తాతా ధిత్తై తరిగిణతోం 39

తాతా ధిత్తై తరిగిణతోం 39

 

జీడిగుంట రామచంద్రమూర్తి

 

Get latest telugu famous comedy serials Taataadhithai tadiginatom, telugu serial comics and latest jokes online

 

ఒకప్పుడు అధికార పక్షంలో కూర్చుని అరగంటకోసారి హామీలు గుప్పిస్తూ చట్టాలు చేసిన వాళ్ళు ఆ తర్వాతెప్పుడో ప్రతిపక్షానికి 'రివర్షయి' పోయి కుడి ఎడమైతే గ్రహపాటేనోయ్' అని కొత్త పాటలు పాడుకోక తప్పదు. 'ఓడలు బండ్లు బండ్లు ఓడలూ, అవుతాయని అనుభవజ్ఞులు అవివేకంతో చెప్పలేదు.

ఇప్పుడే వీరభద్రం పరిస్థితి అలాగే వుంది. ఒకనాడు కాళ్ళ దగ్గర పారేశాడు. ఇప్పుడు అదే 'సరుకు' కోసం కాళ్ళీడ్చుకుంటూ మరీ వచ్చాడు.

శ్రీరామ్ ని తన కూతురు గాఢంగా ప్రేమించిందనీ వాళ్ళిద్దరికీ పెళ్లి జరిపించి ఓ ఇంటి వాళ్ళను చేద్దామనీ ఆరోజు విష్ణుమూర్తి పనిగట్టుకొని తన ఇంటికొచ్చి ప్రాధేయపడ్డాడు. 'ప్రేమించటాలూ, కామించటాలూ తమ సంప్రదాయానికి విరుద్దమనీ' అసలు తన కొడుకు సాక్షాత్తు పురాణకాలం నాటి శ్రీరామచంద్రుడు లాంటి వాడనీ, తండ్రిమాట జవదాటడనీ పైగా 'ప్రేమ' అనే పదానికి అర్థం, తాత్పర్యం వగైరాలు తెలియవనీ ఎట్టి పరిస్థితుల్లోనూ తన కొడుక్కి వాళ్ళమ్మాయితో పెళ్లి జరగదనీ' విర్రవీగిపోతూ సమాధానం చెప్పాడు.

అంతటితో ఆగినా ఫర్వాలేకపోయేది.

"తను తల్చుకుంటే తన కూతురికీ అరగంటలో అమెరికా అల్లుణ్ణి కొనగలనని విష్ణుమూర్తి శపథం చేస్తే అమెరికాలో 'ఎయిడ్స్' రోగం తీవ్రంగా వుందనీ ఆ రాబోయే అమెరికా అల్లుడికి అలాంటిదేదైనా సంక్రమించి వుందేమో రక్తపరీక్ష చేయించి తెలుసుకొమ్మనీ, పెడసరాలు పోయాడు.

ఇప్పుడు కొడుకు చేసిన ప్రతిజ్ఞకీ చిదంబరం ఇచ్చిన సలహాకీ, అర్థంతరంగా వచ్చిన గుండెపోటుకీ తలవంచి విష్ణు మూర్తిని ఆశ్రయించేందుకు రాక తప్పలేదు వీరభద్రానికి మధ్యవర్తిగా వుండి మాట సాయం చేయటానికీ, వ్యవహారాన్ని సజావుగా నడిపించటానికీ చిదంబరాన్ని వెంట తెచ్చుకున్నాడు.

ఇద్దరూ విష్ణుమూర్తి బంగళాముందు టాక్సీ దిగి హాల్లో అడుగుపెట్టారు. అక్కడెవరూ కనిపించకపోయేసరికి గుమ్మంలోనే నిలబడిపోయారు. "ఏ నౌకరైనా హాల్లోకి రాక పోతాడా' అని చిదంబరం ఎదురు చూస్తూంటే మహారాజుల సభామందిరాన్ని తలపింప చేస్తున్న ఆ హాలు అందాన్ని విస్మయంగా గమనిస్తున్నాడు వీరభద్రం.

సరిగ్గా అదేసమయంలో మేడమీది బాల్కనీలోకి వచ్చిన అశ్విని వాళ్ళిద్దర్నీ చూసింది.

