TeluguOne Services
Copyright © 2000 -
, TeluguOne - Comedy - All rights reserved.
తాతా ధిత్తై తరిగిణతోం 49
జీడిగుంట రామచంద్రమూర్తి
"అదేమిటీ అశ్వినీ! ఇప్పుడు నీ కళ్ళముందే వున్నానుగా?" అన్నాడు టీవీ వాల్యుం కొంచెం తగ్గించి.
"కళ్ళముందుండి ఏం లాభం? ఓ ముద్దూ ముచ్చటకి వీల్లేకుండా మీ నాన్నగారు 'పహారా' కాస్తూంటారుగా?" నిష్టూరంగా అడిగిందామె.
సరిగ్గా అదే సమయంలో హాల్లోకి వచ్చిన వీరభద్రానికి ఆ మాటలు వినిపించాయి.
"ఏమిటీ? నేను పహారా కాస్తుంటినా? అనగా నేను ఒక సిపాయివలె కన్పించుచున్నానా?" అడిగాడు తీవ్రమైన స్వరంతో.
"సిపాయిలు కూడా తమ కొడుకులు హాయిగా కాపురం చేసుకోవాలని కోరుకుంటారు." ఉక్రోషం అణుచుకుంటూ చెప్పింది అశ్విని.
'టీవీ' ఆఫ్ చేసి మావా కోడళ్ళ మధ్యకు వచ్చాడు శ్రీరామ్.
"అశ్వినీ పెద్దా చిన్నా లేకుండా ఏమిటీ ఆవాదన?" భార్యను మందలించబోయాడు ఇది వాదన కాదు యదార్థం. అయినా పూట గడవని వాడెవడో గడ్డాలూ, మీసాలు తగిలించుకుని, కషాయం చుట్టుకుని వస్తే ఆయన్నో పెద్ద 'స్వామిజీ' గా భావించి మర్యాదలు చేయటం, ఆయన మాటల్ని మూర్ఖంగా నమ్మేసి మనిద్దర్నీ వేరు చేయటం ఇవన్నీ నీకు బాగానే వున్నాయి." కళ్ళనీళ్ళు పెట్టుకుంది అశ్విని.
భార్యను మరి ఏమీ అనలేక శ్రీరామ్ తలవంచుకున్నాడు. తనను మూర్ఖుడిగా జమకట్టినందుకూ, మొగుణ్ణి 'నీకు' నువ్వు' అంటూ ఏకవచన ప్రయోగం చేస్తున్నండుకూ వీరభద్రం కోపంతో ఊగిపోయాడు.
"ఆహా ఏమి కాలవైపరిత్యం? భర్తను పేరుపెట్టి సంభోధించుటయే చాలాకా మామగారన్న గౌరము కూడా లేకుండా పోతున్నది." అన్నాడు కోపాన్ని నిగ్రహించుకుంటూ.
"ప్రేమా గౌరవాలు, మనం ఒకళ్ళకిచ్చినప్పుడే మనికిస్తారు మావయ్య గారూ. పెద్దవారిగా, మావగారిగా మీరంటే నాకు గౌరవమే కానీ మీ మూఢ నమ్మకాల్నీ చాదస్తాల్నీ నేను వ్యతిరేకిస్తున్నాను. మీ కట్టు బాట్ల మధ్య ఇక్కడ పంజరంలో పక్షి లాగా పడివుండటం కంటే మా ఊరు వెళ్లిపోవటమే మంచిదనిపిస్తోంది రేపే నేను వెళ్లిపోతాను. ఆ స్వామిజీ ఎవరో మళ్లీవచ్చి మీ అబ్బాయి నేనూ, ఎప్పుడు కలిసికాపురం చేయవచ్చునంటాడో చెప్తే అప్పుడే కబురు పెట్టండి. వస్తాను." అంటూ విసవిసా తన గదివైపు వెళ్ళబోయింది.
"ఆగండి. అన్నాడు వీరభద్రం కోపంగా ఆగిపోయి, వెనక్కి తిరిగి చూసిందామె.
"నువ్వు మీ ఊరు వెళ్ళుటకు నేనంగీకరించను" తీవ్రంగా చూస్తూ చెప్పాడు.
"పోనీ వెళ్ళనివ్వండి. కొన్నాళ్ళపాటు అక్కడ వుండి వస్తుంది.' ఈ గొడవంతా విని వంటింట్లోంచి హాల్లోకి వచ్చిన పార్వతమ్మ సలహా ఇచ్చింది.
