తాతా ధిత్తై తరిగిణతోం 33

తాతా ధిత్తై తరిగిణతోం 33

 

జీడిగుంట రామచంద్రమూర్తి

 

Get latest telugu famous comedy serials Taataadhithai tadiginatom, telugu serial comics and latest jokes online

 

"పెళ్ళి గురించే! తాను ఎవర్నో ప్రేమించి నట్టుంది. వాణ్ణే చేసుకుంటానంటూ మొండిగా మాట్లాడుతూంటే మావయ్య మండిపడ్డాడు.ఏమైనాసరే నీ పెళ్లి గోపాలంతోనే జరిపిస్తాను అంటూ మావయ్య తెగేసి చెప్పటం కూడా విన్నాను." గోపాలం చెప్పాడు.

"అయితే మన పని సులువైపోయినట్టే మొత్తానికి మనం అనుకున్నది అనుకున్నట్టుగా జరుగుతోంది.'బిజినెస్'లో మీ మావయ్య బాగా సంపాదించాడు కనుక నీకేదో దారి చూపించక పోతాడా' అని వచ్చినందుకు ఫలితం దక్కింది. ఏకంగా నిన్ను తాను ఇంటల్లుడుగా చేసుకుంటున్నాడు. ఇక మనం వేషాలు. మోసాలు మానేసి దర్జాగా బతికేయవచ్చు." తృప్తిగా నిట్టూర్చాడు హనుమంతు.

"మనం అమెరికా నించి కాకుండా హైదరాబాదు జైలునుంచి బయటపడి, ఇలా వచ్చినట్టు రేప్పెప్పుడైనా మావయ్యకి తెలిస్తే?"

"తెలియకుండా జాగ్రత్తపడాలి. ఎలాగో అలా అశ్వినితో నీ పెళ్లి త్వరగా జరిగిపోతే ఆ తర్వాత మన గురించి ఏం తెలిసినా ప్రమాదం వుండదు." అప్పటికీ అల్లుదివైపోతావ్ కనక నిన్ను తనే కంటికి రెప్పలా కాపాడుకుంటాడు." కొడుకు భుజం తట్టి మరీ చెప్పాడు హనుమంతు.

ఆ మాటలు విన్న గోపాలానికి గొప్ప ధైర్యం వచ్చింది. తను కూడా గ్లాసులో మరో పెగ్గు మందు పోసుకున్నాడు.

సరిగ్గాఅదే సమయంలో

అశ్విని, తన తండ్రి గదిలో వున్న 'షెల్ఫ్' లోంచి నిద్ర మాత్రలు సీసా తెచ్చుకుని అందులో వున్న మాత్రలన్నింటినీ చేతిలో పోసుకుంది.

*          *         *

ఉదయం ఎనిమిది గంటలవేళ....

హాల్లో వున్న సోఫాలో కూర్చుని కాఫీ తాగుతూ 'టీవీ' ఛానల్ లో వస్తున్న వార్తలు చూస్తున్నాడు విష్ణుమూర్తి.

"ఏమిటి ఆఫీసు విశేషాలు?"

"మన విశాఖపట్నం 'బ్రాంచ్' కి లెటర్ పెట్టాను సార్....అలాగే బెంగుళూరు కాంట్రాక్ట్ కి నిన్న టెండర్ వేశాను." చెప్పాడు కామేశం వినయంగా.

అయిదు నిమిషాల్లో ఫైల్సన్నీ చూసి సంతకాలు చేశాడు విష్ణుమూర్తి.

వాటిని తీసుకుని, తిరిగి వెళ్ళిపోతున్న కామేశాన్ని వెనక్కి పిలిచాడు కామేశం ఆగిపోయాడు.

"అమెరికా నించి మా మేనల్లుడు గోపాలం వచ్చాడని చెప్పాను గుర్తుందా? అడిగాడు విష్ణుమూర్తి. 

గుర్తున్నట్టు తలూపేసాడతను.

"రేపట్నుంచీ అతను మన 'కంపెనీ ఆఫీసు'కి వస్తాడు. ఇక నుంచీ అక్కడి వ్యవహారాలన్నీ అతనే చూసుకోవాల్సి వస్తుంది. అయ్ మీన్ మా బేబీని అతనికిచ్చి పెళ్లి చేస్తే అమ్మాయి బాధ్యతతో పాటు, ఆస్తి పాస్తుల సంరక్షణ కూడా అతనే చూసుకోవాలి గదా."

