తాతా ధిత్తై తరిగిణతోం 32

తాతా ధిత్తై తరిగిణతోం 32

 

జీడిగుంట రామచంద్రమూర్తి

 

Get latest telugu famous comedy serials Taataadhithai tadiginatom, telugu serial comics and latest jokes online

 

"అయినా 'ప్రేమ' అనేది పాలపొంగులాంటిదమ్మా గిన్నెలో పాలు మరిగిపోతే ఒక్కసారిగా అన్ని పొంగి పోర్లిపోతాయి. ఆ తర్వాత, తక్కినవి గిన్నెలోనే అడుక్కి వెళ్ళిపోతాయి. ప్రేమ కూడా అంతే ఈ వయసులో పిల్లలు చాలామంది 'ప్రేమ' అనుకుంటూ 'ఆకర్షణ'కు లోనవుతారు ఆ ఆకర్షణ కారణంగానే ఒకర్ని చూడకుండా మరొకరు వుండలేకపోతారు కానీ వాళ్ళ మధ్య విధివశాత్తూ కొంతకాలం ఎడబాటు కలిగిందే అనుకో అప్పుడిక ఆ ప్రేమలూ, ఆకర్షణలూ అన్నీ మరుగున పడిపోతాయి.  అంటూ హితబోధ చేశాడు కృష్ణమూర్తి.

ఆ మాటలు అశ్వినికి రుచించలేదు.

"పొరపాటు డాడీ. ఎడబాట'నేది విరహానికి దారితీస్తుంది. ఆ విరహం ప్రేమను మరింతగా పెంచుదుందే తప్ప మరుగునపరచదు. శ్రీరామ్ ని నేనిప్పుడు ప్రేమించటమె కాదు ఆరాధిస్తున్నాను కూడా" దృఢమైన స్వరంతో చెప్పింది.

విష్ణుమూర్తిలో సహనం నశించిపోయింది ఆమె పక్కనుంచి చివాల్న లేచాడు.

"అసలు నువ్వు ఆ శ్రీరామ్ నామజపాన్ని ఎందుకు చేస్తున్నావో నాకర్థం కావటం లేదు ఏ విషయంలోనూ అతను నీకు తగినవాడు కాడు వాళ్ల ఊరో పల్లెటూరు అతని తండ్రేమో పరమ మూర్ఖుడు. వాళ్ళ తాతలు నేతులు తాగినవాళ్లే కావచ్చు కానీ వీళ్ళ మూతులకు ఆ వాసన కూడా అంటలేదు చెప్పుకోవటానికి పూర్వవైభావాలే తప్ప ఇప్పుడనుభవించేందుకు ఆస్తిపాస్తులేం మిగల్లేదు వాళ్లకి ఆ మాట విన్న అశ్విని చురుక్కున తండ్రి వైపు చూసింది.

"ఆస్తి పాస్తులూ భోగభాగ్యాలూ వున్నంత మాత్రాన మనిషికి సుఖసంతోషాలుంటాయని నమ్ముతున్నావా డాడీ. సూటిగా అడిగింది.

"అఫ్ కోర్స్ నేను కూడా ముందు అలాగే ఆలోచించాను. ఆ భోగభాగ్యాలు వాళ్లకి లేకపోయినా మనకున్నాయి కదా అని సరిపెట్టుకున్నాను కానీ, నేను వాళ్లింటికి వెళ్లి ఆ చాదస్తం మనిషితో మాట్లాడిం తర్వాత ఆ ఇంటికి కోడలుగా నువ్వు సుఖపడలేవని గ్రహించాను పైగా నీకు కాబోయే భర్తను ఆ భగవంతుడు ఏనాడో నిర్ణయించి వుంచాడు బేబీ. ఇప్పుడు సమయం వచ్చింది కనుకనే అతన్ని నేరుగా మనింటికి పంపించాడు చెప్పాడు విష్ణుమూర్తి.

అశ్వినికి బోధపడలేదు

"అమెరికాలో నీకొక మేనమామ వున్నాడని అప్పుడప్పుడు చెప్పేవాణ్ణి గుర్తుందా? అడిగాడు వెంటనే. గుర్తుతెచ్చుకునే ప్రయత్నం చేస్తోంది అశ్విని.

