగా వివరిస్తుంటే నానిగాడు అది చూడడంలో లీనమయిపోతుంటే...

మళ్లీ కత్తిగా కెవ్వు.. కెవ్వు.. మని అరిచి ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే మరో ఛానెల్ మార్చాడు కైలాసం... మళ్లీ నానిగాడికి కోపమొచ్చింది...

కైలాసం వైపు కోపంగా చూస్తూ పక్కనే ఉన్న ప్లవర్ వాజ్ అందుకుని గురిచూసి బలంగా విసిరాడు... అది సూటిగా వచ్చి సైలాసం నుదుటికి తాకి ‘దడేల్’ మని శబ్దం చేస్తూ కింద పగిలిపోయింది...

“కుయ్యో... మొర్రో.. కెవ్వు.. కెవ్వు..” మంటూ అరుస్తూ పక్కనే ఉన్న సోఫాలో కూలబడిపోయాడు. నానిగాడి చేష్టలకి విపరీతమైన కోపం వచ్చేసింది కైలాసానికి... అతనికి వచ్చిన కోపం గురించి ఏమాత్రం పట్టించుకోకుండా ‘ముద్దంటే చేదా’ ప్రోగ్రాం పెట్టమని అరుస్తూనే ఉన్నాడు నానిగాడు. “రాను రాను నీ అల్లరి శృతిమించి పోతుందిరా నానిగా... అయ్యె..అయ్యె... చెంపపై రక్తం కారుతుంది. కాళ్ళల్లో గాజు ముక్కలు గుచ్చుకున్నాయి... నుదుటిపై దెబ్బ.. పొద్దున్నే లేవగానే ఏ ఛానెల్ చూసానో ఏమిటో...” అంటూ తన గాయాలపైపు చూసుకుంటున్న కైలాసం మళ్లీ ఉలిక్కిపడ్డాడు...

ఎందుకంటే మళ్లీ నానిగాడు సైలెంట యిపోయాడు. ఆడి చూపు టి.వి. వైపే ఉండడంతో కైలాసం భయం భయంగా టీ.వి. వైపు చూసాడు.

అది మరో ఛానెల్...

ఆ ఛానెల్ లో.... దృశ్యం సరిగా కనిపించడం లేదు కానీ చూస్తుంటే అదో క్లాస్ రూంలా ఉంది... ఆ క్లాస్ రూంలో టేబుల్ పైన ఓ బాలుడు, ఓ బాలిక ఒకరిపై ఒకరు పడుకుని ఉన్నారు, వారి ఒంటిపై బట్టల్లేవు...

ఆ సీన్ని ఎవడో మరో స్టూడెంట్ సెల్ ఫోన్ లో చిత్రీకరించాడు...

ఆ దృశ్యాన్ని యధాతధంగా... ‘క్లాస్ రూంలో రాస లీలలు’ అనే టైటిల్ తో ప్రసారం చేస్తున్నారు.

ఆ సీన్ నే నానిగాడు కళ్ళు పెద్దవి చేసి మరే చూస్తున్నాడు. కైలాసంకి ఏం చేయాలో అర్ధం కాలేదు.

ఈసారి కోపం నానిగాడిపైన రాలేదు.

చిన్న పిల్లల మనసుల్లో చెడు ఆలోచనలు కలిగించే ఇలాంటివి ప్రసారాలు చేస్తున్నందుకు కోపం వచ్చింది.

మరింకేమీ ఆలోచించలేదు కైలాసం.. కళ్ళలో గాజు ముక్కలు నొప్పి పెడుతున్నా.. అలాగే వెళ్తూ ఆ టీ.వి.ని అమాంతం గాల్లోకి లేపి గా.....ట్టి....గా.... క...సి...గా.. నేలపై విసిరేసాడు...

ముక్కలు ముక్కలైపోయింది టీ.వి. ప్రస్తుతం టీ.వి. ఛానెల్స్ పరిస్థితి ఇలా వుంది....

ఇలాంటి కార్యక్రమాలు తమ పిల్లల మనసుల్లో చెడు ప్రభావాన్ని రగిలించకుండా జాగ్రత్తపడే ప్రతీ తండ్రి కూడా ఏం చేయగలడు...

ఇంట్లో ఉన్న టి.వి.ని ముక్కలు చేయడం తప్ప.....!