అమ్మో అమ్మాయిలు 39

Listen Audio File :

బిందురేఖతో అబ్బులు ప్రత్యక్షమయ్యాడు. “రాత్రి నీ మూలకంగా....” అని వ్యాకర్ణ ఏదో అనబోతే. అబ్బులు వ్యాకర్ణ నోరు మూసి "నా కథ విను" అని కథ మొదలు పెట్టాడు.

“మీ జంట కథ బామ్మగారితో చెపుతుంటే విన్నరా కర్ణా! ఇహ నువ్వు చెప్పొద్దు. ఈ బిందురేఖ వుంది చూశావ్ మా చెడ్డపిల్ల మేం మీలాగా ముసుగులో గుద్దులాట ఆదుకోలేదు. పబ్లిక్ గా మాట్లాడుకుని పబ్లిక్ గా ప్రేమించుకున్నాము. నా ప్రేమ నిజమైంది. అవునో కాదో అని తమది మధ్యరకం సంసారమని కట్నం ఇచ్చుకోలేమని చెప్పింది. కట్నం తీసుకోవటం మా యింటా వంటా లేదు. నీకు తెలిసిందే కదా! పెళ్ళి విషయంలో కూడా పూర్తి స్వాతంత్ర్యం ఇచ్చారు మా అమ్మానాన్నా. విషయమంతా నా నోటంట లాగి తన విషయం ఇవాళ బయటపెట్టింది. కొన్నాళ్ళు జాబ్ చేయాలనే కుతూహలంతో ఈవూరు వచ్చిందట. వాళ్ళది పల్లెటూరుట, పొలాలు ఇల్లు వున్నాయి.  ఒక అన్న వున్నాడు యిది కథ. అమ్మా నాన్న పెళ్ళికి అభ్యంతరం పెట్టరని చెప్పింది.

ఈ ఆడాళ్ళు మా చెడ్డ వాళ్ళురా, మనిద్దరం వీళ్ళ నే పరీక్షా చేయలేదు. వీళ్ళు మాత్రం మనల్ని శల్య పరీక్ష చేసి భర్తలుగా ఎన్ను కున్నారు. ఒరేరోయ్ ఇంకోటి మర్చిపోయాను నా ఉత్తరం నేను బిందురేఖ చేతిలోనే పెట్టాను, అది చదివి తమాషా చేయటానికి జయచిత్రచేతిలో తాను పెట్టిందట"

“ఏం పని చేశావ్?” అంది జయచిత్ర.

“ఏదో ఒకటి చేయకపోతే ఎలా?” అంది బిందురేఖ.

“ఎలాగో అలా పెళ్ళెట్టా అవుతుంది! కథెలా కంచికెళుతుంది?” అన్నాడు అబ్బులు.

“అలా అన్నావ్ బాగుంది" అన్నాడు వ్యాకర్ణ.

నలుగురు నవ్వేసుకున్నారు. ఆ తరువాత ఆశీర్వదించమని బామ్మగారి కాళ్ళమీద అబ్బులు బిందురేఖళు పడ్డారు.

బామ్మగారు "హారి పిడుగుల్లారా! పది కాలాలపాటు చల్లగా వుండండి" అని దీవించారు. తెల్లారి అందరికి ఉత్తరాలు రాసేస్తానంది. ఆలస్యం చేస్తే లాభం లేదండి సరే అన్నారు వీళ్ళు. చెవిటి ధర్మరాజు ఏదో పనుండి బామ్మగారి దగ్గరకు వచ్చాడు, బోలెడు సంతోషంగా వున్న బామ్మగారు పిల్లల పెళ్ళిళ్ళ విషయం చెప్పింది.

ఆయకువినపడదని చెప్పి చెయ్యిపెట్టి చూపించి జంటలని, తాళిబొట్టు త్వరలో కడతారని పెళ్ళని చేతులు తిప్పుతూ చెప్పింది. “నలుగురు పెళ్ళి కెళూతున్నారా? ఏవూరో? ఓహో ఆలూరా! బాగుంటుందోయ్, వెళ్లిరండి ఎవరిదీ పెళ్ళి! అహో మీవాళ్లదేనా? సరిసరి చెప్పావు కాదూ!” అని ప్రశ్నలు సమాధానాలు అన్నీ ఆయనే చెప్పుకుని వెళ్ళిపోయాడు.

బామ్మగారు అన్ని విభాగాల్లో వాళ్ళకి పెళ్ళి విషయం చెప్పటానికి ఆదరా బాదరాగా ముళ్లకిరీటం సరిచేసుకుని ముందుకి లాక్కుంటూ వెళ్ళింది.

వ్యాకర్ణ జయచిత్ర దగ్గరకు అబ్బులు బిందురేఖ దగ్గరకు జరగబోయారు. “దూరం దూరం" అంది జయచిత్ర.

“ఏం!” అన్నాడు వ్యాకర్ణ కళ్ళెగరేసి.

“మీ వేడిగాలి తగిలితే........” అంది బిందురేఖ.

“అవునోరోయ్ కర్ణా! అప్పుడు మనం సినిమా కథలు చెప్పుకున్నాం గుర్తుందా? అదీ వీళ్లభయం" అన్నాడు అబ్బులు.

“ఓహో అదా? పెళ్ళయిందాకా ఇంతేనా అబ్బా!”

“అవునబ్బా" అన్నాడు అబ్బులు.

“అప్పటిదాకా ఎలాగో అలా గడపలేరా?” అంది జయచిత్ర.

“ఎలాగో అలా గడిపేయండి" అంది బిందురేఖ.

“అమ్మో జయచిత్రా! మా పాఠం మాకే అప్పగిస్తున్నావే?” అన్నాడు వ్యాకర్ణ.

“అబ్బో, వ్యాకర్ణ తక్కువ తిన్నదేమిటి మహా తలనొప్పి" అంది బిందురేఖ.

“అమ్మో జయచిత్రా! అబ్బో వ్యాకర్ణం, అందరం వున్నాము. నా బిందురేఖ ఏదిరా మన మధ్య" అబ్బులు వ్యాకుల పడుతూ అన్నాడు.

“అరె భాయ్, మన వెనుక ముందు మధ్య బిందువులు (చుక్కలు) రేఖలు (గీతాలు) వుంటాయిరా" అన్నాడు వ్యాకర్ణ.

బామ్మగారు పెళ్ళి కబురు చెప్పి తిరిగొచ్చేటప్పటికి నలుగురు విరగబడి నవ్వుతున్నారు. ఎందుకో తెలియకపోయినా బామ్మగారు నవ్వారు "ఈ కాలం పిల్లలు ఏదొచ్చినా పట్టలేరు" అనుకున్నారు.