డిష్యుం... డిష్యుం....!

డిష్యుం... డిష్యుం....!

 

-పద్మశ్రీ

 

 

 

 

 

 

 

 

 

 

ఒరేయ్ చెత్తనాయాలా...?”

“నన్నే చెత్తనాయాలా అంటావురా... నాకంటే పరమ చెత్తనాయాలవిరా నువ్వు...”

“నువ్వు ఉత్త చెత్తనాయాలవే కాదురా... కుళ్ళిపోయిన చెత్తనాయాలవి....”

అంతే కోపంతో పరుగెత్తుకొచ్చాడు.

“డిష్యుం....”

“అమ్మా....!!”

“డిష్యుం... డిష్యుం”

“అబ్బా.....!!” “అయ్యయ్యో వారిని ఆపండి....!!”

“ఒరేయ్ మావాణ్ణి చెత్తనాయాలని అనడమే కాకుండా కొడతావా.....?”

“డిష్యుం...”

“అబ్బా.....!!”

“అయ్యయ్యో... వారిద్దరినీ ఆపమంటే నువ్వేంటయ్యా... అలా కొట్టేశావ్...”

“వాణ్ణి కొట్టడమా... ఇంకేం....” మాట పూర్తికాలేదు... మొహంపై ఓ

‘డిష్యుం’

“అబ్బా....!”

“మీరే పెద్ద గూండాలనుకుంటున్నార్రా...

ఒరేయ్... మీకంటే మేము పెద్ద గూండాలం... మాతోనే పెట్టుకుంటార్రా...”

“డిష్యుం... డిష్యుం...”

“అబ్బా.... అమ్మా.....అయ్యా.... నాయనా....”

అందరూ మూకుమ్మడిగా అరుస్తూనే ఉన్నారు... కళ్ళు గిర్రున తిరుగుతుండగా...”ఒరేయ్ ఆపండ్రా... చిన్న గొడవని ఇలా పెద్దగా చేసి నానా రభస సృష్టిస్తున్నారేంట్రా... ఆపండి... అయ్యో... అయ్యో... అలా బాదుకోవడం ఆపండ్రా నాయనల్లారా....!”

“డిష్యుం....డిష్యుం...” పాపం పెద్దాయన అన్న మాటలు ఆ పిడిగుద్దుల శబ్దాలలో కలిసిపోయాయి.... చూస్తూ ఉండగానే అక్కడ పెద్ద రభస మొదలయింది. టేబుళ్ళపై ఉన్న కాగితాలు గాలిలో రింగులు తిరుగుతున్నాయి.... బల్లలమీద పడి పొర్లుతూ కింద మీద పడుతున్న వాళ్ళలో “డిష్యుం డిష్యుం” శబ్దాలు ఎక్కువయ్యాయి......

“అబ్బ.... అబ్బ... వావ్.... ఫెంటాస్టిక్... సూపర్...”చప్పట్లు చరుస్తూ గట్టిగా అరుస్తున్నాడు అబ్బాయ్....

 

అరవడమే కాదు... వెంటనే వారి డాడీని పిలిచాడు..... “డాడీ... డాడీ... త్వరగా రండి... టీవీలో మాంచి ఫైటింగ్ సీన్ వస్తోంది.... లేటయితే మిస్సవుతారు... అబ్బో ఎంత బాగుందో...” పక్క రూంలో పేపర్ చదువుతూ కూర్చున్న వాడల్లా కొడుకు మాటలు విని పరుగెత్తుకొచ్చాడు....

“చూడండి డాడీ.. ఫైటింగ్ చాలా బాగా చేస్తున్నారు... ఇంతవరకూ ఇలాంటి ఫైటింగ్ ఎప్పుడూ చూడలేదు...”

కొడుకు మాటలు వింటూనే టీవీ వైపు చూస్తున్న అతను కళ్ళు పెద్దవి చేసి, నోరు తెరిచి చూస్తుండిపోయాడు...

. “డాడీ.... డాడీ... ఆ అంకుల్ వాళ్ళు స్కూళ్ళో అచ్చు మేం కొట్టుకుంటున్నట్లే కొట్టుకుంటున్నారు... మేం వేసుకున్నట్లే అందరూ తెల్లటి యూనిఫామ్ వేసుకున్నారు... అబ్బా...స్కూల్లో మేము విసురుకుంటున్నట్లే గాల్లోకి పేపర్లు విసురుకుంటున్నారు... డాడీ... డాడీ.... అది ఏ స్కూలు డాడీ...?” ఆసక్తిగా అడిగాడు అబ్బాయి....

“అదా... అదీ.... మరేమో.....” నీళ్లు నమిలాడు. “

చెప్పు డాడీ... వాళ్ళది ఏ స్కూలు...?”

“అదే... అది స్కూలు కాదన్నమాట... దాన్ని ఏమంటారంటే....?”

మళ్ళీ నీళ్ళు నమిలాడు...

“చెప్పు డాడీ.... వారు చదువుకుంటున్న ఆ స్కూలు పేరు చెప్పు...”

హు...! ఏమని చెప్పగలడు ఆ తండ్రి.. అదొక అసెంబ్లీ అని! అందులో అలా కొట్టుకుంటున్నవారు, తిట్టుకుంటున్నవారు ప్రజా ప్రతినిధులని ఎలా చెప్పగలడు...? ప్రజలని, ప్రజలతోపాటు సమాజాన్ని సరయిన పద్ధతిలో ముందుకి తీసుకుపోయే రాజకీయ నాయకులు వీరని ఎలా చెప్పగలడు....?

ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలంటే విద్యార్థులకి స్కూళ్ళలో ఎలా తిట్టుకోవాలో, ఎలా కొట్టుకోవాలో, గాల్లోకి పేపర్లు ఎలా విసరేయాలో నేర్పే ఓ వేదికలా మారిపోయింది....!ఇదేమి చిత్రమో.....!