తాతా ధిత్తై తరిగిణతోం 40

తాతా ధిత్తై తరిగిణతోం 40

 

జీడిగుంట రామచంద్రమూర్తి

 

Get latest telugu famous comedy serials Taataadhithai tadiginatom, telugu serial comics and latest jokes online

 

"ఇంక చాలింపుడు. మాది రావుబహుద్దర్ల వంశం మా తాత ముత్తాతల నాటి ఆస్తీ ఐశ్వర్యములు అంతగా మిగలకపోయినా అన్నవస్త్రాలకు కొదువలేదు. మా సుపుత్రుడు కూడా చదువుసంధ్యలు నేర్చుకున్నవాడు. స్వాభిమానాన్ని మరింతగా కూర్చుకున్నవాడు. ఏదో ఒక ఉద్యోగమున చేరి తన అర్థాంగిని సుఖపెట్టగలుగుతాడు. మీ భోగభాగ్యాలతో వానికి పనిలేదు. కనుక ఆ విషయమును మీరిక పక్కనపెట్టి కళ్యాణ మహోత్సవానికి ఏర్పాట్లు ప్రారంభించండి. మేం మా పురోహితుల్ని సంప్రదించి త్వరలోనే ముహూర్తాన్ని నిశ్చయింపచేసి మీకు తెలియపరుస్తాం." అంటూ లేచాడు.

అతని భాషా ధోరణికి విష్ణుమూర్తి విస్తు పోతాడేమోనని చిదంబరం కొంచెం భయపడ్డాడు.

అయితే అంతకు ముందే ఆ వింతధోరణితో పరిచయం వున్న విష్ణుమూర్తి యధాలాపంగా నవ్వేసి మర్యాదపూర్వకంగా తాను కూడా సోఫాలోంచి లేచి నిలబడ్డాడు.

"అన్నట్టు ఎల్లుండి ఏకాదశీ గురువారం. మా అల్లుణ్ణి అయ్ మీన్ మీ అబ్బాయిని ఓసారి పంపించండి. అతనూ మా అమ్మాయీ కలిసి షాపింగ్ కి వెళ్ళొస్తారు." అన్నాడు.

"అట్లే కానిండు" అన్నాడు వీరభద్రం.

అతని గ్రాంథిక భాష అట్లాగే కొనసాగితే విష్ణుమూర్తి ఎక్కడ చిరాకుపడి మనసు మార్చుకుంటాడోనన్న భయంతో పక్కనే వున్న చిదంబరం, అతని చేతి మీద చిన్నగా గిల్లాడు.

విషయం అర్థంచేసుకున్న వీరభద్రం సర్దుకుని మామూలు ధోరణిలో విష్ణుమూర్తికి మళ్లీ చెప్పాడు.

"అలాగే కానివ్వండి. మా వాణ్ణి ఎల్లుండి తప్పకుండా పంపిస్తాను."

ఆ తర్వాత ఆయన దగ్గర శలవు తీసుకుని ఇద్దరూ టాక్సీ ఎక్కారు.

మేడమీద వున్న తన గదిలోంచి బయటకొచ్చి బాల్కానీలో చాటుగా నిలబడి అంతవరకూ వాళ్ళ మాటలన్నీ విన్న గోపాలానికి ఏదో ఆలోచన వచ్చింది.

*           *         *

పెళ్లిలో అశ్విని ఏ చీరలు కట్టుకుంటే అద్భుతంగా కనిపిస్తుందో ఆ చీరల్ని శ్రీరామ్ ఎంపిక చేశాడు.

'రిసెప్షన్'లో ఏ సూటు వేసుకుంటే శ్రీరామ్ అందంగా కనిపిస్తాడో ఆ సూటుని అశ్విని సెలక్ట్ చేసింది.

ఆ తర్వాత నగల దుకాణంలోకి వెళ్లి శ్రీరామ్ కోసం డైమండ్ ఉంగరాన్ని తన కోసం నెక్లెస్సూ, గాజులూ తీసుకుంది.

షాపింగ్ పూర్తయ్యాక ఐస్ పార్లర్ లో ఐస్ క్రీం తిన్నారు. ఆ తర్వాత మొదటాట సినీమా చూశారు. సినీమా వదిలింతర్వాత హోటల్లో డిన్నర్ కూడా పూర్తిచేసుకుని కారెక్కారు.

రోడ్లు నిర్మానుష్యంగా వున్నాయి. అందుకే డ్రైవర్ కారుని వేగంగా పోనిస్తున్నాడు.

"అంత స్పీడెందుకూ? నెమ్మదిగా పోనీయ్..ఫరవాలేదు." శ్రీరామ్ ఛాతిపై తలపెట్టుకుని తన్మయంలో వున్న అశ్విని డ్రైవర్ని హెచ్చరించింది.

కారువేగం తగ్గింది.

కొంచెం దూరంలో కారునే అనుసరించి వస్తున్న మోటారుసైకిళ్ల వేగం మాత్రం తగ్గలేదు.

'సైడ్ మిర్రర్' లోంచి అప్రయత్నంగా వాటిని చూసిన డ్రైవర్ కొంచెం గాభరాగా అన్నాడు.

