TeluguOne Services
Copyright © 2000 -
, TeluguOne - Comedy - All rights reserved.
మై డియర్ రోమియో - 29
స్వప్న కంఠంనేని
బేగంపేటలోని 'వాల్డెన్'' ముందు బైక్ నాపాడు వైభవ్.
అది జంట నగరాల మొత్తంలోకి పెద్దదైన గిఫ్ట్ ఎంపోరియమ్.
అందులో అన్ని రకాల బుక్స్, గ్రీటింగ్ కార్డ్స్, గిఫ్ట్ ఆర్టికల్స్ దొరుకుతాయి. లోపలికి అడుగు పెట్టగానే కాళ్ళకు మెత్తగా తగిలే కార్పెట్. పేర ఫ్యూమ్ సువాసనలు, వీనుల విందైన సంగీతం, ఆ షాప్ కి అదనపు హంగులని సమకూరుస్తున్నాయి. అక్కడ గిఫ్ట్స్, బుక్స్ కొనటాన్ని చాలామంది స్టేటస్ సింబల్ గా భావిస్తారు.
"షాప్ మాత్రం చాలా పోష్ గా ఉంది'' అనుకున్నాడు వైభవ్.
ఫ్రెండ్ పెళ్ళికి ఏదైనా మంచి గిఫ్ట్ కొనటానికి వచ్చాడు వైభవ్ ఆ షాప్ లోకి. అక్కడున్న బుక్స్ చూడగానే ముందు కన్ని బుక్స్ సెలెక్ట్ చేసుకున్నాడు. తర్వాత వెళ్ళి నెమ్మదిగా ఒక్కొక్క గిఫ్ట్ ఆర్టికల్స్ పరీశీలించడం మొదలెట్టాడు.
బయట వంద రూపాయలుండే వస్తువు కూడా అక్కడ కనీసం నాలుగు వందలుండటాని గమనించాడు వైభవ్.
ఒక చోట రొటేటింగ్ గాజు అల్మారాలో వివిధ రకాలైన టేబుల్ క్లాక్స్ అతి సుందరంగా సుతారంగా అమర్చబడి వున్నాయి.
సడన్ గా ఒక అరలోని టేబుల్ క్లాక్ అతని దృష్టినాకర్షించింది.
గోల్డ్ కలర్ పూట వేసి ఉన్న ఆ ప్లాస్టిక్ క్లాక్ అతనికి బాగా నచ్చింది.
"ఇదయితే బ్రహ్మాండంగా ఉంటుంది'' అనుకుంటూ దాన్ని చేతిలోకి తీసుకోబోయాడు.
క్లాక్ అయితే అతని చేతిలోకి వచ్చింది గాని దాని తాలూకు స్టాండ్ మాత్రం వూడి రెండు తునకలుగా కిందపడింది.
తను దాన్నలా గట్టిగా లాగాడో, లేకపోతే ముందునుంచే అదలా ఉందొ అతనికర్థం కాలేదు. క్షణంపాటు అతనికేం చేయాలో తోచలేదు.
ఒకసారి అటూ ఇటూ చూసి దగ్గరలో ఎవరూ లేకపోయేసరికి స్టాండు వూడిన టేబుల్ క్లాక్ ని నిశ్శబ్దంగా అరలో వుంచేశాడు.
కిక్కురుమనకుండా ఇవతలికి నడిచాడు.
కౌంటర్ వద్దకు వచ్చాడన్న మాటేగాని లోలోపల అతను గిల్టీగా ఫీలవసాగాడు.
తన వద్ద ఉన్న పుస్తకాల్ని బిల్ చేపిస్తుండగా పక్క నుంచి మెత్తటి స్వరం వినబడింది.
"మిస్టర్ వైభవ్!''
పక్కకు తిరిగి చూశాడు.
హనిత!
"క్లాక్ ని అలా పెట్టేయటం తప్పు కదూ?''
వైభవ్ మోహంలో కత్తివాటుకు నెత్తురు చుక్కలేదు.
"వాట్? వాట్ హాపెండ్?'' అన్నాడు కౌంటర్ లోని క్లర్క్.
"ఏమీలేదండీ, అక్కడ క్లాక్ ఒకటి ఇతని చేతిలో విరిగిపోయింది. ఏమీ ఎరగనట్టు అక్కడ పెట్టేశాడు. అది సభ్యత కాదని ఇతనికి చెబుతున్నాను''
షాప్ లిఫ్టర్స్ ని వాచ్ చేయడం కోసం నియమించిన ఒక బాయ్ ని పిలిచాడు కౌంటర్ క్లర్క్.
"ఆ క్లాక్ ఏదో ఇతనికి చూపించండి ... ప్లీజ్'' అన్నాడు హనితతో.
ఏ తతంగాన్ని చూస్తున్న వైభవ్ కి తల కొట్టేసినంత పనయింది.
"అవసరంలేదు. దాన్ని నేనే తీసుకుంటాను'' అంటూ చకచకా వెళ్ళి వైభవ్ దాన్ని తీసుకువచ్చాడు.
"చూడండి ... దీన్ని నేను విరగగొట్టలేదు. అంతకు ముందే విరిగినట్టు వుంది. సరే ఏదయితే అయింది. దీన్ని కూడా బిల్ చేయండి. నేను పే చేస్తాను'' అన్నాడు.
హనితను నమిలి మింగేయాలన్నట్టుగా ఉందతనికి లోలోపల.
హనిత ఓరకంట వైభవ్ వేపు చిద్విలాసంగా చూస్తూ తనలో తను కులుక్కోసాగింది.
ఆ రోజు దురదృష్టం వైభవ్ ని వెంటాడినట్లుంది.
అతను సెలెక్ట్ చేసుకున్న పుస్తకాలకీ, క్లాక్ కలిపి బిల్లు ఎనిమిది వందల రూపాయలు అయింది.
అతని జేబులో ఆరు వందలు మాత్రమే వున్నాయి.
అతని తడబాటును చూసి క్యాషియర్ అడిగాడు.
"ఏమిటి ... సంగతేమిటి?''
డబ్బులు తక్కువైన విషయాన్ని చెప్పాడు వైభవ్.
క్యాషియర్ ఏదో అనబోతుండగా రెండువందల నోట్లను హనిత కౌంటర్ మీద వుంచింది.
"అతని బిల్లు క్లియర్ చేయండి''
క్యాషియర్ ఆశ్చర్యపోయాడు.
"ఇతను మీకు తెలుసా మేడమ్?''
"మా క్లాస్ మేట్. పాపం ఏదో పొరపాటయిపోయింది లెండి''
ఇంసల్టింగ్ గా ఫీలవుతూ వైభవ్ బయటికి నడుస్తుంటే హనిత అతడివేపు 'పాపం' అన్నట్టుగా వంకరగా చూసింది.
క్షోబించిపోయింది వైభవ్ మనస్సు.
|