తాతా ధిత్తై తరిగిణతోం 55

తాతా ధిత్తై తరిగిణతోం 55

 

జీడిగుంట రామచంద్రమూర్తి

 

Get latest telugu famous comedy serials Taataadhithai tadiginatom, telugu serial comics and latest jokes online

 

"నాకు తెలుసో, తెలియదో పక్కన పెట్టండి అసలు మీరు వీళ్ళిద్దర్ని ఎందుకు అనుమానించారో ఆ విషయం చెప్పండి. అయినా ఊళ్లో అనేక చోట్ల తప్పుడు పనులు జరుగుతూంటే వాటిని పట్టించు కోకుండా ఈ 'స్టార్ హోటల్' పైన దాడి చేస్తారా? దిసీజ్ టూమచ్!" కోపంగా చూశాడు చిదంబరం ఇన్స్పెక్టరు వైపు.

"మేం దాడి చేయడం కాదు సార్. ఈ హోటల్ మేనేజరే మాకు రిపోర్టిచ్చాడు" అంటూ జరిగిన  విషయమంతా చెప్పి పేపరు ప్రకటన కూడా చూపించాడు ఇన్స్పెక్టరు.

"సరే! ఇప్పుడు ఆ పేపర్లో అమ్మాయీ, ఈ అమ్మాయీ ఒకరే కాదని నేను చెప్పాను కదా ఇక మీరు వెళ్ళిరండి."

"సారీసార్! సారీ ఫర్ ది ఇన్ కన్వీనియన్స్." అంటూ చిదంబరానికి, శ్రీరామ్ కీ చెప్పి కానిస్టేబుల్ తో సహా నిష్క్రమించాడు ఇన్స్పెక్టరు.

"అది సరే కానీ శ్రీరామ్ లబ్బీపేటలో మాకు లంకంత మేడ వుంటే మీరు బెజవాడవచ్చి అక్కడకు రాకుండా ఈ హోటల్లో బసచేయటం ఏమిటీ? ఈ విషయం మీ నాన్నకి నిన్నూ నన్నూ కలిపి తన బహుభాషా ప్రావీణ్యంతో ఉతికి ఆరేస్తాడు తెలుసా?" అక్కడున్న సోఫాలో కూర్చుంటూ మందలింపుగా చూస్తూ అన్నాడు చిదంబరం.

ఏమి బదులు చెప్పాలో అర్థంకాలేదు శ్రీరామ్ కి.

"అదికాదు బాబాయ్ గారూ ఏదో సరదాగా రెండు రోజులు ఇలా" అంటూ, అశ్విని కల్పించుకుని చెప్పబోయి మళ్లీ సిగ్గుపడి ఆగిపోయింది.

"అదిసరే. మీరు అసలీ వూరు ఏం పనిమీద వచ్చారూ...అని"

శ్రీరామ్ అశ్వినీ ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు.

చిదంబరం లాయర్ బుర్ర' కి విషయం బోధపడింది భళ్లున నవ్వేస్తూ అన్నాడు మళ్లీ.

"ఓకే! ఓకే!. అర్థమైపోయింది లెండి. ఏదో సరదాగా రెండ్రోజులు ఒంటరిగా అయ్ మీన్...'జంట'గా గడుపుదామని వచ్చారు. అవునా?"

విషయాన్ని వివరించక తప్పలేదు శ్రీరామ్ కి పెళ్ళయిన మర్నాడు తమ ఇంటికి స్వామీజీ ఎవరో వచ్చి తన తండ్రిని కలిసి మాట్లాడిన వైనం మొదలు తన తండ్రి తమపై విధించిన ఆంక్షల వరకూ అంతా పూస గుచ్చినట్టు చిదంబరానికి చెప్పేశాడు.

"సరే మీ హనీమూన్ మా ఇంట్లో జరుపుకుందురు గాని బయల్దేరండి. అన్నాడు చిదంబరం సోఫాలోంచి లేస్తూ.

"మీకెందుకు అంకుల్. ఇబ్బంది?" మొహమాట పడుతూ చెప్పాడు శ్రీరామ్.

