TeluguOne Services
Copyright © 2000 -
, TeluguOne - Comedy - All rights reserved.
మై డియర్ రోమియో - 46
స్వప్న కంఠంనేని
"హనిత నాది. ఆమె నాకే దక్కాలి. ఆమెని నేను దక్కించుకుంటాను'' అని అనుకున్నాడు వైభవ్.
తర్వాత లేచి హనితకి ఫోన్ చేశాడు. అవతలివేపు నుంచి హనిత ఫోన్ ఎత్తింది.
"హలో'' అంది.
ఫోన్ చేశాడన్న మాటేగాని వైభవ్ కి అసలేం మాట్లాడాలో అర్థం కాలేదు. మళ్ళీ విసుగ్గా "హలో'' అంది హనిత.
గాజుల గలగలా శబ్దం లాంటి ఆమె స్వర మాధుర్యానికి తన్మయుడై వింటుండి పోయాడు వైభవ్.
అవతల్నుంచి ఫోన్ పెట్టేసిన శబ్దం.
మళ్ళీ ఫోన్ చేశాడు వైభవ్. కాసేపు రింగ్ అయ్యాక హనిత ఫోన్ లిఫ్ట్ చేసింది.
"హలో! ఎవరూ?''
"హనితా! నేను వైభవ్ ని ...''
హనిత ఫోన్ పెట్టేసింది. పట్టువదలని విక్రమార్కుడిలా మళ్ళీ ఫోన్ చేశాడు వైభవ్.
అవతల హనిత ఫోన్ ఎత్తి "హలో'' అనగానే వైభవ్ అరిచేసాడు.
"హనితా! ప్లీజ్. ఫోన్ పెట్టేయకు. నేను చెప్పేది విను. నేను నీతో మాట్లాడాలి''
"ఏం మాట్లాడాలి?''
"రేపు కాలేజీకి రా చెప్తాను'' అన్నాడు వైభవ్.
హనిత నుంచి ఏ సమాధానమూ రాలేదు. ఫోన్ పెట్టేసిందామె.
"ఏమిటీమె? వస్తుందా రాదా? వస్తుందేమోలే. ఒకవేళ రాకపోతే ఎలా?'' లాంటి ఆలోచనలతో వైభవ్ కి ఆ రోజంతా నిద్రపట్టలేదు.
దారి పొడుగునా వైభవ్ ఆలోచనలు హనిత చుట్టూ పరిభ్రమించసాగాయి.
క్లాస్ రూమ్ లో అందరితోపాటు కూర్చుని ఉన్న హనితని చూడగానే అతడి కళ్ళు వికసించాయి.
"హనితా!'' పిలిచాడు.
ఒకసారి తలెత్తి చూసి మళ్ళీ వినిపించనట్టుగా తలదించుకుంది.
మళ్ళీ "హనితా!'' అన్నాడు వైభవ్.
విననట్టుగా మీనాతో అంది హనిత "మీనా! ఇవ్వాళ నువ్వేసుకున్న డ్రెస్ బావుందే ఎక్కడ కొన్నావ్?''
ఒళ్ళు మండింది వైభవ్ కి ఆమె దగ్గరగా వెళ్ళి ఎదురుగా నిల్చుని సీరియస్ గా అన్నాడు.
"హనితా! నేను నీతో మాట్లాడాలి ...''
అతని మాటలు సగంలో ఉండగానే "ఎక్స్ క్యూజ్ మీ'' అంటూ అక్కడ్నుంచి లేచి ముందుకెళ్లింది.
ముందు వరసలో కూర్చున్న అమలని పిలిచి అడిగింది.
"అమలా! నాకు నీ మేథ్స్ నోట్స్ కావాలి, ఎప్పుడిస్తావ్?''
అమల ఏదో చెబుతోంది. విచక్షణ కోల్పోయినట్టుగా వైభవ్ హనిత దగ్గరికి వెళ్ళి ఆమె రెక్క పట్టుకుని బయటికి లాక్కెళ్ళాడు.
అలాగే తీలుకెళ్ళి లాన్ లో విసురుగా కూలేశాడు. మెత్తటి గడ్డిపై పడింది హనిత.
"ఏమైంది నీకు?'' కోపంగా అంది.
తర్వాత వైభవ్ పట్టుకున్న చేయిని "ఉఫ్ ... ఉఫ్!'' అని ఊదుకోసాగింది.
అప్పుడు చూశాడు వైభవ్ ఆమె చేతిని. అతను పట్టుకున్నంత మేరా ఎర్రగా కందిపోయి ఉందామె చేయి.
"ముందు నీకేమైందో చెప్పు'' అన్నాడు వైభవ్.
