మై డియర్ రోమియో - 7

Listen Audio File :

Get latest telugu Audio comedy serials My Dear Romeo, telugu serial comics and latest jokes online

 

మై డియర్ రోమియో - 7

 

స్వప్న కంఠంనేని

 

"హనీ ఇవాళ పొద్దున్నే నిద్ర లేచిందేమిటి?'' అన్నాడు హానిత తండ్రి సత్యం భార్య గిరిజతో.
ఈలోగా హానిత స్నానం ముగించి డ్రెసప్ అయి తల్లిదండ్రుల దగ్గరకు వచ్చి కూర్చుంది.
"ఏమ్మా! ఇంత పొద్దున్నే లేచి కాలేజీకి వెళ్తున్నావు. ఎవరికీ మూడిందేమిటి ఈసారి?'' అడిగింది గిరిజ.
"ఫో మమ్మీ! నేనేదో క్లాసెస్ కి బాగా అటెండ్ అయి బాగా మార్క్స్ తెచ్చుకుందామని పొద్దునేలేచి రెగ్యులర్ గా వెళ్తుంటే ఇలా మాట్లాడుతున్నావు. అసలు నువ్విలా మాట్లాడతావు కనుకనే నాకు రెగ్యులర్ గా కాలేజీకి అటెండ్ అవబుద్ధి కాదు'' అంది కోపంగా హానిత.
"ఊ! ఇక నామీదే వేయి నెపం'' అంటూ లోపలి వెళ్ళిపోయింది గిరిజ.
"చూసారా డాడీ! మమ్మినెలా పంపించేశానో ఇక్కడనుండి'' అంది గర్వంగా హానిత. లోపలికెళ్తున్న తల్లివైపు చూస్తూ తండ్రీకూతుళ్లు నవ్వుకున్నారు.
"ఏం హనీ! నువ్వు నిజంగా మార్కుల కోసమే కాలేజీకి వెళ్తున్నావా?'' అడిగాడు తండ్రి.
"ఊ! ఇక నాకేం పని లేదనుకుంటున్నావా డాడీ! మా కాలేజీలో ఒకబ్బాయి కొత్తగా చేరాడు. వట్టి పల్లెటూరి శాల్తీ. మేమెంత ఆట పట్టించినా ఉడుక్కోవడం లేదు. కాకపొతే మమ్మల్ని చూస్తె చాలు అవతలికి వెళ్ళిపోతున్నాడు. భలే చిరాకు వేస్తోందనుకోండి'' అంది హానిత.
"అయితే ఇప్పుడతని ప్రాణాలు తియ్యడానికేనా నువ్వింత తొందరగా బయలుదేరింది?'' నవ్వుతూ అన్నాడు సత్యం.
"ఆఫ్ కోర్స్! అవుననుకోండి. అయినా పల్లెటూరివాడికి కూడా అంత పొగరేంటి?'' విసుగ్గా మొహం పెట్టింది హానిత.
"నువ్వా మాటంటే నేనొప్పుకోనమ్మా. నేను మాత్రం పల్లెటూరి వాడికి కాదేంటి? ఆ మాటకొస్తే నువ్వు ఆరేళ్ళువచ్చేవరకూ పల్లెటూర్లోనేగా పెరిగింది. ఆ తర్వాతేగా మనిమిక్కడికి వచ్చి ఫ్యాక్టరీ పెట్టుకున్నాం'' అన్నాడు అలిగినట్లుగా మొహం పెట్టి.
"సర్సారే! సారీ డాడీ! ఇంకెప్పుడూ పల్లెటూరివాడని అనను. సరేనా? ఇక నాకు కాలేజీకి టైమయ్యింది. బై డాడీ!''
పరిగెత్తింది హానిత.
"ఏయ్ పిల్లా! టిఫిన్ తినవా?'' వెనుకనుంచి కేకేశాడు సత్యం.
"నాకు టైం లేదు డాడీ. బై'' అరిచింది హానిత.
సరిగ్గా కాలేజీగేటు ముందు ఎదురుపడ్డారు హానిత, వైభవ్ లు. ఒకరినొకళ్ళు చూడగానే ఇద్దరూ మొహాలు చిట్లించి పక్కకు తప్పుకున్నారు.
హానిత ముందు తన కైనటిక్ హోండాని పార్క్ చేసి గబగబా క్లాస్ లోకి వెళ్ళిపోయింది.
వైభవ్ బైక్ పార్క్ చేసి వస్తుంటే వెనుకనుంచి "హాట్ వైభవ్'' అన్న పిలుపు వినిపించింది.
వెనక్కి తిరిగి చూసేసరికి సురేష్, సురేష్ తో పాటు ఒక అందమైన అమ్మాయి.
"హాయ్!'' అన్నాడు వైభవ్ కూడా పలకరింపుగా.
"సుదేష్ణా! నేను చెప్పాను చూడు కొత్తగా జాయిన్ అయ్యాడని. వైభవ్ అంటే ఇతనే. వైభవ్ సుదేష్ణ అని మన క్లాస్ మేట్'' ఇద్దరినీ ఒకళ్ళకొకళ్ళకి పరిచయం చేశాడు సురేష్.
ముగ్గురూ మాట్లాడుకుంటూ క్లాసుకు చేరుకున్నారు.
వీళ్ళు వెళ్ళేసరికి క్లాసంతా నానా గందరగోళంగా వుంది.
హానిత మధ్యలో కూర్చుని ఏదో చెబుతోంది.
క్లాసంతా ఆమె చుట్టూ మూగి వున్నారు.
మీనా క్లాస్ లో ప్రతివాళ్ళ దగ్గరికి వెళ్ళి "చచ్చిపోవా! ప్లీజ్!'' అనడుగుతోంది. చాలా బిజీగా వుంది.
ఆ బిజీలో ఆమె వైభవ్ వాళ్ళు రావడాన్ని గమనించలేదు.
వైభవ్ క్లాస్ లోకి రావడాన్ని చూడగానే హానిత అరిచింది.
"ఒసేవ్ మీనా! మీ ఆయనొచ్చాడే
మీనా మొహం చాటంత చేసుకుంది.
మెలికలు తిరిగిపోతూ వైభవ్ దగ్గరకు వెళ్ళి నిలబడింది.
వైభవ్ కి తన ముందు నిలబడిన మీనాని చూడగానే గ్రేట్ వాల్ ఆఫ్ చైనా గుర్తొచ్చింది. గబగబా వెనక్కి జరిగాడు.
సురేష్ తో అన్నాడు అయోమయంగా.
"క్లాస్ రూమ్ మధ్యలో గోడెప్పుడు కట్టించారు?''
క్లాసంతా గొల్లుమన్నారు.
హనితకి కూడా నవ్వొచ్చింది. కానీ మూతి బిగించి నవ్వాపుకుంది.
ఇంతలో మీనా వైభవ్ తో అంది "ఏంటి బావా? నన్నొదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళిపోయావ్. ఇన్నాళ్ళూ నువ్వేమైపోయావోనని నేనెంత కంగారుపడ్డానో తెలుసా?''
అదిరిపడ్డాడు వైభవ్.
ఈలోగా ప్రిన్సిపాల్ క్లాస్ రూమ్ లోకి అడుగుపెట్టాడు.
ప్రిన్సిపాల్ ని చూడగానే క్లాసంతా నిశ్శబ్దంగా అయిపొయింది.
ఎవరి సీట్లలో వాళ్ళు వెళ్ళి కూర్చున్నారు.