TeluguOne Services
Copyright © 2000 -
, TeluguOne - Comedy - All rights reserved.
తాతా ధిత్తై తరిగిణతోం 56
జీడిగుంట రామచంద్రమూర్తి
"అర్జంటుగా వెళ్ళి మనూరి ఆరోగ్యకేంద్రంలో దాక్టరమ్మ వుంటుంది తీసుకురా" అంటూ పురమాయించింది. కోడల్ని జాగ్రత్తగా వెంటపెట్టుకుని వెళ్లి గదిలో మంచంమీద పడుకోబెట్టింది.
మరో పదినిమిషాల్లో డాక్టరమ్మ వచ్చింది మంచం మీద నీరసంగా పడుకుని వున్న అశ్వినిని పదినిమిషాలపాటు క్షుణ్ణంగా పరీక్షించి, ఆ తర్వాత ఏదో అర్థమైనట్టుగా ముసిముసి నవ్వులు నవ్వుకుంది.
"ఏమైంది డాక్టర్?" ఆత్రంగా అడిగింది అశ్విని.
"చదువుకున్న ఆడపిల్లవి. పెళ్లిచేసుకుని అత్తారింటికి కాపురానికొచ్చాక ఏమౌతుందో ఆ మాత్రం గ్రహించుకోలేవా?" ముసిముసిగా నవ్వుతూనే గొప్పగా అడిగింది డాక్టరమ్మ. అశ్వినికి ఒళ్లు మండిపోయింది.
"అత్తారింటికి కాపురానికి రావటానికీ నాకు కళ్ళు తిరిగి వాంతి కావటానికీ సంబంధమేమిటో?" కోపంగా చూస్తూ అడిగింది.
"నువ్వు తల్లివి కాబోతున్నావమ్మా. కంగ్రాచ్యులేషన్స్" డాక్టరమ్మ ఉత్సాహంగా అశ్విని భుజం తట్టి చెప్పింది.
తన తలపై పిడుగు పడినట్టుగా ఉలిక్కిపడింది అశ్విని.
అలాంటి పరిస్థితి రాకుండా చూసుకోవాలనే ఆరోజు తన పుట్టింటికి వెడుతూ, ఆరోగ్యకేంద్రం దగ్గర కారు ఆపుకుని ఆ డాక్టర్నే అడిగి 'పిల్స్' తీసుకెళ్లింది. 'హనీమూన్' లో వాటిని వాడిన కారణంగానే తమకు గర్భం రాదన్న విశ్వాసంతో నిర్భయంగా ఇప్పుడు 'పరీక్ష' చేయించుకుంది. కానీ జరిగిందేమిటీ?
ఒకవేళ. లేడీ డాక్టర్ తనకు సరిగ్గా పరీక్ష చేయలేదా? లేక తను వాడిన ఆ మాత్రలు పనిచేయలేదా? ఈ విషయం మూడో మనిషికి తెలిస్తే ఇంట్లో మూడో ప్రపంచయుద్ధం జరిగిపోతుంది.
గబగబా మంచందిగి వెళ్లి తమ సంభాషణ అత్తగారు వినకుండా ఆ గది తలుపులు మూసేసింది అశ్విని.
"ఇకనించీ నీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలమ్మా. నెలనెలా మా ఆరోగ్యకేంద్రానికొచ్చి చెకప్ చేయించుకోవాలి పళ్ళూ, పాలు బాగా తీసుకుంటూండు." తన మెడికల్ కిట్ సర్దుకుంటూ చెప్తోంది డాక్టరమ్మ.
"చాల్లెండి. మీ సలహాలు! పల్లెటూరి డాక్టర్లంటే ప్రజల్లో ఇందుకే నమ్మకం లేకుండా పోతోంది...ప్రతి చిన్నరోగానికి పట్నాలకు పరుగులు తీస్తున్నారు." విసుక్కుంది అశ్విని.
"వాట్ డూయూ మీన్?" అసహనంగా చూస్తూ అడిగింది డాక్టరమ్మ.
"మీ 'డయోగ్నసిస్' తప్పంటున్నాను. ఇప్పట్లో నేను తల్లిని కాకూడదని, 'పిల్స్' వాడాను. అవికూడా ఆరోజు మీరే ఇచ్చారు" చెప్పిందామె.
ఈసారి షాకవటం డాక్టరు వంతైంది.
|