Antera Bamardee 21

 

This story is a courtesy of Padma Bhushan Varaprasad Reddy

అంతేరా బామ్మర్దీ - 21

" ఇప్పుడు ఆ సింగినాదం గాడు నా పీక పిసకలేడు! ఎంచేత అని అడుగు "

" ఇంత తెలిసిన తరువాత ఎట్లా అడగ్గలను సార్ ? అగడలేను "

" ఏం తెలిసింది ? ముందుగా అది చెప్పు "

" మీరు నాయరూ కాదు. మీ ఫ్రండు కుట్టీ కాదు " అని అన్నాడు పాణి.

" పైగా సింగినాదం అడక్కుండానే వాడి బామ్మర్దీకి ఉద్యోగం కూడా యిచ్చేసెను "

" అంచేత చాలా నేరోగా చావు తప్పించుకున్నారు సార్ "

ఆ మాటకి బసవరాజు నొచ్చుకున్నాడు కాబోలు. పాణి వైపు సీరియస్ గా చూసేడు. ఆ చూపుని భరించలేని పాణి అక్కడి నుంచి పారిపోయే ప్రయత్నంలో " ఎక్సూజ్మీ సార్ ! నన్నెవరో పిలుస్తున్నారు. మళ్ళా కలుస్తాను సార్ " అని ఆ గదిలో నుంచి పారిపోతున్నాడు పాణి.

****************

రంగనాథం ఇల్లు. రంగనాథం దంపతుల ముందు వేణు దోషిలాగా నిలబడి ఉన్నాడు. రంకెలు వేస్తున్నాడు రంగనాథం.

" నీ బావని అవమానించిన ఆ డకోటాగాడి దగ్గిర ఉద్యోగం చేస్తావా ? ఉద్యోగం ? వీల్లేదు " అని చేతిలో ఉన్న సిగరెట్టు పాకెట్ ను విసిరేశాడు.

వేణు అనునయంగా అంటున్నాడు " బసవరాజు గార్ని నువ్వు అపార్థం చేసుకుంటున్నావు బావా ! అని.

" నోరు మూయ్ " అని అక్కడికి దగ్గర్లో ఉన్న బట్టల స్టాండు దగ్గరికి వెళ్లి, దాని మీదున్న దుస్తుల్ని యిష్టం వచ్చినట్లు విసిరేస్తూ అన్నాడు మళ్ళీ. " చెడ్డీలు చెడ్డీలు తొడుక్కునే వయస్సు నుంచి వాడు నాకు తెలుసు! జాకాల్ గాడు! వదిలేయ్ వాడిని " అని గబగబా ఫోన్ దగ్గరికి వెళ్లి డయల్ చేస్తున్నాడు.

" ఫోన్ ఎవరికీ బావా ?" అని ఆందోలనగా అడిగాడు వేణు.

" రైల్వే ఎంక్వయిరీస్ ? హల్లో...రైసుమిల్లా రాంగ్ నెంబర్! పెట్టేయండి ఫోన్ "

వేణుకి అర్థంకాక అడిగాడు " ఇప్పుడు రైల్వే ఎంక్వయిరీస్ తో పనేమిటి " అని.

" నాగపూర్ రైలు ఎన్నింటికో కనుక్కోవాలి గదా " అన్నాడు రంగనాథం.

" నాగపూరా?"

" అవును...నాగపూరే! ఇక నీ ఉద్యోగం అక్కడే " అన్నాడు రంగనాథం.

" క్షమించు బావా! మిమ్ముల్ని విడిచి నాగపూర్ వెళ్ళలేను " అన్నాడు వేణు.

" మేం కూడా నీతోపాటే నాగపూర్ వస్తున్నాం " అన్నాడు రంగనాథం.

" సొంత ఊళ్లోనే మంచి ఉద్యోగం దొరికినప్పుడు నాగపూర్ ఉద్యోగం ఎందుకు? అక్కడ ఇంటి అద్దెకి సగం జీతం తగలెయ్యాలి. ఇక్కడ సొంత ఇల్లు "

" సొంత ఇల్లు ! ఎవరికీ...ఎవరికిరా సొంత ఇల్లు..నీకు కాదు "

" బావా "

" బసవగాడి కంపెనీలో చేరీన తరువాత ఈ ఇంట్లో నీకు స్థానం లేదు! వుండదు " అంతవరకు మౌనంగా ఉన్న అన్నపూర్ణ కలగాజేసుకుంది.

" అవేం మాటాలండీ ?" అని.

" అడుగు నీ తమ్ముడ్ని ! నాగపూర్ వెడతాడ వెడతాడు. సుఖపడతాడు.బసివిగాడి కంపెనీలో చేరి బలైపోతాడా పోతాడు ! సుఖపడతాడో బలైపోతాడో ఏదో ఒకటి తెల్సుకోమ్మను " అన్నాడు రంగనాథం.

వేణు తన గదిలోకి వెళ్తున్నాడు.

అది చూసిన రంగనాథం " అటేక్కడికి " అన్నాడు మరింత కోపంగా.

" ఈ ఇంట్లో నాకు స్థానం లేదని తెల్సిన తరువాత నా వస్తువులు మాత్రం ఇక్కడ ఎందుకు ఉండాలి ?" అన్నాడు వేణు.

" అంటే...ఇంత చెప్పినా నువ్వు నీ బావని కాదని ఆ బసివిగాడికె ఓటు వేస్తున్నావా ?" అన్నాడు రంగనాథం.

బావగారి మాటల్ని పట్టించుకోకుండా వేణు తన గదిలోకి వెళ్ళిపోయాడు.

అన్నపూర్ణమ్మ భయభయంగా భర్తవేపు చూస్తుంది.

(ఇంకావుంది)

హాసం సౌజన్యంతో