"మధ్యాహ్నం మనం ఇంటిదగ్గరనించి బయల్దేరినప్పట్నుంచీ మన కారుని? ఎవరో ఫాలో అవుతున్నారు మేడం."

"ఫాలో అవుతున్నారా?" ఆశ్చర్యంగా చూస్తూ అడిగింది.

"యస్ మేడం. అప్పుడు నేను అంతగా పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు కూడా మోటారు సైకిళ్ల మీద వాళ్లే మన కారుని వెంబడిస్తున్నారు. చూడండి." సైడ్ మిర్రర్లో చూస్తూనే చెప్పాడతను.

కొంచెం ఉలికిపాటుతో అశ్విని వెనక్కి చూసింది.

తమ కారునే వెంబడిస్తూ వస్తున్న ఆ రెండు మోటారు సైకిళ్ల మీదా నలుగురున్నారు. అసలే చీకటి పైగా హెల్మెట్లు పెట్టుకున్నారు. అందుకే వాళ్ళ ముఖాలు కనిపించడం లేదు.

"వాళ్లెవరో రౌడీల్లాగా వున్నారు శ్రీరామ్" భయంగా చూస్తూ చెప్పింది అశ్విని.

శ్రీరామ్ వెనక్కి తిరిగి చూసేలోగానే మోటారు సైకిళ్ళు దూసుకుంటూ ముందుకొచ్చి కారుకి అడ్డంగా నిలబడ్డాయి.

కారు సడెన్ బ్రేకుతో కీచుమని శబ్దం చేస్తూ ఆగింది.

"మనం నగలు కొనటం వాళ్లు చూసుండాలి. వాటి కోసమే వెంట పడుతున్నారు." అన్నాడు శ్రీరామ్.

"ఇప్పుడెలా?" సెల్ ఫోనుందిగా మీ డాడీకి ఫోన్ చేస్తాను. పోలీసుల్ని తీసుకొస్తారు. జేబులోంచి ఖంగారుగా ఫోను బయటకు తీస్తూ చెప్పాడు శ్రీరామ్.

సర్లే నువ్ ఫోన్ చేసి ఆయనగారు పోలీసులతో వచ్చేసరికి ఇక్కడ వీళ్లు మనభరతం పట్టేస్తారు. ఎలా వున్నారో చూడు ఇందాక మనం చూసిన సినీమాలో విలన్లలాగా." మోటారు సైకిళ్లకు స్టాండు వేసి కారు దగ్గరకు వస్తున్న ఆ రౌడీలను చూస్తూ అతని భుజాన్ని భయంతో గట్టిగా పట్టుకుంది.

అప్పుడు అతని చొక్కా లోపల దండకు కట్టుకున్న 'తాయెత్తు' ఆమె చేతికి తగిలింది వెంటనే ఉత్సాహంగా చెప్పింది.

"వెరీగుడ్ రసూల్ బాబా ఆరోజున ఇచ్చిన తాయెత్తు నీ చేతికి వుండగా మనకేం భయంలేదు."

దాన్ని తాను కూడా తడిమి చూసుకున్నాడు శ్రీరామ్. ఒక్కసారిగా వెయ్యేనుగుల బలం ఏదో అతని ఒంట్లోకి విద్యుత్తులాగా వ్యాపించినట్లనిపించింది.

"యస్ ఆ రోజు రోడ్డుమీద నన్ను రౌడీలు కొట్టబోతే ఆడపిల్లవి నువ్వే ఈ తాయెత్తు మహాత్యమ్తో వాళ్ళను మట్టి కరిపించావ్. ఇప్పుడు నీకు సాయం నేను కూడా వున్నాను. కమాన్ ఇద్దరం కల్సి వాళ్ళను ఓ ఆట ఆదిద్దాం." అంటూ కారు డోరు తెరిచాడు.

"కానీ నేను మొన్ననే మెడలోంచి నా తాయెత్తు తీసేశాను. ఎలా?" భయంగా చూస్తూ అడిగింది.

"తీసేశావా. అయ్యో ఎందుకు తీసేశావ్.? 

"దాన్ని స్థానంలో నువ్వు పవిత్రమైన మంగళ సూత్రాన్ని కట్టబోతున్నావ్ కదా అని. నువ్వు నా పక్క నుంటే ఇంక నాకు భయమెందుకు? అందుకే తీసేశాను. అయినా నీ చేతికి వుందిగా భయంలేదు నీకు సాయంగా మా డ్రైవర్ కూడా వున్నాడు వాళ్ళ అంతు చూసెయ్. ఈ లోగా నేను మా 'డాడీ' కి ఫోన్ చేస్తాను." అంటూ అతని చేతిలో వున్న సెల్ ఫోన్ తీసుకుంది అశ్విని.

శ్రీరామ్ కారుదిగి నిలబడ్డాడు.

వాళ్లు నలుగురూ 'స్లోమేషన్' లో అతని వైపు వస్తున్నారు.

శ్రీరామ్ చొక్కా చేతులు మడత పెట్టి ఫైటింగ్'కి రెడీ అయ్యాడు.