"రండి అంకుల్...కూచోండి." అంటూనే మెట్లుదిగి వచ్చింది.

అప్రయత్నంగా అటు తిరిగి ఇద్దరూ ఆమె వైపు చూశారు.

"మన శ్రీరామ్ ప్రేమించింది ఆ పిల్లనే అయ్యుంటుందిరా" అన్నాడు చిదంబరం వీరభద్రానికి మాత్రమే వినిపించేలా.

"కావచ్చును. చందమామంతటి ఎత్తు అందముగా వుండునని ఆ రోజు విష్ణుమూర్తి గారి వెంట వచ్చిన పెద్దమనిషి చెప్పివున్నాడు. ఈ పిల్ల అట్లే వుస్మయంగా చూస్తూనే చెప్పాడు వీరభద్రం.

"అది సరే! నువ్వు ఆ గ్రాంథికాన్ని కాసేపు మర్చిపోయి వ్యవహారికంలో వ్యవహరించు...లేకపోతే ఆ పిల్ల బెదిరిపోతుంది." నెమ్మదిగా హెచ్చరించాడు.

"అట్లే...అట్లే!"

"అదిగో..మళ్లీ!"

"సరే....సరే!"

"రాజుపాలెం నించే వస్తున్నారా అంకుల్?" వాళ్ళను చేరుకున్న అశ్విని అడిగింది చిరునవ్వుతో.

ఆ ప్రశ్న విని కొంచెం ఆశ్చర్యంగా చూశాడు అడిగాడు.

"తెలుసంకుల్! మీ అబ్బాయి తన మనీ పర్సులోంచి మీ ఫోటో ఓసారి తీసి చూపించాడు. అదీగాక, మీరూ ఈ చిదంబరం గారూ కలిఇస్ అక్కడ టాక్సీలో బయల్దేరగానే నాకు శ్రీరామ్ ఫోన్ చేసి చెప్పాడు." కొంచెం గర్వాన్నీ ఇంకొంచెం బిడియాన్ని ఒలకపోస్తూ బదులిచ్చిందామె. వీరభద్రం, చిదంబరం ఒకరికొకరు చూసుకున్నారు.

"ఈ కాలం పిల్లలు ఎంత 'ఫాస్టు'గా వుంటున్నారో చూశావా?" అన్నాడు చిదంబరం కనుబొమ్మలు ఎగరవేస్తూ...

"రండి...కూర్చోండి అంకుల్...మా డాడీని పిలుస్తాను." అంటూ లేడిపిల్లలా పక్కగదిలోకి పరుగెత్తింది అశ్విని.

అయినా కూర్చోవటానికి ధైర్యం చాలక అలాగే నిలబడిపోయాడు వీరభద్రం. ఆనాడు విష్ణుమూర్తి తన ఇంటి కొచ్చి కూర్చుంటే 'ముందక్కణ్ణించి లేవండి' అంటూ ఆయనపై మండిపడి, దారుణంగా అవమానించి తిప్పిపం పేసిన దృశ్యాన్ని తన మనోనేత్రాల ముందు మరోసారి ప్రదర్శించుకున్నాడు. ముఖం ముచ్చెమటలు పోశాయి.

పరిస్థితిని అర్థం చేసుకున్న చిదంబరం అతని భుజం తట్టి ధైర్యం చెప్పాడు."నువ్వు భయపడకురా భద్రం. ఆ విష్ణుమూర్తి నీ మీద హిరణ్య కశిపుడిలా విరుచుక పడకుండా నేను అడ్డం పడతాను. అయినా విషయాలన్నీ నేను మాట్లాడతానుగా...నువ్వు నిశ్చింతగా వుండు."

పైమీది కండువాతో ముఖానికి పట్టిన చెమటలు తుడుచుకున్నాడు వీరభద్రం. అంతలో పక్కగదిలోంచి విష్ణుమూర్తి రానేవచ్చాడు.

"అదేమిటీ అలా నిలబడే వున్నారు.? రండి కూచోండి." అంటూ వాళ్ళిద్దర్నీ సాదరంగా ఆహ్వానించాడు.

వీరభద్రానికి కొంచెం మనస్థిమితం కలిగింది.