"పోనీ ఇప్పుడు మళ్ళీ చెప్తాను విను! మీ అమ్మకు స్వయాన అన్నయ్య నువ్ ఎరగవ్ లే! అతగాడు అమెరికా వెళ్ళిపోయి పాతికేళ్ళయి పోయింది అతనికో కొడుకున్నాడు పేరు గోపాలం. ఇవాళ ఆ తండ్రీ కొడుకు లిద్దరూ హైదరాబాద్ లో విమానం దిగి టాక్సీలో సరాసరి మనింటికి వచ్చారు. అశ్విని వింటోంది.

విష్ణుమూర్తి ఇంకా చెప్తున్నాడు.

"గోపాలాన్ని చూశాను బేబీ. శ్రీరామ్ కంటే బావున్నాడు పైగా ఎమ్ బి ఏ చదివాడు నిన్ను అతనికిచ్చి చేస్తే మున్ముందు నా బిజినెస్ వ్యవహారాలన్నీ సమర్థవంతంగా చూసుకుంటాడు. నేనింక రెస్ట్ తీసుకోవచ్చు అలా జరిగితే పైనున్న మీ అమ్మ ఆత్మ కూడా సంతోషిస్తుంది."

తండ్రి మాటలు ఆమెకు వినిపించడం లేదు.

"నీక్కావాలంటే ఆ బిజినెస్ వ్యవహారాల్నీ, ఆస్తి, ఐశ్వర్యాన్ని అన్నింటినీ కలిపి ఆ గోపాలానికో, గోవిందానికో ఇచ్చుకో.. నాకు అభ్యంతరం లేదు కానీ, నేను మాత్రం శ్రీరామ్ తో తప్ప వేరే మగాడితో తాళి కట్టించుకోను!" మొండిగా చెప్పిందామె.

విష్ణుమూర్తి కి ఒళ్ళు మండిపోయింది.

"అదే నీ చివరిమాటా?" అడిగాడు.

"అవును!"

"అయితే నా ఆఖరిమాట కూడా విను! ఎంతో అపురూపంగా పెంచుకున్న నిన్ను ఆ పిచ్చివాడింటి కోడలుగా పంపను గాక పంపను. వారం రోజుల్లోగా, ముహూర్తం ఎప్పుడంటే అప్పుడు నిన్ను ఆ గోపాలానికిచ్చి, పెళ్ళి జరిపిస్తాను సిద్ధంగా వుండు. అంటూ హెచ్చరించి విసావిసా బయటకు వెళ్ళిపోయాడు విష్ణుమూర్తి. 

పెల్లుబికి వస్తున్న దుఃఖాన్ని ఆపుకోలేక నిస్సహాయంగా మంచంపై వాలిపోయి దిండులో తలదాచుకుని ఏడుస్తూ వుండిపోయింది అశ్విని.

కొన్ని నిమిషాల తర్వాత పక్కనే బల్లమీదున్న సెల్ ఫోన్ రింగవటంతో దాన్ని అందుకుని అందులో కనిపిస్తున్న నంబరు చూసింది. వెంటనే ఆమె గుండెల్లో బరువంతా తీరిపోయి మనసు తెలికైనంతగా ఆహ్లాదం నిండిపోయింది.

అది శ్రీరామ్ నంబరు.

పరీక్షలు రాసి అతను వాళ్ళ ఊరువెళ్లిపోతూంటే అప్పుడప్పుడు ఫోన్ చేస్తూండమని  తనే అతనికి 'సెల్ ఫోన్' కొని బహుమతిగా ఇచ్చింది అందుకే ఆ నంబరు ఆమెకు బాగా గుర్తుండిపోయింది.

వెంటనే ఫోన్ బటన్ నొక్కి 'హలో' అంది.

"అశ్విని నేనే శ్రీరామ్ ని" అవతల్నించి వినిపించిన అతని గొంతు మధుర స్వరాలెన్నింటినో వినిపించింది.

"చెప్పు శ్రీరామ్. ఎలా వున్నావ్? ఏమిటి విశేషాలు?" ఉత్సాహాన్ని తెచ్చిపెట్టుకుంటూ అడిగింది అశ్విని.

"మా నాన్నగారు మన పెళ్ళికి ఒప్పుకున్నారు." శ్రీరామ్ మాటల్లో సంతోషం ధ్వనించింది. ఆ సంతోషాన్ని అశ్విని వెంటనే స్పందించలేకపోయింది.