కామేశానికి విషయంలో బోధపడింది.

"వెరీగుడ్ సార్. అయితే అమ్మాయిగారు మేరేజ్ చేసేస్తున్నారన్న మాట. కంగ్రాచ్యులేషన్స్" తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు.

"మీకు తెలిసిన పంతులు ఎవరైనా వుంటే అర్జంటుగా పిలిపించండి...ముహూర్తం పెట్టించాలి." చెప్పాడు విష్ణుమూర్తి.

సరిగ్గా అదే క్షణమో మీడమీద నించి "బాబుగారు" అనే కేక వినిపించింది.

ఇద్దరూ ఉలికిపాటుతో పైకి చూశారు.

"అమ్మాయి గారు పిలిచినా పలకటం లేదు. తొందరగా రండి బాబూ. గాభరాగా చూస్తూ పైనించే చెప్పింది పనిమనిషి.

పరుగులాంటి నడకతో మెట్లెక్కి అశ్విని గదిలోకి చేరుకున్నాడు విష్ణుమూర్తి.

చేతులు క్రిందికి వ్రేలాడుతుంటే మంచం మీద అస్తవ్యస్తంగా అచేతనంగా పడికుని వున్న అశ్విని వైపు దిగ్భ్రాంతిగా భయంగా చూశాడు.

"బేబీ" అంటూ ఆమె దగ్గరగా చేరి. భుజాల్ని కుదిపేడు. అయినా ఆమెలో ఎటువంటి చలనం లేకపోయింది.

విష్ణుమూర్తి మనసు కీడును శంకించింది.

"కామేశం త్వరగా వెళ్లి డాక్టర్ని తీసుకురా!" అరిచాడు.

అదే క్షణంలో మంచం పక్కనే పడివున్న కాగితాన్ని చూసిన పనిమనిషి దాన్ని తీసి విష్ణుమూర్తికి అందిస్తూ చెప్పింది.

"ఈ కాగితంలో ఏమిటో చూడండయ్యా! అమ్మాయి గారు రాసినట్టే వుంది." ఆ కాగితంలోకి ఆత్రంగా చూశాడు విష్ణుమూర్తి.

అది అశ్విని రాసిన ఉత్తరం గబగబా చదువుకున్నాడు.

"డాడీ''

నువ్వు నన్నెంత  గారాబంగా పెంచేవో నాకు తెలుసు. నేనంటే నీకు పంచప్రాణాలని కూడా తెలుసు ప్రతి క్షణం నా శ్రేయస్సునే కోరుకునే నువ్వు గోపాలాన్ని పెళ్ళి చేసుకోమంటున్నావంటే అదీ నా సుఖం కోసమేనని అర్థం చేసుకోగలను. కానీ, నేను మనసు మార్చుకోలేక పోతున్నాను డాడీ. ఎంత ప్రయత్నించినా 'శ్రీరామ్' నించి నా మనసును మరల్చుకోలేకపోతున్నాను కళ్ళు మూసినా తెరిచినా అతని రూపమే నా ముందు నిలుస్తోంది. అతన్ని కాకుండా వేరెవర్ని కట్టుకున్నా వాళ్ళని నేను సుఖపెట్టలేననిపిస్తుంది. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను నువ్వు నిద్ర కోసం రోజుకోసారి వేసుకునే మాత్రల్ని శాశ్వత నిద్రకోసం, అన్నింటినీ నేను ఒకేసారి వేసుకున్నాను. నీ మనసు కష్టపెట్టినందుకు నన్ను మన్నించు వచ్చే జన్మలో కూడా నీకే కూతురుగా పుట్టాలని ఆ భగవంతుణ్ణి ప్రార్ధిస్తున్నాను...నీ బేబీ."

ఉత్తరం చదువుకున్న విష్ణుమూర్తి కళ్ళల్లోకి కన్నీరు చిమ్ముకొచ్చింది. అతని పరిస్థితిని గమనించిన పనిమనిషి గాభరాగా అడిగింది.