"నాకేమైంది నేను బాగానే ఉన్నానే''
"మరి ... మరి ... ప్చ్ ... ఎలా అడగాలో నాకర్థం కావటంలేదు. సరే. ఇంతవరకూ వచ్చాక డొంక తిరుగుడెందుకు? నువ్వు వేరే పెళ్ళికి ఎందుకొప్పుకున్నావ్?''
"వ్వాట్! వేరే పెళ్ళా? ఇదే నేను చేసుకోబోయే మొదటి పెళ్ళి కదా ... కొంపదీసి నాకు తెలియకుండానే నాకింతకు ముందు పెళ్ళయిందా ఏమిటి? ముందే చెప్పేయ్ ఎందుకయినా మంచిది'' హాస్యంగా అంది హనిత.
"అయాం నాట్ జోకింగ్! సీరియస్ గా అడుగుతున్నాను చెప్పు. నీకు నేనంటే ఇష్టం కదూ! నువ్వు నన్ను ప్రేమిస్తున్నావ్ కదూ. ఒప్పుకో హనితా'' అన్నాడు వైభవ్.
"మరి నీ దృష్టిలో రోడ్డు పక్కనుండే కుష్ఠు బిచ్చగత్తె, నేనూ ఒకటేనాయె. అసలు స్నేహం అయినా, ఇష్టమయినా, ప్రేమయినా రెండు వైపుల్నుంచీ ఉండాలన్నది నా థియరీ. నాక్కావాల్సింది అవతలి వాళ్ళలో దొరకకపోతే వేరే వాళ్ళలో దాన్ని వెతుక్కుంటాను. అది ఏమీ తప్పు కాదె''
"అదే నేనూ చెప్పేది. నీక్కావాల్సింది దొరక్కపోతే కదా నువ్వు వేరేవాళ్ళలో వెతుక్కోవలసింది. ఇప్పుడేం ముంచుకొచ్చిందని ఆ పెళ్ళికి ఒప్పుకున్నావ్''
"వైభవ్! పంజాగుట్ట రోడ్డు మీద నుంచి స్ట్రెయిట్ గా కాస్త దూరం పొతే ఎర్రగడ్డ వస్తుంది. అక్కడొక మెంటల్ హాస్పిటల్ ఉంది. కొన్నాళ్ళు నువ్వక్కడ ట్రీట్ మెంట్ తీసుకో. ఇంకా నీది బిగినింగ్ స్టేజ్ కాబట్టి తొందరగానే నయమైపోతుందిలే'' చెప్పింది హనిత.
అర్థం కానట్టు వెర్రిమొహం పెట్టాడు వైభవ్. మళ్ళీ తనే దబాయింపుగా అంది హనిత.
"లేకపోతే ఏమిటి? నువ్వు మాట్లాడిన దాంట్లో నాకసలు ఒక్క ముక్క కూడా అర్థం కాలేదు. అసలైనా నువ్వు నన్నెందుకు దబాయిస్తున్నావో నాకర్థం కావట్లేదు. నా పెళ్ళి, నా ఇష్టం. నా పెళ్ళి గురించి నీకెందుకు సంజాయిషీలు ఇచ్చుకోవాలి నేను? ఏదో పిచ్చివాళ్ళం. రోడ్డు పక్కనుండే కుష్ఠు బిచ్చగత్తెలతో సమానమైన వాళ్ళం. మరి మాకూ పెళ్ళిళ్ళవ్వాలి కదా! అందుకే ఎవరో ఒక గంతకు తగ్గ బొంతను వెతుక్కుంటున్నాం. నిన్నయితే చేసుకోమని అడగలేదు కదా. సో, ప్లీజ్! మైండ్ యువర్ బిజినెస్''
తర్వాత అక్కడ్నుంచి లేచి వడివడిగా క్లాస్ వేపుకి నడిచింది.
"బట్ ... బట్ ... ఐ లవ్ యూ హనితా!'' అరిచాడు వైభవ్.
ఆ అరుపు క్యాంపస్ లో ఉన్న వాళ్ళందరికీ వినిపించింది.
అంతా బిలబిలమంటూ టెర్రస్ మీదకూ, అరుగుల మీదకూ గుమికూడి హనిత, వైభవ్ లను వింతగా చోదసాగారు. వైభవ్ మాటలు వినగానే ఉలిక్కిపడ్డట్టుగా ఆగిపోయింది హనిత.
తమ చుట్టూ అన్నివేపులా గుమికూడుతున్న స్టూడెంట్స్ కలకలాన్ని ఓరగా చూస్తూ గమనించిందామె.
ఒక స్థిర నిశ్చయానికి వచ్చినదానిలా ఆగి వెనక్కి తిరిగింది. నెమ్మదిగా వైభవ్ వేపుకు అడుగులు వేయసాగింది. స్వే చేస్తున్నట్టుగా స్లో మోషన్ లో బొమ్మలా కదలసాగిందామె.
|