ఒకప్పుడు శ్రీరామ్ పెళ్లికి తన తండ్రి ఒప్పుకుంటే ఆ చాదస్తం మాస్టారు వీల్లెదన్నాడు. ఇప్పుడు ఆయన అంగీకరిస్తే తన డాడీ ససేమిరా అంటున్నాడు."ఏమిటి అశ్విని ఇంత శుభవార్త చెప్తే ఫోన్లోనే ముద్దుల వర్షం కురిపించేస్తావనుకున్నాను. అలా మౌనంగా వుండిపోయావేమిటి? అసలు నేనే స్వయంగా మీ ఊరొచ్చి ఈ శుభవార్త నీకు చెప్పాలనుకున్నాను. మీ డాడీతో మాట్లాడిముహూర్తాలు పెట్టించటానికి మానాన్నగారు ఎలాగా రెండు మూడు రోజుల్లో మీ ఇంటికి బయల్దేరి వస్తానన్నారు. ఏకంగా ఎంగేజ్ మెంట్ కే రావచ్చునని ఊరుకున్నా. అయినా విరహంలో కూడా సుఖం వుంటుంది కదా?..అంతవరకూ ఆ సుఖాన్ని అనుభవిస్తూ కలల్లో నిన్నే చూస్తూ అలా శ్రీరామ్ ఫోన్లో ఏమిటేమిటో సంబరంగా మాట్లాడేస్తున్నాడు.

అశ్విని వింటూ వుండిపోయింది.

"అశ్విని వింటున్నావా?" పరధ్యానంలో వున్నా ఉత్సాహాన్ని ప్రదర్శించింది.

"ఇంక ఇప్పుడు చెప్పటానికేం లేదు...నీ మెడలో అర్జంటుగా తాళికట్టి నిన్ను నా దాన్నిగా చేసుకోవటమే" ఆ తర్వాత ఇద్దరం ఏకాంతంలో కూర్చుని ఎన్నెన్నో మాటలు చెప్పుకోవచ్చు. అంతవరకూ వెయిట్ చేస్తూండు వుంటా...బై."

అవతల 'ఫోన్' కట్టయింది.

అశ్విని కూడా తన 'సెల్ ఫోన్' ఆఫ్ చేసి మళ్ళీ ఆలోచనల్లోకి వెళ్ళిపోయింది.

ఒకవైపు సంతోషం...మరోవైపు సందేహం ఆమె మనసును అల్లకల్లోలం చేస్తున్నాయి. రేపెప్పుడో మంచిరోజు చూసుకుని శ్రీరామ్ తండ్రి ఇంటికొస్తాడు. ఒకప్పుడు తనను అవమానం చేశాడన్న ప్రతీకారంతో ఇప్పుడు తన డాడీ కూడా ఆయన్ని అవమానం చేసి పంపిస్తే?

ఆ ఆలోచనలు అశ్విని అంతరంగాన్ని కలవరపరిచాయి. ఎంతోసేపు ఆలోచించి చివరకు ఓ నిర్ణయానికొచ్చింది.

*            *          *

ఆ రాత్రి మేడమీద గదిలో కూర్చుని హనుమంతూ, గోపాలం మందు కొడుతున్నారు. "నీ మావయ్య కూతుర్ని చూశావా?" రెండు పెగ్గులు గొంతు దిగిం తర్వాత గ్లాసులో మరో పెగ్గు పోసుకుంటూ కొడుకుని అడిగాడు హనుమంతు. 

"చూశాను చాలా బావుంది పేరు అశ్వినిట. పనిమనిషి చెప్పింది."

ఆ మాట విన్న హనుమంతు కొడుకువైపు కొంచెం చిరాగ్గా చూశాడు. "పనిమనషుల్తో మాట్లాడి 'చీపై' పోకు? అశ్వినితో పరిచయాన్ని పెంచుకో...అప్పుడప్పుడూ తనతో ఏ హోటల్ కో వెళ్లి వస్తూండు." సిగరెట్టు వెలిగించుకుని చెప్పాడు.

"వెళ్లాలని నాకు ఉంది. కానీ అశ్విని తన గది విడిచి పెట్టి బయటకు రావటం లేదు ఇందాక, తనతో మాట్లాడదామని అటువెళ్లేసరికి మావయ్య లోపలున్నాడు. ఇద్దరూ ఘర్షణ పడుతున్నాడు."

"ఘర్షణా? దేనిగురించీ?" ఆత్రంగా అడిగాడు హనుమంతు.