మై డియర్ రోమియో 28

Listen Audio File :

Get latest telugu Audio comedy serials My Dear Romeo, telugu serial comics and latest jokes online

 

మై డియర్ రోమియో - 28

 

స్వప్న కంఠంనేని

 

ఆ రోజు సాయంత్రం మీనా, హనితలు కోఠీలో షాపింగ్ చేస్తుండగా మీనా హనితని అడిగింది "హనీ! డూ యూ లవ్ వైభవ్?''
"నేనా? అతన్నా? నెవ్వర్!'' అంది హనిత.
హనిత వైభావ్ని అంతకుముందుళా వాడు, వీడు అని సంబోధించకపోవటాన్ని గమనించి నవ్వుకుంది మీనా.
ఒక బ్యాంగిల్ స్టోర్స్ లోకెళ్ళారు వాళ్ళు.
బ్యాంగిల్ స్టోర్స్ లో నుంచి బయటికొస్తుండగా అంది మీనా.
"హనే! అటు చూడు''
హనిత గభాల్న మీనా చూపించిన వేపు చూసింది.
బ్యాంగిల్ స్టోర్స్ కెదురుగా ఉన్న యూనిక్ జెంట్స్ బ్యూటీ పార్లర్ లోకి వెళ్తున్నాడు ప్రిన్సిపాల్, తను తెల్లబడే బ్యూటీ ట్రీట్ మెంట్ కోసం.
"బేచారా ప్రిన్సిపాల్'' అనుకుంటూ ఇద్దరూ తలలూపుతూ నిట్టూర్చారు.
హనిత హేమంత్ రూమ్ లోకి వెళ్ళింది.
ఆమె వెళ్ళేసరికి హేమంత్ కుర్చీలో కూర్చుని ఏదో దీర్ఘంగా ఆలోచిస్తున్నాడు.
హనిత అతనికెదురుగా కుర్చీ లాక్కుని కూర్చుంది.
"ఒర్ అన్నాయ్! ఎవర్రా ఆ అమ్మాయి?''
ఉలిక్కిపడ్డాడు హేమంత్.
"ఏ అమ్మాయి?'' అన్నాడు.
"రేయ్! నాటకాలాడకురా! నువ్వూ ఆ అమ్మాయి కలిసి వెళ్తుండగా నేనూ మీనా చూశాంలే కానీ ఆ అమ్మాయెవరో ఆమెకీ, నీకూ సంబంధమేమిటో మాత్రం ముందు నువ్వు నాకు చెప్పు'' అంది హనీ.
ఆ అమ్మాయి ఫోన్ చేసిన సంగతి మాత్రం హేమంత్ కి చెప్పదల్చుకోలేదు హనిత.
"నీకెందుకే? నీ పని నువ్వు చూస్తో ఫో'' కసురుకున్నాడు హేమంత్.
"అలాగే! ఇప్పుడే డాడీకి నీ సంగతి చెప్పేస్తాను''
విసవిసా బయటికి నడవబోయింది హనిత.
"తల్లీ కాళికామ తల్లీ! చెబుతాను ఆగు''
చేతులు జోడిస్తూ అన్నాడు హేమంత్.
"అదీ! అలా రా దార్లోకి. ఊ! చెప్పు చెప్పు'' ఆసక్తిగా అంది హనిత.
"ఆ అమ్మాయి నా గాళ్ ఫ్రెండ్. అంటే మేమిద్దరం ప్రేమించుకున్నాం. నేనా అమ్మాయినే పెళ్లి చేసుకుంటాను'' బిడియపడుతూనే స్థిరంగా చెప్పాడు హేమంత్.
"అలాగే చేసుకుందువుగాని, ఇంతకీ ఆ అమ్మాయి పేరేమిటి?''
"వాసంతి''
"పేరు బావుంది. ఆ అమ్మాయి కూడా ఆశా పరేఖ్ ళా చాలా అందంగా ఉంది. మరిక నీ ప్రాబ్లమ్ ఏమిటి? వేరే పెళ్లి చూపులకెందుకు వెళ్తున్నావు. సిగ్గులేదా?''
"ఎం చేయనే. డాడీకి చెప్పాలంటే భయంవేస్తోంది''
"ఎందుకూ భయం? ఆ అమ్మాయికేం తక్కువనీ ...''
"ఏదో తక్కువని కాదు. అన్నీ ఎక్కువే. కానీ వాసంతి భాష వింటే మమ్మీకి హార్ట్ ఫెయిలవటం ఖాయం''
"ఎందుకు? మారా రోజు వాసంతి తెగరెచ్చిపోయి వాగుతుంటే సంబరంగా వింటున్నావుగా. నేకు అర్థమైన భాష మమ్మీకి, డాడీకి మాత్రం ఎందుకు అర్థం కాదు? నాకు తెలిసినంతవరకూ నీకు తెలుగు, ఇంగ్లీష్, హిందీ తప్ప ఒరియా, అస్సామీ భాషల్లాంటివేవీ రావు కదా'' వాసంతి భాష తెలిసి కూడా తెలీనట్టుగా వ్యంగ్యంగా అంది హనిత.
"అబ్బ హనీ! నీ గోల నీదే కానీ చెప్పేది వినిపించుకోవేం. కావాలంటే నువ్వే ఆ అమ్మాయిని కలిసి మాట్లాడు. నీకే అర్థమవుతుంది. వాసంతి మీ కాలేజ్ లోనే చదువుతోంది'' అన్నాడు హేమంత్.
"వ్వాట్? మా కాలేజ్ లోనే. సరే, రేపే ఆమెతో మాట్లాడతాను. అవునుగానీ, నీ సంగతేంటి? ఒరేయ్ ఎప్పుడన్నా నన్ను బయటికి తీసుకెళ్ళావట్రా? ఆ అమ్మాయినైతే ఊరంతా తిప్ప చాక్లెట్లు, బిస్కెట్లు కొనిపెడతున్నావు గాని''అంది.
తర్వాత సడన్ గా గొంతు మర్చి తండ్రి కంఠస్వరాన్ని అనుకరించింది.
"సరే! అయిపోయిందేదో అయిపొయింది. ఇక మీదట ఆ అమ్మాయిని కలవడానికి ప్రయత్నించావంటే షూట్ చేసి పారేస్తాను జాగ్రత్త''
మొదట తండ్రేమోనని గాభరాపడ్డాడు హేమంత్. మళ్ళీ అంతలోనే చిలిపిగా నవ్వుతున్న చెల్లెల్ని చూసి ఆమె మాట్లాడిందని తెలుసుకుని "చంపేస్తాను'' అంటూ చేయేత్తాడు.
హనిత నవ్వునాపుకుంటూ, అతన్ని వెక్కిరిస్తూ అక్కణ్నుంచి బయటకు పరుగెత్తింది.