"తమరి సలహాలు మేం కోరలేదు అయినా, అత్తవారింటికి వచ్చిన ఆడపిల్ల నాలుగు మాసాల్లోనే పుట్టింటికి వెళ్లిపోతే ఊరిప్రజలు వున్నవీ లేనివీ ఊహించుకుని మన పరువు ప్రతిష్టల్ని మంటలో కలిపెదరు తెలుసా?"
ఇప్పుడు శ్రీరామ్ కల్పించుకుంటూ అన్నాడు. "మీరు అనవసరంగా లేనిపోనివి ఊహించుకుంటున్నారు నాన్నా. అత్తావారింటికి వచ్చిన కొత్తకోడళ్లు పండగలకీ, పబ్బాలకీ, నోములకీ వ్రతాలకీ, పుట్టింటికీ వెళ్లటం సహజమే. ఇందులో ఊరి ప్రజలు ఊహించుకోవటానికీ, మన పరువు ప్రతిష్టలు పోవటానికీ ఏముందనీ?"
"అవును ఏమీ ఉండదు. పుట్టింటికి వెళ్లి పట్టుచీర పెట్టించుకుని పదిరోజుల్లో పదిహేనురోజుల్లో తిరగి వస్తే ఫర్వాలేదు కానీ నీ భార్యామణి మాటలు ఆ భావమును స్ఫురింపచేయటంలేదే?" మండిపడుతూ అడిగాడు వీరభద్రం.
"అవును. నేను ఆ భావం తో మాట్లాడలేదు." అశ్విని దృఢంగా శ్రీరామ్ వైపు చూస్తూ చెప్పింది మళ్లీ నీకు అర్థం కావటం కోసం సిగ్గు విడిచి మళ్లీ చెప్తున్నాను మన శోభనానికి మీ నాన్నగారు ముహూర్తం పెట్టించినప్పుడే మళ్లీవస్తాను అంతవరకూ మా ఇంట్లోనే వుంటాను."
"శ్రీరామ్ పరిస్థితి 'ముందు చూస్తే నుయ్యి వెనుక చూస్తే గొయ్యి అన్నట్టుగా వుంది. ఇంతలో వీరభద్రం కల్పించుకున్నాడు.
"చూడండి కోడలుగారూ మా మాట మన్నించకుండా తమరు ఈ ఇంటి గడప దాటితే మరుక్షణంలో మా లాయరు చిదంబరాన్ని కబురెడతాను. నెల రోజులు తిరిగేలోగా మా సుపుత్రుడి చేత నీకు విడాకులు విప్పించి నా చెల్లెలి కుమార్తె మెడలో తాళికట్టిస్తాను జాగ్రత్త." అంటూ హెచ్చరించి విసురుగా తన గదిలోకి వెళ్ళిపోయాడు.
ప్లాష్ బ్యాక్ సమాప్తి
అంతవరకూ అశ్విని చెప్పిన విషయమంతా సినీమాలో 'ప్లాష్ బ్యాక్' దృశ్యంగా విష్ణుమూర్తికి కళ్ళముందే కదిలినట్టుయింది రెండు క్షణాలు ఆలోచించి ఆ తర్వాత ఆమెతో చెప్పాడు.
"నువ్వు అనవసరంగా ఆవేశపడకుబేబీ. నువ్ నా ఆస్థికి వారసురాలివే అయినా ఆ ఇంటికి కోడలివి. పుట్టినింటికీ మెట్టినింటికీ కూడా పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలి."
మీ అమ్మే బ్రతికివుంటే ఇలాంటి సమయాల్లో నీకు తగిన సలహా ఇచ్చేదేమో? ఏది ఏమైనా ముల్లును ముల్లుతోనే తీయాలంటారు సమయస్పూర్తితో వ్యవహారాన్ని చక్కబెట్టుకోవాలి శ్రీరామ్ ని నువ్వెంతో గాఢంగా ప్రేమించి పెళ్ళిచేసుకున్న దానివి ఆటను కూడా నీ కోసం తండ్రిని ఎదిరించి తన దారికి తెచ్చుకున్నాడు అందుకని నువ్వు మీ ప్రేమని కాపాడుకోవాలి అర్థమైందా?
"ఒకే డాడీ." అంటూ సెల్ ఫోన్ ఆఫ్ చేసింది అశ్విని విష్ణుమూర్తి కూడా రిసీవర్ని బల్లమీద పెట్టేసి కుర్చీలో వెనక్కివాలి కళ్ళుమూసుకుని ఆలోచిస్తూండిపోయాడు.
|