విముక్తి !

విముక్తి !

-పద్మశ్రీ

“హమ్మా....!” బాధగా అరిచింది ఇల్లాలు. బాత్రూంలో బట్టలు పిండుతూ కాలు జారి పడింది. నడ్డి విరిగినంత పనైంది.

పెద్దగా శబ్దం రావడంతో ఆమె భర్త అక్కడికి వచ్చి క్రిందపడి వున్న భార్యని లేపకపోగా తలపై ఒక్క పీకు పీకి "ఇప్పటికే ఆలస్యం అయిపోతుంటే ఈ వెధవగోల ఏంటి...” తొందరగా పనికానివ్వు అంటూ ఆగ్రహంగా చెప్పి వెళ్ళిపోయాడు.

ఆవిడ నడుములు పట్టేశాయి.. లేచే ఓపిక లేదు. చేయి అందించమని భర్తని అడిగితే మరో పీకు పీకుతాడు. బాధనంతా దిగమింగుకుని లేవడానికి ఎంత ప్రయత్నించినా శరీరం సహకరించలేదు.

ఆమె కళ్ళవెంట నీళ్ళు వచ్చాయి. దానితో సంబంధం లేకుండా వంటింట్లో నుండి సైరన్ మోతలా కుక్కర్ విజిల్ వినిపించగానే అంత నొప్పిగా ఉన్నా చెంగున లేచి వంటింట్లోకి పరుగు తీసింది. స్టౌ పై పెట్టిన పాలు పొంగుతున్నాయి...

“అయ్యో" అనుకుంటూ అనాలోచితంగా ఆ గిన్నెను దించాలనుకునే క్రమంలో అదికాస్తా జారి క్రిందపడిపోయింది. వేడి వేడి పాలు ఆమె ఒంటిపై పడిపోయాయి. ఒళ్ళంతా భగ్గున మండిపోయిన ఫీలింగ్....

హమ్మో, హమ్మో.... అంటూ గట్టిగా అరిచింది. ఆ అరుపులకి భర్త వంటింట్లోకి వచ్చాడు. వంటిపైన వేడి వేడి పాలు పడి ఆర్తనాదాలు చేస్తున్న భార్య బాధని పట్టించుకోకుండా మరింత ఆగ్రహంగా ఊగిపోయాడు.

“నాకు తెలుసే... ఈరోజు నా కార్యక్రమాలన్నింటినీ సర్వనాశనం చేయాలని కంకణం కట్టుకుని ఇలా నటిస్తున్నావే... రోజూ కరెక్టుగా పనిచేసే దానివి ఈరోజు ఇలా చేస్తున్నావేంటే ..!” అనుకుంటూనే ఆమె దగ్గరికి వచ్చాడు.

ఆమె జుట్టుని చేతుల్లోకి తీసుకున్నాడు. వంటింట్లో నుండి వరండాలోకి ఒక్కతోపు తోశాడు. ఆ తోపుకు బోర్లా పడిపోయింది. అమ్మా అని అరిచే ఓపిక కూడా ఆమెలో నశించిపోయింది.

“ఒసేయ్... మళ్ళీ ఇలా గిన్నెల శబ్దాలు, నీ అరుపులు నాకు మళ్ళీ వినిపించాయంటే నా తోలు బెల్టుకి పని చెప్తాను. అయిదు నిమిషాలలో టిఫిన్ రెడీ చేసి తీసుకురా" హుకుం జారీ చేశాడు భర్త.

ఆమె కళ్ళల్లో నుండి కన్నీళ్ళు రాలుతున్నాయి. ఒంట్లో ఓపిక లేకపోయినా భర్త చెప్పినట్టు చేయకుండా మరిన్ని చిత్ర హింసలకి గురికాబడతానని మెల్లగా లేచి ఏడుస్తూ వంటింట్లోకి నడిచింది.

భర్త హాల్లో కొచ్చాడు. అప్పటికే అక్కడ హడావిడిగా వుంది.

అతను వచ్చి సోఫాలో కూర్చోగానే టివీ ఛానెల్ వాళ్ళు తమ మైకులని అతని ముందు పెట్టారు.

అతను గొంతు సవరించుకున్నాడు. “నా రాష్ట్ర ప్రజలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఈ రాష్ట్ర మంత్రిగా మహిళల కోసం నేను ఎన్నో అభివృద్ధి పనులు చేపడుతున్నాను. మహిళలు కేవలం వంటింటికే పరిమితం కాకుండా వాళ్ళు కూడా మగవారితో సమానంగా స్వేచ్ఛను అనుభవించేలా చేయడానికి నేను ఎంతో కృషి చేస్తున్నాను. మహిళలకు సమాన హక్కులు కలిగించాలని ఈ రాష్ట్ర మంత్రిగా తగిన చర్యలు చేపడుతున్నాను. ముఖ్యంగా నా రాష్ట్ర మహిళలు గృహ హింసలకి గుర్రి కాకుండా ఉండడానికి తీవ్రంగా కృషి చేస్తున్నాను.” అతను ఎంతో ఆవేశంగా, ఉద్విగ్నంగా, సీరియస్ గా, ఇంకా ఎన్నెన్నో భావాలని మొహంలో ప్రతిఫలింప చేస్తూ రాష్ట్ర ప్రజలని ఉద్దేశించి మాట్లాడుతున్నాడు.

ఆయన భార్య వంటింట్లో ఒంటినిండా గాయాలతో, ఒంట్లో శక్తి నీరసించిపోతుండగా ఆలస్యం అయితే ఎక్కడ భర్త చేత తన్నులు తినాల్సి వస్తుందోనని భయపడుతూ, కుమిలిపోతూ వంటపనిలో నిమగ్నమయిపోయింది...

సాక్షాత్తు మంత్రి భార్యకే విముక్తి లేని ఈ రాష్ట్రంలో సాటి మహిళలకి ఈ కష్టాల నుండి విముక్తి లభిస్తుందా....?