"నమస్కారం!" అంటూ స్కూలు పిల్లాడిలాగా భయభక్తులతో చేతులు జోడించాడు. విష్ణుమూర్తి ప్రతినమస్కారం చేశాడు. అందరూ సోఫాల్లో స్థిరపడ్డారు.

"మీరు బయల్దేరి వస్తున్నట్లు మీ అబ్బాయి మా అమ్మాయికి ఫోన్ చేసి చెప్పాట్ట లేదంటే నేనే రావాలనుకున్నాను." మర్యాదపూర్వకంగా చూస్తూ వీరభద్రంతో అన్నాడు విష్ణుమూర్తి.

"ఆ మధ్య ఓసారి మీ అంతట మీరుగా ఈ 'ప్రపోజల్' తో వచ్చారు అప్పుడు మా భద్రం మూర్ఖంగా ప్రవర్తించి మీ మనసు నొప్పించాడు. అందుకే ఇప్పుడు స్వయంగా కలిసి మీ చేతులు పట్టుకుని క్షమాపణ చెప్పుకోవాలని వచ్చాడు."

పనిమనిషి అందించిన మంచినీళ్లు తాగి చెప్పాడు చిదంబరం.

"ఇంతకీ మీరు?" చిదంబరం వైపు ప్రశ్నార్థకంగా అడిగాడు విష్ణుమూర్తి.

"ఓ పరిచయం చేసుకోలేదు కదూ. సారీ నాపేరు చిదంబరం. వీడికి ఆత్మీయ మిత్రుణ్ణి. బెజవాడలో ప్రాక్టీసు చేస్తూంటాను. క్రిమినల్ లాయర్ని."

"చాలా సంతోషం." అంటూ అతనికి షేక్ హ్యాండిచ్చాడు విష్ణుమూర్తి.

మరి కాసేపటికి కాఫీ ఫలహారాలు పూర్తయ్యాయి.

"విధి ఎంత చిత్రమైందో చూశారా చిదంబరంగారూ. వీరభద్రంగారేమో వారి సుపుత్రుడికి వారి మేనకోడల్నిచ్చి పెళ్ళి జరిపించాలనుకున్నారు నేనేమో, మొన్నీ, మధ్యనే అమెరికా నించి వచ్చిన మా మేనల్లుడికి మా బెబీనిచ్చి చెయ్యాలనుకున్నాను. చివరకు మేమిద్దరం దారుణంగా ఫెలయ్యాం." మాటల మధ్యలో చిదంబరానికి చెప్పాడు విష్ణుమూర్తి.

"మొత్తానికి వాళ్ళిద్దరూ ప్యాసయ్యారుగా అది చాలు మనికి."

"మరి ఆలస్యం దేనికీ? తొందరలోనే ముహూర్తం పెట్టించండి ఇక కట్నకానుకల విషయం అంటారా మీరు ఎలా చెప్తే అలా జరిపిస్తాను."

"అబ్బే అలాంటివాటి ప్రస్తావన మావాడి దగ్గర తీసుకురాకండి మండిపడతాడు మీకు తెలీదేమో మా భద్రుడు జిల్లా మావల సంఘానికి అధ్యక్షుడు. వాళ్ళ సంఘం కట్టుబాట్లు ప్రకారం కట్నాలు ఇవ్వటంకాని, పుచ్చుకోవటం గాని ఘోరమైన నేరు." చెప్పాడు చిదంబరం.

"అయినా ఆడపిల్ల తండ్రిగా నా బాధ్యత నేను నిర్వర్తించాలి కదా.? మీకు తెలుసు. మా బీబీ నాకు ఒక్కతే సంతానం. చిన్నప్పుడే వాళ్ళమ్మ చనిపోతే దానికి తల్లిని కూడా నేనే అయి పెంచాను. రేపు నా తర్వాత...ఈ బంగళా, నా వ్యాపారం, నా ఆస్తిపాస్తులూ అన్నీదానికే చెందుతాయి. ఇకపోతే అంటూ చెప్పబోతున్న విష్ణుమూర్తిని వారిస్తూ మధ్యలోనే కల్పించుకున్నాడు వీరభద్రం.