"నాకేం ఇబ్బందిలేదు. నేనూ మీ ఆంటీ ఆనక హైదరాబాద్ వెడుతున్నాం. మళ్లీ ఎల్లుండి వస్తాం. అంతవరకూ మా ఇల్లు ఫ్రీ కమాన్ మై బాయ్" అంటూ వాళ్ళ బ్రీఫ్కేస్ అందుకున్నాడు చిదంబరం. పదినిమిషాల్లో వాళ్లెక్కిన కారు లబ్బీపేటలో చిదంబరం మేడ ముందు ఆగింది.

మరో అరగంటలో శ్రీరామ్, అశ్వినీ శోభనానికి అన్ని ఏర్పాట్లూ జరిగిపోయాయి.

*    *     *

విశాఖపట్నం వెడుతున్నట్టుగా, ఇంట్లో చెప్పి బెజవాడలో 'బ్రేక్ జర్నీ' చేసి అశ్వినితో 'హనీమూన్' పూర్తిచేసుకుని మూడోరోజు పొద్దున్నే ఇంటికి తిరిగి వచ్చిన శ్రీరామ్ తండ్రికి ఎలాంటి అనుమానం రాకుండా అన్ని జాగ్రత్తలూ తీసుకున్నాడు.

అశ్విని పుట్టినరోజు సందర్భంగా, బెజవాడ చందనాబ్రదర్స్ లో ఆమెకు కంచిపట్టుచీర కొనిపెట్టి పనిలో పనిగా, తనుకూడా పక్కనే వున్న 'రెడీమేడ్' షాపులో బట్టలు తీసుకున్నాడు. పెళ్లికి వెళ్ళినందుకు, విశాఖపట్నంలో తన ఫ్రెండు బట్టలు పెట్టాడని వాటినే తండ్రికి చూపించాడు బెజవాడ సూపర్ మార్కెట్లో కొన్న జీడిపప్పు పొట్లాన్ని తల్లిచేతిలో పెట్టి విశాఖపట్నంలో జీడిపప్పు 'చీప్' కదా అని తీసుకొచ్చాను' అని చెప్పాడు.

పుట్టింట్లో శ్రావణ శుక్రవారం నోము నోచుకున్నాక పదిరోజులకు అశ్విని కూడా తిరిగి వచ్చింది.

తల్లితండ్రుల్ని నమ్మించి పకడ్బందీగా తమ పథకాన్ని అమలు జరుపుకున్నందుకు శ్రీరామ్ హాయిగా ఊపిరిపీల్చుకున్నాడు.

మళ్లీ మాములుగా గడిచిపోతున్నాయి. బెజవాడలో మధురక్షణాల్ని మననం చేసుకుంటూ ఇంకో ఆర్నెల్లూ గడిపేస్తే స్వామీజీ విధించిన గడువు పూర్తయిపోతుంది అప్పుడిక మళ్ళీ ప్రతిరోజూ తమకు హనీమూనే అనుకున్నాడు శ్రీరామ్ పరవశంగా.

అయితే ఆ పరవశం, ఆ మధురాలోచనలూ అట్టే రోజులు నిలవలేదు. ఓ రోజు పొద్దున్న ముఖం కడుక్కుని కాఫీ తాగుతున్న అశ్వినికి హఠాత్తుగా కళ్ళు తిరుగినట్లనిపించింది. తూలిపడబోయి పక్కనున్న గోడ పట్టుకుని నిలదొక్కుకుని ఆ తర్వాత 'బాత్ రూం' లో వాంతి చేసుకుంది.

ఇదంతా చూసిన పార్వతమ్మ కంగారుపడిపోయింది. అప్పటికే వీరభద్రం, శ్రీరామ్ స్కూల్ కి వెళ్లిపోయారు టౌనుకెళ్లి ధ్యానం ఆడించుకు రావటానికి బస్తాల్ని బండిలోకి ఎక్కిస్తున్న నారాయణ కనిపించాడామెకు.